సమ్మె చేస్తే సస్పెండ్ : ఫీల్డ్​ అసిస్టెంట్లపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

రాష్ట్రవ్యాప్తంగా 4 వేల మంది సస్పెన్షన్​
సమ్మెలో ఉన్న ఫీల్డ్​ అసిస్టెంట్లపై ప్రభుత్వం కఠిన నిర్ణయం
సగటున 30 పనిదినాలు కల్పించినోళ్లకు  మినహాయింపు
కొనసాగుతున్న ఆందోళనలు

హైదరాబాద్, వెలుగు:  సమ్మెలో ఉన్న ఉపాధి హామీ పథకం ఫీల్డ్​ అసిస్టెంట్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తోంది. వారిని ఆందోళనకు గురిచేసే విధంగా సస్పెన్షన్లు మొదలుపెట్టింది. ఆయా జిల్లాల డీఆర్డీఓలు ఇప్పటికే 4 వేల మందిని సస్పెండ్​ చేశారు. ఫీల్డ్​ అసిస్టెంట్ల కాంట్రాక్ట్​ రెన్యువల్​కు గతంలో జారీ చేసిన సర్క్యులర్​ నంబర్​ 4779 ని రద్దు చేయాలని, హెచ్ఆర్​ పాలసీని అమలు చేయాలనే డిమాండ్లతో ఫీల్డ్​అసిస్టెంట్లు ఈ నెల 12 నుంచి ఆందోళనలు  చేస్తున్నారు. వీరి సమ్మెకు రెండు రోజుల ముందే విధులకు హాజరు కాని వారి స్థానంలో పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించాలని  గ్రామీణ అభివృద్ధి కమిషనర్ రఘునందన్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సమ్మె చేస్తున్న ఫీల్ట్ అసిస్టెంట్లను ఒక్కొక్కరిగా సస్పెండ్ చేస్తున్నారు. మూడు రోజుల్లోనే  ఒక్కో జిల్లాలో 150 నుంచి 200 మందిని సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు.

30లోపు కల్పించినవాళ్లపై వేటు

ఫీల్డ్​ అసిస్టెంట్ల సస్పెన్షన్ల విషయంలో అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫీల్డ్​ అసిస్టెంట్లంతా సమ్మెలో ఉన్నప్పటికీ యాక్టివ్​జాబ్​కార్డులకు సగటున 30 పని దినాలకుపైగా పని కల్పించిన వారిపై వేటు వేయడం లేదని సమాచారం.  30లోపు  పనిదినాలు కల్పించిన వారినే సస్పెండ్ చేశారు. సమ్మెను నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఫీల్డ్  అసిస్టెంట్స్​ జేఏసీ నేతలు ఆరోపించారు.  సీయూజీ లో భాగంగా ఇచ్చిన సిమ్ కార్డులను సైతం తీసుకొని పంచాయతీ సెక్రటరీలకు ఇస్తున్నారు.

నేడు అంబేద్కర్​ విగ్రహాలకు వినతులు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఆందోళనలో భాగంగా బుధవారం అంబేద్కర్​ విగ్రహాలకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు ఫీల్డ్​అసిస్టెంట్ల జేఏసీ నాయకుడు శ్యామలయ్య వెల్లడించారు. 4779 సర్క్యులర్​ను రద్దు చేసేవరకు తమ సమ్మె కొనసాగుతుందని ఆయన తెలిపారు.