సర్పంచ్, కార్యదర్శికి మళ్లీ జాయింట్ చెక్ పవర్?..ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసే చాన్స్

  •     ఉప సర్పంచ్​కు చెక్ ​పవర్ తొలగించే యోచనలో సర్కారు
  •     వరుసగా రెండు టర్మ్​ల రిజర్వేషన్ ను రద్దుచేసే చాన్స్
  •      అభ్యర్థులకు ఇద్దరు పిల్లలకు మించి ఉండరాదనే నిబంధన కూడా ఎత్తివేత!
  •     పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలకు ప్రభుత్వం కసరత్తు

హైదరాబాద్, వెలుగు : గ్రామ పంచాయతీల ఎన్నికలకు క్షేత్రస్థాయిలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర సర్కారు.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు చర్చ జరుగుతోంది. ఉప సర్పంచ్ కు చెక్​పవర్, వరుసగా రెండు టర్మ్​ల రిజర్వేషన్, అభ్యర్థులకు ఇద్దరు పిల్లలకు మించి ఉండరాదనే నిబంధన విషయంలో పలు సవరణలు చేయనున్నట్టు తెలుస్తోంది. 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు చేసి.. సెక్రటరీ స్థానంలో ఉప సర్పంచ్​కు జాయింట్​చెక్​పవర్​ఇచ్చింది. 

దీంతో చాలా పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ కు మధ్య విభేదాలు తలెత్తి.. ఆ ఎఫెక్ట్​ అభివృద్ధి పనులపై పడింది. ఈ గొడవలు చినికిచినికి గాలివానలా మారి.. వందలాది గ్రామాల్లో సర్పంచులు, ఉప సర్పంచులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్, ఉప సర్పంచ్ చెక్ పవర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిసింది. మళ్లీ సర్పంచ్, కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ కల్పించే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. 

అయితే, సర్పంచ్, ఉప సర్పంచులకు చెక్ పవర్ కంటిన్యూ చేయాలని కొందరు.. గతంలో మాదిరిగా సర్పంచ్, సెక్రటరీకే జాయింట్ చెక్​పవర్ ఉండాలని  మరికొందరు.. ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై గ్రామాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

మళ్లీ సింగిల్​ టర్మ్​ రిజర్వేషన్​?

ప్రస్తుతం పంచాయతీల్లో  రెండు టర్మ్​ల రిజర్వేషన్ విధానం కొనసాగుతున్నది. గతంలో సింగిల్ టర్మ్ రిజర్వేషన్ ఉండేది. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు కొనసాగుతూ వచ్చాయి. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వ 2018లో పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించి రెండు టర్మ్​ల రిజర్వేషన్​ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో పదేండ్ల వరకు పంచాయతీలలో అదే రిజర్వేషన్ కొనసాగనున్నది. ఈ విధానాన్ని మార్చి మళ్లీ పాత పద్ధతిలో  సింగిల్ టర్మ్ రిజర్వేషన్ అమలు చేసేలా అసెంబ్లీలో చట్టం చేయనున్నట్టు తెలిసింది. అంతేకాకుండా, ప్రస్తుతం ఉన్న పంచాయతీరాజ్ చట్టంలో సర్పంచ్​లపై వేటు వేసే అధికారం కలెక్టర్లకు కల్పించింది. దీనిపై క్షేత్రస్థాయిలో అనేక విమర్శలు వచ్చాయి. 

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకున్న సర్పంచ్​పై కలెక్టర్​ వేటు వేయడమేమిటని, ఈ నిబంధన తొలగించాలని ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినా పట్టించుకోలేదు. దీంతో,  సర్పంచ్ పై కలెక్టర్లు వేటు వేసే అధికారాన్ని తొలగించాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్టు కూడా చర్చ జరుగుతోంది. అలాగే, సమగ్ర కుటుంబ, రాజకీయ, ఆర్థిక  సర్వే పూర్తయిన వెంటనే బీసీ జనాభా లెక్కించి రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. అదే సమయంలో పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేసేలా ప్రణాళిక రూపొందించినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లోనే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసే చాన్స్..

ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 213 చెబుతోంది. కానీ, మున్సిపాలిటీ చట్టం ప్రకారం కౌన్సిలర్, చైర్మన్, కార్పొరేటర్, మేయర్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు ఎంతమంది పిల్లలున్నా పోటీకి అవకాశముంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లోనే పంచాయతీలకు ఒక రకంగా, మున్సిపాలిటీలకు మరో రకంగా చట్టాలుండడంపై విమర్శలు వస్తున్నాయి. 

మున్సిపాలిటీలకు లేని నిబంధన పంచాయతీలకు ఎందుకని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడితెస్తున్నారు. దీంతో ఎంత మంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని, ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయాలనే డిమాండ్​ను  తెరపైకి తీసుకొచ్చారు. దీంతో రేవంత్​ రెడ్డి సర్కార్ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.