హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కొనే పంటలనే రైతులు వేసేలా రాష్ట్ర సర్కారు ప్రోత్సహిస్తోంది. వరి నుంచి ఇతర పంటలవైపు మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులోభాగంగా ఆల్టర్నేటివ్ పంటలపై దృష్టి పెడుతోంది. వచ్చే వానాకాలంలో పత్తి, కంది, వరిలో సన్నరకాలు ఎక్కువగా వేయాలని రైతులకు సూచిస్తోంది. గ్రౌండ్లెవెల్లో ఆఫీసర్లను రంగంలోకి దించి గ్రామాల వారీగా రైతుల్లో అవగాహన కల్పించడానికి ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రం నేరుగా కొనే మక్కలు, పొద్దుతిరుగుడు, జొన్న పంటలతోపాటు సోయా, వేరుశనగ పంటలను ప్రోత్సహించేలా ప్రయత్నాలు జరగడం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కొనే పంటలకు పెద్ద పీట వేసి, రాష్ట్ర సర్కారు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది.
పత్తి, కంది టార్గెట్ ఎక్కువే
కేంద్ర సంస్థ సీసీఐ కొనుగోలు చేసే పత్తి, నాఫెడ్ కొనుగోలు చేసే కందులు, ఎఫ్‌సీఐ కొనే వరి సన్న రకాలు వేయాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర సర్కారు మార్క్ఫెడ్ ద్వారా కొనే మక్కలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఈయేడు యాసంగిలో ఇప్పటి దాకా ఒక్క సెంటర్ కూడా తెరవలేదు. పొద్దుతిరుగుడు, జొన్నలు, పెసలు, మినుములు, శనగలు, సోయా, పల్లీ పంటలపై సర్కారు దృష్టి పెట్టడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు షరతుల సాగులో భాగంగా నిరుడు పత్తి 65 లక్షల ఎకరాలు, కంది 15 లక్షల ఎకరాలు, వరి సగం వరకు సన్నలు వేయాలని రైతులను ఆదేశించింది. దీంతో పత్తి 60.54 లక్షల ఎకరాలు, కంది 10.83 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఇక వరి పంట 52.86 లక్షల ఎకరాల్లో వేయగా.. అందులో 30 లక్షల ఎకరాలు సన్నలే. దీంతో వచ్చే వానాకాలంలో లాస్ట్ ఇయర్ కంటే 15 లక్షలు పెంచి పత్తి పంట 80 లక్షల ఎకరాల్లో వేయాలని సర్కారు టార్గెట్ పెట్టింది. కందులు కూడా 25 లక్షల ఎకరాల్లో వేయాలని సూచించింది. వరిలో సన్న వడ్లే వేయాలని చెప్పింది.
కొన్నది తక్కువే
గత వానాకాలంలో వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయి. పత్తి దిగుబడి సగానికి పడిపోయి 16.54 లక్షల టన్నులే వచ్చింది. కంది వర్షాలకు కొట్టుకు పోయి దిగుబడి సరిగా రాలేదు. వచ్చిన పంటను సర్కారు కొనలేదు. దీంతో కంది దిగుబడిపై లెక్కాపత్రం లేదు. నిరుడు 48.42 లక్షల టన్నుల వడ్లు కొన్నది. రైతులు సన్న వడ్లను ప్రైవేటుకు అమ్ముకున్నరు. దీంతో గత సీజన్‌లో దిగుబడి తగ్గడంతో సర్కారు తక్కువ పంటనే కొన్నది.