- రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ ముసాయిదా బిల్లు
- ఫీజు రెగ్యులేటరీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించాలి
- రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ ఐఏఎస్
- ప్రైవేటు స్కూళ్లలో ఎలాంటి బిజినెస్‌లు చేయొద్దని సిఫారసు
హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాల్సిందేనని తెలంగాణ విద్యా కమిషన్ తేల్చి చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఫీజు నియంత్రణ ముసాయిదా బిల్లును అందించింది. ఫీజుల కట్టడికి కీలకమైన సిఫారసులు చేసింది. ప్రధానంగా ఫీజులను నియంత్రించాలంటే ముందుగా సర్కారు నియమించే ఫీజు రెగ్యులేటరీ కమిషన్‌కు చట్టబద్ధత ఉండాలని పేర్కొన్నది. కమిషన్ చైర్మన్ గా సుప్రీంకోర్టు/హైకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ ఐఏఎస్ ఉండాలని సూచించింది.
శుక్రవారం సెక్రటేరియెట్‌లో విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణాను తెలంగాణ విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలో కమిటీ సభ్యులు పీఎల్ విశ్వేశ్వర్ రావు, చారకొండ వెంకటేశ్, జ్యోత్స్న శివారెడ్డి కలిసి, ప్రైవేటు బడుల్లో ఫీజుల నియంత్రణ ముసాయిదా బిల్లు ప్రతిని అందించారు. ఈ సందర్భంగా ఫీజుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను ఆమెతో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్స్, పేరెంట్స్ సంఘాలు, మేనేజ్మెంట్ల సంఘాలు, విద్యావేత్తలతో ఫీజుల నియంత్రణపై విస్తృతంగా చర్చలు జరిపారు. వారందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని డ్రాఫ్ట్ ను కమిషన్ తయారు చేశారు.
ALSO READ : నెట్ నెట్ వెంచర్స్ బిల్డింగ్ కూల్చేయండి..జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలు
సిఫారసులు ఇవే..
- రాష్ట్రస్థాయిలో ఫీజుల నియంత్రణ రెగ్యులరేటరీ కమిషన్ ఉండాలి. ఈ కమిషన్ చైర్మన్ గా సుప్రీంకోర్టు/హైకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ ఐఏఎస్ ఉండాలి. ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలి.
- జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఫీజుల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాలి. ఆ కమిటీల ఆధారంగా ఫీజులను నిర్ణయించాలి.
- బడుల్లోని వసతుల ఆధారంగా ఫీజులను నిర్ణయించాలి. వెబ్ సైట్లు, నోటీసు బోర్డులపై ఫీజుల వివరాలు ఉండాలి.
- ట్యూషన్ ఫీజును మాత్రమే మేనేజ్మెంట్లు వసూలు చేయాలి. అడ్మిషన్ ఫీజులు తీసుకోవద్దు.
- పేరెంట్స్ ఆప్షనల్‌గా ఎక్స్ ట్రా కరికులమ్ ఫీజులు ఉండాలి.
- ప్రైవేటు బడులను ఐదు కేటగిరీలుగా విభజన చేయాలి. ఇంటర్నేషనల్, భారీ కార్పొరేట్, కార్పొరేట్, ప్రైవేటు, బడ్జెట్ స్కూళ్లుగా విభజించాలి.
- బడుల్లో ఎలాంటి వ్యాపారం చేయొద్దు.. పుస్తకాలు, యూనిఫామ్స్, ఇతర వస్తువుల అమ్మకాలు చేయొద్దు. ఎక్కడైనా వాటిని కొనుగోలు చేసే అవకాశం కల్పించాలి.