ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభపై రాష్ర్ట ప్రభుత్వం ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వకుండా అడ్డుకుని.. ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు. పలు జిల్లాల్లో చాలాచోట్ల చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి, వాహనాల్లో పబ్లిక్ కాంగ్రెస్ మీటింగ్ కు వెళ్లకుండా కేసులు నమోదు చేస్తున్నారు.
జూలూరుపాడు వద్ద వాహనాలను నిలిపివేసి.. కేసులు నమోదు చేశారు పోలీసులు. నల్గొండ జిల్లా నుంచి కిరాయికి వచ్చిన కొన్ని డీసీఎం వాహనాలను నిలిపివేసి.. వాటి యజమానులపై కేసులు నమోదు చేశారు. అన్ని పత్రాలు ఉన్నా కావాలనే కేసులు నమోదు చేస్తున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయుల ఆరోపిస్తున్నారు. తెలంగాణ జనగర్జన సభకు ప్రజలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు, ఆర్టీఏ అధికారులతో అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉదయం నుంచి పోలీసులు అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. సరైన పత్రాలు ఉంటేనే పంపిస్తున్నారు. ఏ ఒక్క పత్రం లేకపోయినా వెనక్కి పంపించడం లేదంటే కేసులు నమోదు చేస్తున్నారు. జనగర్జన సభకు వెళ్తున్నారన్న కారణంతో ప్రతి ఆటోను కూడా ఆపి...అన్ని పత్రాలు చెక్ చేస్తున్నారు. సరైన పత్రాలు లేని వాటిని సీజ్ చేసి, పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు పోలీసులు. ఆర్టీఏ అధికారులు, పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇన్నాళ్లు వాహనాల పత్రాలను చెక్ చేయని అధికారులు.. ఉన్నట్టుండి ఇవాళే పత్రాలను చెక్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని ప్రశ్నిస్తున్నారు.