- ఈ నెల 15,16 తేదీల్లో రాతపరీక్ష
- 783 పోస్టులకు 5,51,943 మంది అప్లై
- రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలు
- ఏర్పాట్లు పూర్తిచేసిన టీజీపీఎస్సీ
హైదరాబాద్, వెలుగు : గ్రూప్ 2 ఎగ్జామ్ హాల్ టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తన అధికారిక వెబ్సైట్లో అభ్యర్థులకు అందుబాటులో పెట్టింది. www.tspsc.gov.in వెబ్సైట్లో అభ్యర్థుల టీజీపీఎస్సీ ఐడీ, డేటాఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని కమిషన్ ప్రకటించింది. ఈ నెల 15,16 తేదీల్లో నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటికే కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 783 పోస్టుల భర్తీకి నిర్వహించే గ్రూప్ 2 పరీక్షకు 5,51,943 మంది అప్లై చేసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాల్లో రెండు రోజుల పాటు 4 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 15న ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ -2, 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పేపర్-3, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 4 పరీక్ష జరగనున్నది. కాగా, మార్నింగ్ సెషన్ కోసం 8.30 గంటల నుంచి, ఆప్టర్ నూన్ సెషన్లో మధ్యాహ్నం 1.30 గంటల నుంచే అభ్యర్థులను లోపలికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
Also Read : విద్యార్థినుల సమస్యలకు కంప్లయింట్ బాక్సులతో చెక్
నిర్ణీత పరీక్ష సమయానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని, అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కాగా, గ్రూప్ 2 పరీక్షల రోజుల్లోనే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు ఉన్నాయని, వాయిదా వేయాలని కొందరు కమిషన్ను కోరగా, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, పరీక్షల ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో వాయిదా వేయడం కుదరదని హైకోర్టు తేల్చిచెప్పింది.