- నాలుగు స్థాయిల్లో వాల్టా అథారిటీల ఏర్పాటుకు నిర్ణయం!
- స్టేట్ అథారిటీ ఎక్స్అఫీషియో చైర్‌పర్సన్‌గా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
- సభ్యులుగా మరో 22 మంది సెక్రటరీలు, ఎన్జీవో ప్రతినిధులు, నిపుణులు
- నీటి వనరుల పరిరక్షణకు ఈ అథారిటీలకు విస్తృతాధికారాలు
కరీంనగర్, వెలుగు : చెరువులు, కుంటలు, నాలాలు, ఇతర నీటి వనరుల పరిరక్షణ కోసం వాల్టా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమవుతున్నది. హైడ్రా తరహాలోనే జిల్లాలు, మండలాలు, గ్రామాల్లోనూ అథారిటీలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. వాస్తవానికి నీటి వనరుల ఆక్రమణలను అడ్డుకునేందుకు, కూల్చేందుకు వాల్టా ద్వారా ఏర్పాటైన కమిటీలకు విస్తృతాధికారాలు ఉన్నప్పటికీ.. చట్టం అమలులో గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. చివరికి వాల్టా అనగానే.. ఇష్టారాజ్యంగా బోర్లు వేయకుండా నిరోధించే, చెట్లు నరకకుండా అడ్డుకునే చట్టంగానే దాన్ని పరిమితం చేశారు.
ఈ చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలతో చెరువులు, కుంటలు, నాలాల వెంట వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించే అవకాశం ఉన్నప్పటికీ.. వాల్టా అథారిటీల ఏర్పాటులో నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఫలితంగా గత పదేండ్లలో ఆక్రమణలు పెరిగి చెరువులు, కుంటలు కుంచించుకుపోయాయి.
నాలుగు స్థాయిల్లో అథారిటీలు..
ది తెలంగాణ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ –- 2002 ప్రకారం.. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర, జిల్లా, డివిజనల్, మండల స్థాయిలో తెలంగాణ వాటర్, ల్యాండ్ అండ్, ట్రీస్ అథారిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయి అథారిటీ ఎక్స్ అఫీషియో చైర్ పర్సన్ గా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, వైస్ చైర్ పర్సన్ గా చీఫ్ సెక్రటరీ వ్యవహరిస్తారు. ఎమ్మెల్యేలు, వివిధ శాఖల సెక్రటరీలు, ఎన్జీవో ప్రతినిధులు, నిపుణులు సహా 22 మంది సభ్యులుగా ఉంటారు.
ఎక్స్ అఫీషియో సభ్యులుగా అసెంబ్లీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రభుత్వం నామినేట్ చేయాలి. అందులో ఒకరు ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యే ఉండాలి. రాష్ట్ర అగ్రికల్చర్, ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రూరల్ వాటర్ సప్లై, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖలకు చెందిన సెక్రటరీలతోపాటు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ ఎక్స్ అఫీషియో మెంబర్లుగా వ్యవహరిస్తారు. వీరితోపాటు లైఫ్, ఎర్త్ సైన్సెస్, ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్లకు చెందిన ముగ్గురు ప్రొఫెసర్లు, నీరు, భూసారం
ఆర్థిక రంగాల్లో ముగ్గురు నిపుణులను సభ్యులుగా నియమించాల్సి ఉంటుంది. అలాగే, సహజ వనరుల పరిరక్షణ కోసం పనిచేసే ఐదుగురు నాన్ అఫీషియల్ పర్సన్స్ ను సభ్యులు నియమించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా కేటగిరీల నుంచి వీరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఎక్స్ అఫీషియో మెంబర్ సెక్రటరీగా గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ వ్యవహరిస్తారు. ఇదే పద్ధతిలో జిల్లాస్థాయిలో వాల్టా అథారిటీ ఎక్స్ అఫీషియో చైర్ పర్సన్ గా కలెక్టర్, ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఇందులో ఒకరు ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటారు.
రాష్ట్ర స్థాయిలోలాగే జిల్లాలో కలెక్టర్చైర్మన్గా వ్యవహరిస్తారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఆర్డీవో చైర్మన్ గా డివిజనల్ అథారిటీ, తహసీల్దార్ చైర్మన్ గా మండలస్థాయి అథారిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆయా అథారిటీల్లోనూ వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ అథారిటీలు కనీసం 3 నెలలకోసారి సమావేశం కావాలని, 1/3 కోరం ఉన్నా సమావేశం కావొచ్చని చట్టం వెల్లడిస్తున్నది.
డిజిగ్నేటెడ్ ఆఫీసర్‌కు ఆక్రమణలను తొలగించే పవర్
నీటి వనరుల పరిరక్షణ, మట్టి, ఇసుక అక్రమ తవ్వకాల నివారణ, చెట్ల నరికివేత నిరోధం కోసం ఉమ్మడి ఏపీలో తీసుకొచ్చిన ఏపీ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ - 2002ను తెలంగాణ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ - 2002గా గత ప్రభుత్వం 2014లోనే అడాప్ట్ చేసుకుంది. ఇందులో ప్రధానంగా సెక్షన్ 23(1) ప్రకారం.. చెరువులు, కుంటలు, నాలాల వంటి నీటి వనరులను వారసత్వ వనరుగా , పరిరక్షణ ప్రాంతాలుగా గుర్తించి, వాటిని నిర్మించిన ఉద్దేశానికి భంగం కలగకుండా నిరోధించే అధికారం వాల్టా అథారిటీకి ఉంటుంది. అలాగే, చెరువులు, కుంటలు, నాలాలు, రిజర్వాయర్లు
ALSO READ :సింగరేణిలో 2,364 మంది వర్కర్ల రెగ్యులరైజ్
ఇతర నీటి వనరులపై సర్వే నిర్వహించి, శాశ్వత ప్రాతిపదికన హద్దులను గుర్తించడం, ఆక్రమణలను తొలగించడం, నిరోధించడం, నీటి వనరుల్లో కలుషితాలు, వ్యర్థాలు కలవకుండా చూడడం ఈ అథారిటీల బాధ్యత. కాగా, హైడ్రా బాధ్యతలను సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్‌కు అప్పగించిన తరహాలోనే నీటి వనరుల బౌండరీ గుర్తించి, ఆక్రమణలను నిరోధించే లేదా తొలగించే అధికారాన్ని వాల్టా అథారిటీకి కల్పించి.. ఎవరైనా ఆఫీసర్ (డిజిగ్నేటెడ్ ఆఫీసర్)కు అప్పగించాలని సర్కారు భావిస్తున్నట్టు తెలిసింది.