పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల భారం తగ్గించాలె

పెట్రో ధరల పెంపు ప్రజలకు భారమవుతున్నది. కరోనా కష్టాలతో అవస్థలు పడ్డ జనాన్ని ఇంధన ధరల పెంపు ఇంకింత దెబ్బతీస్తున్నది. క్రూడాయిల్ ధరలను ప్రభావితం చేసే పలు అంతర్జాతీయ అంశాలను మనం నియంత్రించలేం. అయితే ఇక్కడి ప్రభుత్వాలు వేసే పన్నులు తగ్గించుకుంటే పెట్రో ధరలు కాస్త అదుపులోకి వస్తాయి. అలాగే ఎక్సైజ్ డ్యూటీలు, ఇతర సుంకాలను నియంత్రించాల్సి ఉంది. ప్రతి మనిషిని, రంగాన్ని కాటేస్తున్న పెట్రో ధరల దాడికి పగ్గాలేయాలన్నదే అందరి అభ్యర్థన... ఆకాంక్ష!

పెట్రో రేట్ల ఎఫెక్ట్​తో పెరిగిన నిత్యావసరాల ధరల సెగ ప్రతి ఒక్కరికి తగులుతోంది. గతంలోనూ పెట్రో ధరలు పెరిగినా... ఇప్పుడు వాటికి అదనంగా కరోనా “టాక్స్’’లు తోడయ్యాయి. లీటరు ధర వంద దాటింది. అది అక్కడితో ఆగకుండా ఇంకా ఎగబాకుతుండడం జనాలకు ఆందోళన కలిగిస్తోంది. గల్ఫ్ దేశాల్లో క్రూడాయిల్ రేటు పెరిగితే మన దేశంలో పెట్రో ధరలు పెరుగుతాయని సాధారణ జనం అనుకుంటుంటారు. అయితే ఈ పెట్రో ధరల పెంపుపై విదేశీ మారకద్రవ్యం, డాలర్ రేట్లు, మార్కెట్ల ఒడిదుడుకులు, అంతర్జాతీయ రాజకీయాంశాల ప్రభావం ఉంటుంది. ఇక కేంద్ర, రాష్ట్రాల అధిక పన్నులు సరేసరి. అయితే ఏ వినియోగదారుడూ వీటిలో ఏ ఒక్కదాని గురించి ఆలోచించడు. పెట్రో ధరలు పెరిగాయా? తగ్గాయా? అన్నదే చూస్తారు. లీటర్ ధరపై పెంపు పైసల్లోనే చూపిస్తున్నా.. ప్రతి రెండు మూడు రోజులకోసారి ఈ పెంపు ఉండడంతో చూస్తుండగానే అది రూపాయల్లోకి చేరుతోంది. మే, జూన్ రెండు నెలల్లోనే ఇంధన సంస్థలు 32 సార్లు ధరలు పెంచాయి. వీటికి ఆయా రాష్ట్రాల్లోని పన్నులు జత కలిసి పెను భారమవుతున్నాయి.

క్రూడాయిల్​పై కరోనా ఎఫెక్ట్

అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న క్రూడాయిల్ ధర, వివిధ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం వేస్తున్న పన్నులు దేశంలో ఇంధన ధరలకు ఆజ్యం పోస్తున్నాయి. కరోనా కారణంగా పలు దేశాల్లో క్రూడాయిల్ ఉత్పత్తులకు ఇబ్బందులు కలిగాయి. వ్యాక్సిన్లు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు మెల్లమెల్లగా కుదుటపడుతున్నాయి. దీంతో ఇంధన వినియోగం మళ్లీ పుంజుకొంటూ డిమాండ్​ పెరుగుతోంది. అలాగే డాలర్ మారకం రేటులో హెచ్చు తగ్గులు ధరలను ప్రభావితం చేస్తున్నాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ పతనం పెద్ద అడ్డంకిగా మారుతోంది. గతవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్​కు 76 డాలర్లను తాకింది. 2018 అక్టోబర్ తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం. వాస్తవానికి ఈ ఏడాది బ్రెంట్ క్రూడ్ ధర సగటున బ్యారెల్ 62 డాలర్లుగా ఉంటుందని అంచనాలు వెలువడ్డాయి. ఇక ఇంధనంపై ప్రభుత్వ పన్ను రూపాన్ని పరిశీలిస్తే... మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో 60 శాతానికిపైగా ప్రభుత్వాలకు పన్నులే ఉంటున్నాయి. ప్రభుత్వాల రాబడిపై కరోనా ఎఫెక్ట్​ పడడంతో పెట్రో ధరల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్రాలు వదులుకునే పరిస్థితి లేదు. పైగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సంక్షేమ కార్యక్రమాలను నెత్తికెత్తుకున్నాయి. ఇలాంటి స్థితి పెట్రో టాక్స్ ను తగ్గించే సాహసం ప్రభుత్వాలు చేయకపోవచ్చు.

ప్రతి దాని రేటు పైకి

పెట్రో రేట్లు పెరుగుతుండటంతో రవాణా రంగం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ట్రక్కులు, లారీలు, డెలివరీ వ్యాన్లు, క్యాబ్ లు,​ఆటోలు... ఇలా అన్నిటిపైనా ధరల ప్రభావం ఉంటోంది. ఆయా వాహన యజమానులు, ట్రాన్స్ పోర్ట్​ నిర్వాహకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కరోనావేళ కిరాయిల్లేక, చార్జీలు పెంచలేక సతమతమవుతున్నారు. రోజువారీ సంపాదనలో 25% నుంచి 30 శాతం వరకు ఇంధన ధరకే పోతోందని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పెట్రోధరల పెరుగుదలతో సామాన్యుడు, మధ్యతరగతి ప్రజానీకం తల్లడిల్లుతున్నారు. నలుగులు సభ్యులున్న కుటుంబంపై నెలకు కనీసం రూ.2 వేల అదనపు భారం పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పెంపు వల్ల వ్యవసాయం, రవాణా, ఉత్పత్తి తదితర రంగాలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. 

వినియోగదారునిపైనే భారం

ప్రస్తుతం ప్రతి పౌరునికి పెట్రో ఉత్పత్తుల వాడకం అత్యావశ్యకమైంది. పెట్రో ధరల పెంపుతో ప్రతి వస్తువు ధర పెరుగుతోంది. ఉదాహరణకు కరోనా టైమ్ లో ప్రజారవాణా సౌకర్యాలు బంద్ అయ్యాయి. జీవనం కోసం జనం ప్రాంతాలను చుట్టిరావడం సహజమే. కరోనా ఎఫెక్ట్ తో చిన్నచిన్న వృత్తి పనివారు, స్వల్పాదాయ వర్గాలవారు అప్పులు చేసి మరీ వాహనాలు కొన్నారు. బైకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే ఇంధన ధరలు పెరిగి స్వల్ప ఆదాయ వర్గాల వారికి వాటి నిర్వహణ భారంగా మారింది. అప్పులు తెచ్చాం, బైకులు కొన్నాం, నెలసరి వాయిదాల సంగతేమిటి? వీటన్నిటికి తోడు సెంచరీ దాటిన పెట్రోలు, డీజిల్ మాటేమిటి?... ఇవీ వాళ్లను వేదిస్తున్న పరిస్థితులు. ఇంధన ధరలు 10 శాతం పెరిగితే ప్రత్యక్షంగా, పరోక్షంగా రవాణా ఖర్చులు 18% పెరుగుతాయని వివిధ అధ్యయనాలు చెప్తున్నాయి. గత రెండు నెలల్లోనే పెట్రోధరలు సుమారు 5% పైనే పెరిగాయి. అంటే రవాణా వ్యయం 9% పెరుగుతుందన్నమాట. దీంతో సరుకు రవాణా చార్జీలు పెరుగుతున్నాయి. ఇలా చివరకు ఈ అదనపు భారమంతా వినియోగదారుడిపైనే పడుతుంది. చమురు ధరల ప్రభావం ప్రతి రంగంపై పడి ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుందని, ద్రవ్యోల్బణం పెరిగితే రూపాయి మారకం విలువ తగ్గి పోతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ధరలు మరింత పెరిగే అవకాశం

నిర్మాణ రంగంపై పెట్రోధరల ప్రభావం తీవ్రంగానే ఉంది. కొత్త టెక్నాలజీతో ఎన్నో యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి వాడకంలో ఇంధన ఖర్చులు అధికమయ్యాయి. రవాణా ఖర్చులు పెరిగి ఇసుక, స్టీలు, సిమెంటు రేట్లు ఇప్పటికే అందనంత ఎత్తుకెళ్లాయి. ప్రాజెక్టులవ్యయం పెరిగి, ఇండ్లు, ప్లాట్ల ధరలు పెంచక తప్పట్లేదని బిల్డర్లు చెబుతున్నారు. కనీసం 7- శాతం నుంచి 10 శాతం ధరలు పెరుగుతాయని లెక్కలు కడుతున్నారు. చివరకు అన్నదాతలు కూడా ఈ పెట్రోధరల సెగ తప్పించుకోలేక పోతున్నారు. వ్యవసాయంలో యంత్రాల వాడకం పెరిగింది. యాంత్రీకరణతోనే చేయడం చూస్తూనే ఉ న్నాం. విత్తు నుంచి పంట చేతికొచ్చే వరకు ప్రది దశలో యంత్రాల వినియోగం ఉంటోంది. దీంతో పెట్రో ధరల పెంపు కచ్చితంగా రైతులకు అదనపు భారం అవుతోంది. ముడిచమురు ధరలు పెరుగుతుండటంవల్లే వినియోగదారులపై పెట్రో భారం పడుతోందని కేంద్రం చెప్తోంది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు గతంలో బ్యారెల్​కు 120 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోలు, డీజిల్ ధరలు లీటర్ రూ.60 నుంచి రూ.70 రూపాయల లోపే ఉన్నాయి. ప్రస్తుతం ముడిచమురు బ్యారెల్ ధర 70 డాలర్లు  ఉంటే పెట్రోలు, డీజిల్ ఏకంగా రూ.100 దాటేసింది. ధరల నిర్ణయాధికారం చమురు కంపెనీలు, సంస్థలకు వదిలేసిన కేంద్రం ఆ నిర్ణయం వారిదే నంటూ తప్పించుకుంటోంది. పెట్రో ధరల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు 44 శాతం కాగా... మొత్తం టాక్సులన్నీ కలిపి 110 శాతంగా ఉన్నాయి. ఉత్పత్తి అసలు ధర కన్నా పన్నులే అధికంగా ఉన్నాయి. ఇలాంటి స్థితిలో పెట్రో మంట చల్లారేదెప్పుడు? అంటే సమాధానం దొరకని ప్రశ్నే! అందుకే ధరల పెంపు సశేషం!!

- చెన్నుపాటి రామారావు,సీనియర్ జర్నలిస్టు