ఉపాధి కూలీల వాహనం బోల్తా

  •     పలువురికి తీవ్ర గాయాలు..ఒకరి పరిస్థితి విషమం

దండేపల్లి, వెలుగు : ఉపాధి కూలీల టాటాఏస్ వాహనం అదుపు తప్పి కాలువలో బోల్తా పడడంతో పులువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్​ ఆస్పత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.  దండేపల్లికి చెందిన 30 మంది ఉపాధి హామీ మహిళా కూలీలు శుక్రవారం కడెం ప్రధాన కాలువలో పూడిక తీసి టాటాఏస్ వాహనంలో తిరిగి వస్తున్నారు.

ఈ క్రమంలో ఓవర్ లోడ్ కారణంగా ట్రాలీ స్టీరింగ్ రాడ్ విరిగి అదుపుతప్పి డిస్ట్రిబ్యూటరీ కాలువలో బోల్తా పడింది. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా, లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పపత్రిలో ప్రథమ చికిత్స చేయించి మంచిర్యాలకు తరలించారు.  

ట్రాలీలో ఉన్న బంగారి మల్లవ్వ పరిస్థితి సీరియస్ గా ఉండడంతో కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. లక్సెట్టిపేటలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంచిర్యాల అడిషనల్ డీఆర్డీఓ దత్తారావు పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేపట్టినట్లు దండేపల్లి ఎస్ఐ భూమేష్ తెలిపారు.