భద్రాచలం, వెలుగు : సూర్యాపేటలో నవంబరు 24న ప్రారంభించిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుల పాదయాత్ర మంగళవారం భద్రాచలం చేరుకుంది. వ్యవస్థాపక అధ్యక్షుడు సామా అంజిరెడ్డి నాయకత్వంలో అంబేద్కర్ సెంటర్ వరకు పాదయాత్ర సాగింది. తెలంగాణ జన సమితి నాయకులు దేవదానం, కరుణాకర్‌రెడ్డి, రేపాక రామారావు గుప్తా ఘనస్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి మలి దశ ఉద్యమకారులు పోరాడారని టీజేఎస్ నాయకులు దేవదానం పేర్కొన్నారు. గత ప్రభుత్వం మలిదశ ఉద్యమకారులను పట్టించుకోలేదని, సర్వం కోల్పోయి జైళ్లపాలైన వారంతా నిరాదరణకు గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంకట్రావు క్యాంపు ఆఫీసుకు చేరుకుని ఉద్యమకారులను గుర్తించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. భద్రాద్రి రామయ్యకు కూడా వినతిపత్రం ఇచ్చారు.