- ఐదేండ్లయినా 125 అడుగుల విగ్రహం ఊసెత్తుతలే
- 15 అంతస్తుల టవర్ పత్తా లేదు.. వికాస కేంద్రాలు హామీకే పరిమితం
- అంబేద్కర్ రచనలు, ప్రసంగాల పుస్తకాలు ప్రింట్ చేస్తలే
- కరోనా సాకుతో జయంతి ఉత్సవాలనూ నిర్వహిస్తలే
హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను రాష్ట్ర ప్రభుత్వం యాదిమరిచింది. భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని, అతిపెద్ద టవర్‌ను నిర్మిస్తామని, సకల సౌaకర్యాలు అందులో ఉంటాయని.. ఇట్ల సీఎం ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కావడం లేదు. గత ఏడాది నుంచి జయంతి ఉత్సవాలను కూడా ప్రభుత్వం బంద్ పెట్టింది. ఎందుకు ఉత్సవాలు జరపడం లేదని ప్రశ్నిస్తే.. కరోనాను సాకుగా చూపుతోందని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఎన్నికలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డురాని కరోనా అంబేద్కర్ జయంతి ఉత్సవాలకే అడ్డు వస్తోందా అని నిలదీస్తున్నాయి.
హైదరాబాద్‌లో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి డిప్యూటీ సీఎం, ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ కమిటీని ఏర్పాటు చేసింది. విగ్రహ ఏర్పాటు కోసం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను కమిటీ పరిశీలించి.. హుస్సేన్‌సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్స్‌ను ఆనుకొని ఉన్న 11.8 ఎకరాలను ఎంపిక చేసింది. 2016 ఏప్రిల్ 14న అంబేద్కర్ 125 జయంతి సందర్భంగా అక్కడ విగ్రహ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 50 అడుగుల ఎత్తులో పార్లమెంట్‌ను పోలిన పీఠం, దానిపై 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ‘‘అంబేద్కర్ బాగా నమ్మిన బుద్ధుడి విగ్రహం ముందుండాలె.. వెనుక అంబేద్కర్ విగ్రహం ఉండాలె.. అంబేద్కర్ వెనుక మన రాష్ట్ర ప్రభుత్వ సెక్రటేరియట్ ఉండాలె.. అందుకు తగ్గట్టు ఈ స్థలాన్ని ఎంపిక చేసినం” అని అన్నారు. ఎంత ఖర్చయినా సరే వెనుకాడబోమని చెప్పారు. పీఠం నిర్మాణానికి రాజస్థాన్‌లోని దోల్‌పూర్‌కు చెందిన శాండ్‌స్టోన్‌ను ఉపయోగించాలని ప్రభుత్వం అనుకుంది. విగ్రహం వెడల్పు 45.5 ఫీట్లు, విగ్రహానికి 791 టన్నుల స్టీల్, 96 టన్నుల ఇత్తడి ఉపయోగించాలని ప్లాన్ చేసింది. కడియం శ్రీహరి ఆధ్వర్యంలోని కమిటీ చైనాకు వెళ్లి విగ్రహానికి సంబంధించిన వివిధ అంశాలను స్టడీ చేసింది. విగ్రహ నిర్మాణానికి 146.50 కోట్ల అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. అంబేద్కర్ విగ్రహంతో పాటు మ్యూజియం, మీటింగ్ హాల్ తదితర వాటిని నిర్మించాలని భావించారు. ఇవన్నీ ఏడాదిలో పూర్తి చేయాలని భావించగా, శంకుస్థాపన చేసి ఐదేండ్లవుతున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రస్తుతం అంబేద్కర్ జయంతి దగ్గరపడుతుండటంతో ఆదరాబాదరాగా నిర్మాణ పనులను ఈ నెల 4న కాంట్రాక్టర్‌కు అప్పగించినట్లు తెలిసింది.
రచనలు, ప్రసంగాలు రీ ప్రింట్ చేస్తలే
1991లో అంబేద్కర్ శత జయంతి సందర్భంగా ఆయన రచనలు, ప్రసంగాలను ఇంగ్లిష్ నుంచి భారతీయ భాషలన్నింటిలోకి ట్రాన్స్‌లేట్ చేసి, ప్రింట్ చేయాలని అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ బుక్స్‌ను ప్రజలకు సబ్సిడీపై ఇవ్వాలి. అప్పటి నుంచి తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసే బాధ్యతలను తెలుగు యూనివర్సిటీకి అప్పగించారు. వర్సిటీ 14 వాల్యూమ్స్‌ను ట్రాన్స్‌లేట్ చేసి ప్రింట్ చేసింది. తెలంగాణ వచ్చాక ఒక్క సంపుటి కూడా రీప్రింట్ కాలేదు. యూనివర్సిటీకి సర్కారు నిధులు విడుదల చేయకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.
అంబేద్కర్ వికాస కేంద్రాలేవి?
రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో బీఆర్ అంబేద్కర్ వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామని 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పింది. ఈ కేంద్రాలను దళితులకు అవసరమైన సమాచారాన్ని అందించే విధంగా తీర్చిదిద్దుతామని పేర్కొంది. ఇందులోనే కమ్యూనిటీ హాల్, లైబ్రరీ తదితర వాటిని ఏర్పాటు చేస్తామని తెలిపింది. కానీ ఆరున్నరేండ్లు గడుస్తున్నా ప్రభుత్వం వీటి ఊసే ఎత్తడంలేదు. ఏర్పాటుకు సంబంధించి ప్రణాళికే రూపొందించడంలేదు.
జయంతి ఉత్సవాలూ చేస్తలే
కరోనా సాకుతో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించలేదు. ఈ సారి కూడా కరోనా సెకండ్ వేవ్ పేరుతో అధికారికంగా జరపడంలేదు. జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేస్తారు. కొంత మేర నిధులను కేటాయిస్తారు. సమాజంలో సేవ చేసిన వారిని గుర్తించి దళిత రత్న, యువ రత్న, కళా రత్న లాంటి అవార్డులను అందజేస్తారు. గత ఏడాదినుంచి ప్రభుత్వం అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించకపోవడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ‘‘కరోనా ఉన్నా ప్రభుత్వం ఇతర కార్యక్రమాలు నిర్వహించడం లేదా? ఎన్నికలు జరపడం లేదా? మరి అంబేద్కర్ జయంతి ఉత్సవాలకే కరోనా అడ్డం వచ్చిందా?’’ అని ప్రశ్నిస్తున్నాయి. పక్క రాష్ట్రం ఏపీలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జీవో కూడా ఇచ్చారని, ఇక్కడ మాత్రం పట్టించుకోవడం లేదని అంటున్నాయి.
టవర్ రాలేదు..ఉన్న భవన్ పోయింది
హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్‌లో 15 అంతస్తుల్లో అంబేద్కర్ టవర్ నిర్మించి, అక్కడ దళితులు, గిరిజనుల అభివృద్ధి కోసం అన్ని కార్యక్రమాలు నిరంతరం జరిగేటట్లు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పి ఏండ్లు గడుస్తున్నా ఏ పనులూ జరగడం లేదు. ఈ స్థలంలో గతంలో అంబేద్కర్ భవన్ ఉండేది. భవన్లో అనేక సాంస్కృతిక, ఇతర కార్యక్రమాలు జరిగేవి. దీన్ని ఫంక్షన్లకు రెంటుకు కూడా ఇచ్చేవారు. కానీ, టవర్‌ను నిర్మిస్తామని చెప్పి అందులోని ఫెసిలిటీస్‌ను మొత్తం ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు టవర్ రాకపోగా.. ఉన్న భవన్ కూడా పోయింది.