వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ టీం నిధులను విచ్చలవిడిగా ఖర్చుచేసిందని ద టెలిగ్రాఫ్ కథనం పేర్కొంది. ఒక్క ఐస్ క్రీములు, పుడ్ డెలివరీ పైనే 24 వేల డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.20,27,465) ఖర్చుపెటిందని తెలిపింది. దాతలు ఇచ్చిన రూ.12.50 వేల కోట్లను డెమోక్రాట్లు వృధా చేశారని వెల్లడించింది. ఫెడరల్ ఎన్నికల సంఘం ఇచ్చిన డేటా ఆధారంగా ఈ వివరాలు తెలిపామని పేర్కొంది. ‘‘ఉబెర్ ఈట్స్ అండ్ డోర్ డాష్ వంటి యాప్ లకు రూ.12.50 లక్షలను డెమోక్రాట్లు చెల్లించారు. అలాగే ఐస్ క్రీములపై రూ.7.5 లక్షలు ఖర్చుచేశారు.
ఆరిజోనా బోర్డ్ గేమ్ కఫే స్నేక్స్ అండ్ లాట్స్ కు రూ.5 లక్షలు పెట్టారు. ప్రచారం చివరి దశలో ప్రైవేటు జెట్లపై రూ.22 కోట్లు ఖర్చుచేశారు. డెమోక్రాట్ పార్టీ వీరాభిమానులను సైతం ఇది విస్మయపరిచింది. దక్షిణ ఫ్లోరిడాకు చెందిన ప్రైవేట్ జెట్ సర్వీసెస్ గ్రూప్ కు కమల బృందం రూ.18.50 కోట్లు, వర్జీనియాకు చెందిన అడ్వాన్స్ డ్ ఏవియేషన్ టీంకు రూ.3.6 కోట్లు రుణపడి ఉంది” అని టెలిగ్రాఫ్ తన కథనంలో వివరించింది. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. డెమోక్రాట్ల కన్నా తక్కువ ఖర్చుపెట్టారని వెల్లడించింది. హారిస్ బృందం ప్రస్తుతం రూ.169 కోట్ల అప్పుల్లో ఉందని భావిస్తున్నారు.