దళితబంధులో దళారీల బెడద : ఈదునూరి మహేష్

దళితుల జీవితాల్లో వెలుగులు నింపి, ఆర్థిక తోడ్పాటునందిస్తూ, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. ప్రయోగాత్మకంగా మొదటి దఫాలో 100 యూనిట్లను ప్రతి నియోజకవర్గానికి అందించింది. రెండో దఫాకు సంబంధించిన ప్రణాళికలను కూడా రూపొందించాలని ఇటీవల సీఎం కేసీఆర్​అధికారులను ఆదేశించారు. ఇదే అదునుగా భావిస్తున్న పలువురు దళారులు దళితబంధు పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రతీ యూనిట్ కు లక్షల్లో బేరసారాలు చేస్తున్నారు. అమాయక ప్రజలను అత్యాశలకు ఉసిగొల్పుతూ, తాము చెప్పినట్లే దళితబంధు ఎంపికలు కొనసాగుతాయని, తామే నిర్ణయిస్తామని నమ్మిస్తున్నారు. అలాంటి వారిని నమ్ముతున్న అమాయక ప్రజలు బాగా నష్టపోతున్నారు. ప్రతి యూనిట్ కు రూ.50 వేల నుంచి సుమారు రూ. 3 లక్షల వరకు బేరాలు కుదురుతున్నాయి. చేతి ఖర్చులకంటూ రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు గుంజుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో వేచి చూస్తున్న లబ్ధిదారులను దళారీల బెడద తీవ్రంగా వేధిస్తున్నది. యూనిట్ ఎంపిక కోసం అవసరమైన అర్హతలు ఉన్నా, దళారుల మాయమాటలతో ఆగమవుతున్నారు. 

అప్పులు చేసి.. దళారులకు ఇస్తూ..

దళితబంధు పథకం యూనిట్​ఎంపికలో దళారులు ముందస్తు డబ్బులు వసూలు చేస్తున్నారు. ముందుగా తమకు డబ్బులు చెల్లిస్తేనే యూనిట్ అందుతుందని హెచ్చరిస్తున్నారు. దళారులకు డబ్బులు చెల్లించే ఆర్థిక స్థోమత లేక చాలా మంది దళితులు అప్పులు చేస్తున్నారు. బంధువులు, స్నేహితుల వద్ద వడ్డీలకు తీసుకుని మరీ దళారుల ఉచ్చుకు బలైతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అర్హులైన లబ్ధిదారులకే యూనిట్ అందేలా చూడాలి. అందుకోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలి.  చోటామోటా నాయకుల పైరవీలకు చెక్ పెట్టాలి. లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రత్యేక బృందం ఆయా యూనిట్లకు లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులను పరిశీలించి, అర్హులైన వారిని గుర్తించి, పథకం సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలి. 

శిక్షణ, అనుభవాన్ని పరిగణించాలి..

దళితబంధు కింద యూనిట్​కోసం దరఖాస్తు చేసుకుంటున్న అర్హులలో సరైన వారిని గుర్తిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. అనుభవం, శిక్షణ లేని వారు అవగాహన లేమితో యూనిట్​వచ్చినా, దాన్ని సరిగా నిర్వహించలేక నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి లబ్ధిదారులకు ఆయా యూనిట్ కు సంబంధించిన తగిన అనుభవం, వివిధ అర్హతలతో ప్రభుత్వ గుర్తింపు పొందిన శిక్షణ శిబిరాలు అందించే సంబంధిత అర్హత పత్రాలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులుగా సంబంధిత బోర్డు నుంచి గుర్తించబడిన కార్మికులకు కొంత ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు ఆ యూనిట్ తీసుకునే లబ్ధిదారు తనకున్న అనుభవంతో ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకుంటాడు. పథకం ముఖ్య ఉద్దేశం కూడా నెరవేరుతుంది. లబ్ధిదారుల ఎంపికలో రూల్స్​తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉన్నది.

పారదర్శకతతోనే లక్ష్యం నెరవేరుతుంది

యూనిట్లు మంజూరు చేసే అధికారం ప్రజాప్రతినిధులకు ఇవ్వడంతో చాలా చోట్ల వారు వారికి నచ్చినోళ్లకు, అవసరం ఉన్న వ్యక్తులకే ఇస్తున్నారు. అలాంటి సందర్భాల్లో నిజమైన నిరుపేద దళితులకు అన్యాయం జరుగుతున్నది. దళిత బంధు యూనిట్లు పొందుతున్న వారి వివరాలు నిశితంగా పరిశీలిస్తే, వారికి వ్యవసాయ భూమి, లేదా పార్టీలో పలుకుబడి ఉంటున్నాయి. ఆర్థికంగా కొంత బాగానే ఉండి, వ్యవసాయ భూమి ఉన్న దళితుల కంటే పేద దళితులకు దళితబంధు అవసరం ఎక్కువ ఉన్నది. డిగ్రీలు, పీజీలు చేసిన చాలా మంది పేద దళిత యువతీయువకులు ప్రభుత్వ సహకారం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి దళితబంధు ఇవ్వడం సమంజసం. దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో, మంజూరులో పారదర్శకతకు పెద్దపీట వేసినప్పుడే పథకం లక్ష్యం నెరవేరుతుంది.

- ఈదునూరి మహేష్, ఎంఏ, ఎంసీజే, వరంగల్