పొంగులేటి, జూపల్లి వెంట ఎవరెవరు?

  • పొంగులేటి, జూపల్లి వెంట ఎవరెవరు?
  • ఉమ్మడి ఖమ్మం,పాలమూరు జిల్లాల్లో ప్రభావం

నెట్​వర్క్, వెలుగు : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని బీఆర్ఎస్ నుంచి​సస్పెండ్​ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్​టాపిక్​గా మారింది. వీరిద్దరూ బీజేపీలోకి లేకపోతే  కాంగ్రెస్​లోకి  వెళతారని, లేదంటే కొత్త పార్టీ పెడతారనే ప్రచారం సాగుతోంది. కాగా, వీరిద్దరి  ప్రభావం ఉమ్మడి మహబూబ్​నగర్, ఖమ్మం జిల్లాల రాజకీయాల మీద ఎక్కువగా ఉన్నందున, అక్కడి నుంచి భారీగా వలసలు ఉండే అవకాశముందంటున్నారు.

ముఖ్యంగా బీఆర్ఎస్​ అసంతృప్తులే క్యూ కడ్తారని చెప్పుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టే మంగళవారం జూపల్లి కృష్ణారావు.. వనపర్తి జడ్పీ చైర్మన్​ లోక్​నాథ్​రెడ్డికి ఫోన్​ చేయడం ఆసక్తి రేపుతోంది.  అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటికి మద్దతుగా పలువురు బీఆర్​ఎస్​ కార్యకర్తలు, నాయకులు పదవులకు రాజీనామాలు చేశారు.  

మంత్రిపై బద్​లా తీర్చుకునే ప్లాన్​

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అచ్చంపేట, గద్వాల, నాగర్​కర్నూల్, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, మక్తల్ నియోజకవర్గాల్లో సొంత వర్గం ఉంది.  2018 ఎన్నికల్లో బీఆర్ఎస్​ తరఫున కొల్లాపూర్ లో  పోటీ చేసిన జూపల్లి..  కాంగ్రెస్​ అభ్యర్థి బీరం హర్షవర్ధన్​రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆయన ఓటమికి ఇప్పటి మంత్రి  సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి కారణమన్న ఆరోపణలున్నాయి.

హర్షవర్ధన్​రెడ్డి గెలిచిన తర్వాత బీఆర్ఎస్​లో చేర్చుకోవడంలోనూ వీరిద్దరూ కీ రోల్​పోషించారన్న టాక్​ ఉంది. తాజాగా జూపల్లి సస్పెన్షన్​కు గురి కావడంతో..ఉమ్మడి జిల్లాలోని అసమ్మతి నేతలు ఆయనతో టచ్​లోకి వచ్చినట్టు తెలుస్తోంది.  బీఆర్ఎస్​కు ఇటీవల రాజీనామా చేసిన వనపర్తి జడ్పీ చైర్​పర్సన్​ లోక్​నాథ్​ రెడ్డి, పెద్దమందడి మేఘారెడ్డి, వనపర్తి కిచ్చారెడ్డితో జూపల్లి అనుచరులు మాట్లాడారని, తమతో కలిసివస్తే తాము ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ నుంచి వనపర్తి అసెంబ్లీ టికెట్​ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

వనపర్తిలో మంత్రిని ఓడించి బద్​లా తీర్చుకోవాలని ఆశిస్తున్న జూపల్లికి వారు మద్దతు ఇవ్వడానికి రెడీ అయినట్టు చెప్తున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డితో జూపల్లికి మంచి సంబంధాలున్నాయి. ఇక్కడ మంత్రి నిరంజన్​రెడ్డి..జడ్పీ చైర్​పర్సన్​సరితకు లిఫ్ట్​ఇస్తుండడంతో కృష్ణమోహన్​రెడ్డి నారాజ్​గా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో పరిస్థితులను బట్టి ఆయన కూడా జూపల్లి చెంత చేరే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు బద్ద శత్రువుల్లా ఉన్న జూపల్లి, డీకే అరుణ ఇప్పుడు పగలు మరిచిపోయారు. జూపల్లి సస్పెండ్​కావడంతో సోమవారం డీకే అరుణ ఆయనకు  ఫోన్​ చేసి .. బీజేపీలో చేరాలని ఆహ్వానించినట్లు తెలిసింది.  బీజేపీ చేరికల కమిటీ చైర్మన్​ఈటల రాజేందర్​తోనూ చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.

పొంగులేటి గూటికి భారీ వలసలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి వెంట చాలామంది వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం సీనియర్ నేత, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావ్, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, మేకల మల్లిబాబు యాదవ్, రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ వెంట ఉన్నారు.

అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత, అశ్వారావుపేటకు చెందిన సీనియర్ నేత జారే ఆదినారాయణ, టీబీజీకేఎస్ మాజీ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు, ఉద్యమ కారులు వూకంటి గోపాల్ రావు, ఆళ్ల మురళి, తూమ్ చౌదరి, నాగేంద్ర త్రివేది, సాంబమూర్తి, బోళ్ల సూర్యం, జూపల్లి రమేశ్, బీఆర్ఎస్​లీడర్లు  చింతా నాగరాజు, ఎర్రం శెట్టి ముత్తయ్య, చీకటి కార్తీక్,  జాలే జానకి రెడ్డి,  కరివేత వెంకటేశ్వరరావు పొగులేటి శ్రీనివాసరెడ్డితోనే  ఉన్నారు. ఆయన సస్పెండ్​ కావడంతో జిల్లాకు చెందిన బీఆర్ఎస్​ లీడర్లు, ప్రజాప్రతినిధులు మద్దతు ప్రకటించే చాన్స్​ఉంది.

కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం ఏరియాల్లోని టీబీజీకేఎస్ యూనియన్ నుంచి కూడా చాలామంది వెళ్లే అవకాశం ఉందంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి కూడా పొంగులేటి తో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. శశిధర్​రెడ్డి గతంలో కోదాడ  మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా పొంగులేటి వెంట వెళ్తారని ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల్లోనే ఈ వలసలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది.