- తాలిబాన్ల చెరలో కాందహార్
- అఫ్గానిస్తాన్‌లో మూడింట రెండొంతుల భూభాగం వారి కంట్రోల్లోనే..
- ఇంకో వారంలో దేశమంతా ఆక్రమిస్తామన్న తాలిబాన్లు
- కాబూల్‌లోని ఎంబసీలను ఖాళీ చేస్తున్న దేశాలు
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు దాడులకు తెగబడుతూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా నగరాలు, ప్రావిన్సులను ఆక్రమించుకుంటున్నారు. తాజాగా దేశంలోని పెద్ద నగరమైన కాందహార్‌ను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ప్రస్తుతం అఫ్గాన్‌లోని మూడింట రెండొంతుల కన్నా ఎక్కువ భూభాగం వాళ్ల కంట్రోల్‌లో ఉంది. దక్షిణ అఫ్గానిస్తాన్ మొత్తం టెర్రరిస్టుల చేతిలోకి వెళ్లిపోయింది. దేశంలోని 34 ప్రావిన్సుల్లో 17 ప్రావిన్సులను ఆక్రమించేశారు. ఇప్పటివరకు దేశ రాజధాని కాబూల్ లక్ష్యంగా తాలిబాన్లు దాడులు చేయకున్నా దాని చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమిస్తూ వస్తున్నారు. మరో వారంలోనే కాబూల్ సహా దేశమంతా తమ అధీనంలోకి తీసుకుంటామని తాలిబాన్లు చెప్పారు. ఎన్జీవోలు, విదేశీ సంస్థలపై తాము దాడి చేయట్లేదన్నారు. హింస, విధ్వంసం సృష్టించడం తమ ఉద్దేశం కాదని చెప్పారు.
ఎంబసీలను ఖాళీ చేస్తున్న దేశాలు
దేశంలో పరిస్థితులు చేయి దాటిపోతుండటంతో కాబూల్‌లో ఉన్న అమెరికా ఎంబసీ నుంచి అధికారులను వెనక్కి రప్పించేందుకు 3 వేల బలగాలను పంపాలని అమెరికా ప్లాన్ చేస్తోంది. బ్రిటన్ ప్రజలకు సాయం చేసేందుకు 600 ట్రూప్స్‌ను పంపుతామని ఆ దేశం చెప్పింది. తమ ఎంబసీని ఖాళీ చేసేందుకు కెనడా స్పెషల్ ఫోర్సెస్‌ను పంపుతోంది. పాకిస్తాన్ తమ చమన్ బార్డర్‌ను ఓపెన్ చేసింది. గత కొన్ని వారాలుగా అక్కడ చిక్కుకున్న వాళ్లను అనుమతిస్తోంది. తాలిబాన్లతో చర్చల తర్వాత బార్డర్‌ను తెరిచామని పాక్ అధికారులు చెప్పారు.
పట్టుబడ్డ సైనికులను చంపేస్తున్నరు
స్థానిక ప్రజలపై తాలిబాన్లు దాడి చేస్తున్నారని, దొరికిన అఫ్గాన్ సైనికులను చంపేస్తున్నారని తాలిబాన్లు ఆక్రమించుకున్న ప్రాంతాల్లోని ప్రజలు చెబుతున్నారు. తమకు చిక్కిన సైనికులను తాలిబాన్లు చంపడంపై అమెరికా ఎంబసీ కూడా తీవ్రంగా మండిపడింది. పెళ్లి కాని యువతులు తమ ఫైటర్లను పెళ్లి చేసుకోవాలంటూ తాలిబాన్లు ఒత్తిడి చేస్తున్నట్టు అక్కడి మీడియా సంస్థలు వార్తలు రాసుకొచ్చాయి.