- చివర్లో ఆదుకున్న వర్షాలు.. ప్రాజెక్టులు నిండి పారుతున్న కాలువలు
- ఈ సారి 5.12 లక్షల ఎకరాల వరిసాగుతో నల్గొండ టాప్
- 1,963 ఎకరాలతో చివరి స్థానంలో ఆదిలాబాద్
హైదరాబాద్, వెలుగు: వరి సాగులో రాష్ట్రం ఆల్‌టైమ్ రికార్డు సాధించింది. ఈ సారి కాలం కలిసి రావడంతో ఎన్నడూ లేనంతగా రైతులు 65.49 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. 2023 వానాకాలం సీజన్‌లో 65 లక్షల 873 ఎకరాల్లో వరి సాగవగా, తాజాగా మరోసారి 65 లక్షల ఎకరాల మార్కును దాటి 65 లక్షల 49 వేల 230 ఎకరాల్లో సాగైంది. ఇది ఆల్‌టైమ్ రికార్డు కావడం విశేషం.వానకాలం సీజన్‌లో సాధారణ పంటల సాగు 1.29 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటికే కోటి 29లక్షల 89వేల 397ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అంటే వానాకాలం సీజన్‌లో పంటల సాగు టార్గెట్ను మించి 100.44 శాతానికి చేరుకున్నది.
కలిసివచ్చిన కాలం..
జూన్, జులై నెలల్లో నిరాశపరిచిన వరుణుడు ఆగస్టు, సెప్టెంబరులో భారీ వర్షాలతో కరుణించాడు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, బావులు నిండాయి. ప్రాజెక్టుల కాల్వలు పొంగిప్రవహిస్తున్నాయి. ఫలితంగా రైతులు జోరుగా వరి నాట్లు వేశారు. దీంతో వరి సాగు విస్తీర్ణం అమాంతం పెరిగిపోయింది. నిరుడు వానాకాలం 65 లక్షల ఎకరాల్లో వరి సాగే ఇప్పటి వరకు రికార్డు కాగా, ఈ సీజన్‌లో ఇప్పటికే 65.49 లక్షల ఎకరాలతో ఈ రికార్డు బ్రేక్ అయింది. నిజానికి రాష్ట్రంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 57.18 లక్షల ఎకరాలు కాగా 114.53 శాతం సాగు నమోదైంది.
వరి సాగులో నల్గొండ టాప్
ఈ సీజన్‌లో వరి సాగులో నల్గొండ జిల్లా టాప్లో నిలిచింది. మొత్తం 5.12 లక్షల ఎకరాలతో మొదటి స్థానంలో ఉండగా, 4.72లక్షల ఎకరాలతో సూర్యాపేట జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జిల్లాలు నాగార్జున సాగర్ఆయకట్టు పరిధిలో ఉన్నాయి. ఇక ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండే నిజామాబాద్ జిల్లా ఈసారి 4.29లక్షల ఎకరాలతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. కాగా, ఆదిలాబాద్ జిల్లాలో కేవలం1,963 ఎకరాల్లో వరి సాగైనట్లు వ్యవసాయశాఖ నివేదిక తేల్చింది. హైదరాబాద్పక్కనే ఉన్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సైతం ఈసారి 17,636 ఎకరాల్లో వరి సాగైంది.
సాధారణ సాగును మించి..
ఈ సీజన్‌లో పత్తి 43.37 లక్షల ఎకరాల్లో సాగైంది. జూన్, జులై నెలలో పత్తి సాగుకు అనుకూల వాతావరణం ఉండగా జూలై ప్రారంభం నుంచి ఆగస్టు నెల వరకు కురిసిన అధిక వర్షాల ప్రభావంతో టార్గెట్‌లో 86.67 శాతానికే పరిమితమైంది. ఈ వానాకాలం పంటసాగులో 77.31 లక్షల ఎకరాల్లో ఫుడ్‌గ్రెయిన్స్ సాగయ్యాయి. నూనెగింజలు 4.27లక్షల ఎకరాలకే పరిమితం అయ్యాయి. కంది ఇప్పటివరకు 4.99 లక్షల ఎకరాల్లో, సోయాబీన్ సాధారణ సాగు 42.94 లక్షలు కాగా ఈసారి 4.01లక్షల ఎకరాలకు పరిమితం అయింది. మొక్కజొన్న సాధారణ సాగు 6.09 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 5.46లక్షల ఎకరాల్లో సాగైంది. ఇలా వానాకాలం సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 100.44 శాతం సాగు నమోదైంది.
గత పదేండ్లలో వానాకాలం వరి సాగు వివరాలు
సంవత్సరం సాగైన వరి
(ఎకరాల్లో)
2014 22.74 లక్షలు
2015 18.50 లక్షలు
2016 21.98 లక్షలు
2017 25.87 లక్షలు
2018 29.39 లక్షలు
2019 41.19 లక్షలు
2020 53.33 లక్షలు
2021 62.13 లక్షలు
2022 64.54 లక్షలు
2023 65.00 లక్షలు
2024 65.49 లక్షలు