పెళ్లిచూపుల మేళా.. 250 ఏళ్ల చరిత్ర

తార్నెతర్.. గుజరాత్ లోని ఓ చిన్న పల్లె. సౌరాష్ట్ర ప్రాంతంలోని ఈ ఊరిలో భాద్రపద నెలలో  ప్రతి ఏడాది మూడు రోజుల పాటు వేడుకలు జరుగుతాయి.ఈ వేడుకలు  పూర్తిగా డిఫరెంట్. ఆటలు పాటలతో అంతా ఫుల్ జోష్ లో ఉంటారు. పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు ఈ వేడుకల్లో  చేసే సందడి అంతా ఇంతా కాదు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో అడుగడుగునా గుజరాత్ సంస్కృతి కనిపిస్తుంది.

చేతుల్లో గొడుగులతో అబ్బాయిలు

జిగేల్మనిపించే డ్రస్సులేసుకున్న అబ్బాయిలు చేతుల్లో  గొడుగులేసుకుని  వేడుకలు జరిగే ప్రాంతమంతా  హల్ చల్ చేస్తుంటారు. చేతిలో గొడుగు ఉందంటే పెళ్లి కాలేదని, సరైన జోడీ కోసం ఎదురుచూస్తున్నాడని అర్థం.వీళ్ల డ్రస్సు కూడా డిఫరెంట్ గా ఉంటుంది. రంగురంగుల ధోతీలు కట్టుకుంటారు. నెత్తికి తలపాగాలు చుడతారు. అమ్మాయిలను అట్రాక్ట్ చేయడానికి ఆడతారు….పాడతారు. తమకు తెలిసిన విద్యల్లో సత్తా చాటతారు. అమ్మాయిలు రెడ్ కలర్ ఘాఘ్రా చోళీలు వేసుకుని  వేడుకలకు గ్లామర్ తీసుకువస్తుంటారు.

త్రినేత్రేశ్వర్  మహదేవ్ గుడి కేంద్రంగా  వేడుకలు

ఇక్కడి ‘ త్రినేత్రేశ్వర్ మహదేవ్ ’ గుడి  గుజరాత్ లో బాగా ఫేమస్. ఈ గుడి కేంద్రంగానే అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతాయి. ఈ గుడి ఇప్పటిది కాదు. సోలంకి రాజుల హయాంలో కట్టారు. గుడి నిర్మాణంలో గుర్జార్ ప్రతిహార్ స్టయిల్ అడుగడుగునా కనిపిస్తుంటుంది. 19వ శతాబ్దంలో త్రినేత్రేశ్వర్ గుడి శిథిలావస్థకు చేరుకుంది. దీంతో వడోదర ప్రాంతానికి చెందిన రాజులు రంగంలోకి దిగి గుడికి రిపేర్లు చేయించారు. గుడిలో మొత్తం మూడు చెరువులు బ్రహ్మ కుండ్, శివ్ కుండ్, విష్ణు కుండ్ ఉంటాయి. వీటిలో స్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసిన పుణ్యం దక్కుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం.

‘ రసదా ’ డ్యాన్స్ హైలెట్

వేడుకల్లో ‘ రసదా ’ డ్యాన్స్ కు ఉన్న  ఇంపార్టెన్స్ మరో డ్యాన్స్ కు ఉండదు. వేడుకలకే హైలెట్ గా నిలుస్తుంది ఈ డ్యాన్స్. ఇది పూర్తిగా ట్రైబల్ డ్యాన్స్. వందమందికి పైగా డ్యాన్సర్లు ఓ పెద్ద సర్కిల్ లా తయారై ఈ డ్యాన్స్ చేస్తారు. ‘ రసదా ’ తర్వాతి స్థానం ‘ హుదో ’ డ్యాన్స్​ది. దగ్గర్లోని జలావద్ ప్రాంతం నుంచి వచ్చిన ఆడవాళ్లు  ఈ డ్యాన్స్ చేస్తారు.

‘తార్నెతార్ ఫెయిర్’ లో అడుగడుగునా  ట్రైబల్ కల్చర్ కనిపిస్తుంటుంది. డ్యాన్సర్లు  గ్రూపులుగా ఇక్కడకు వస్తారు. ఒకచోట డ్యాన్స్ ప్రోగ్రాం పూర్తి కాగానే వేరే గ్రూపులోకి వెళ్లిపోతారు. అక్కడ మళ్లీ తమ మార్క్ డ్యాన్స్ తో అదరగొడతారు. ఈ వేడుకలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఒంటెల విన్యాసాలు స్పెషల్​ ఎట్రాక్షన్​

తార్నెతార్ వేడుకల్లో  ఒంటెల విన్యాసాలు ఓ స్పెషల్ అట్రాక్షన్. చిన్నారులనే కాదు పెద్దవాళ్లు కూడా ఈ విన్యాసాలకు ఫిదా అవుతుంటారు. వేడుకల కోసం 300కి పైగా స్టాల్స్ ను ఏర్పాటు చేస్తారు. హ్యాండీ క్రాఫ్ట్స్  సహా వేడుకల్లో దొరకని వస్తువంటూ ఉండదు. వేడుక జరిగే మూడు రోజుల పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో  పండగే పండగ. ప్రతి ఏడాది జరిగే ఈ వేడుకలకు నార్త్ ఇండియా నుంచి పెద్ద ఎత్తున సాధువులు వస్తుంటారు. రాత్రి పొద్దుపోయేంతవరకు భజనలు కూడా ఉంటాయి.

వేడుకలకు 250 ఏళ్ల చరిత్ర

తార్నెతార్ వేడుకలు ఇప్పటివి కావు. వీటికి 250 ఏళ్ల చరిత్ర ఉంది. మహాభారతంలో కీలక ఘట్టమైన ద్రౌపది స్వయంవరం జరిగింది ఇక్కడే అని ఈ ప్రాంత ప్రజలు చెబుతారు. ద్రౌపది స్వయంవరం స్ఫూర్తితో మనసుకు నచ్చిన అబ్బాయిలను అమ్మాయిలు సెలెక్ట్ చేసుకోవడానికి వీలుగా వేడుకలు నిర్వహించడం మొదలైందట. కాలక్రమంలో వేడుకలకు కమర్షియల్ రంగు పులిమారు. చిన్న చిన్న వస్తువుల  దగ్గర్నుంచి  పశువుల అమ్మకం వరకు వేడుకల్లో ప్లేస్ కల్పించారు.  సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన అతి పెద్ద ఫెస్టివల్ గా తార్నెతార్ వేడుకలు పేరొందాయి. ప్రతి ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబరు నెలల్లో ఈ వేడుకలు జరుగుతాయి. ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి 4 వ తేదీ వరకు వేడుకలు నిర్వహించారు. వీటికి దేశవ్యాప్తంగా దాదాపు లక్షమందికి పైగా టూరిస్టులు వచ్చినట్లు సమాచారం.

చేతుల్లో గొడుగులతో అబ్బాయిల డ్యాన్స్

పెళ్లి కాని అబ్బాయిలు చేతుల్లో గొడుగులు పట్టుకుని చేసే డ్యాన్స్ ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ట్రైబల్ డ్రస్సులేసుకుని అబ్బాయిలు చేసే ఈ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది.  వేడుకల్లో దీన్ని ఒక ప్రత్యేక కార్యక్రమంగా భావిస్తారు. ఈ డ్యాన్సుల కోసం స్పెషల్​గా డిజైన్​ చేసిన డ్రెస్సులు వేసుకుంటారు.