
ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలో సైబీరియన్ కొంగలకు ఆవాస ప్రాంతమైన ఖమ్మం రూరల్ మండలం చింతపల్లికి విదేశీ అతిథులు ముఖం చాటేశాయి. ఏటా జనవరి నుంచి జూలై వరకు గ్రామంలోని చింతచెట్ల మీద సందడి చేసే ఈ వలస పక్షులు మూడేండ్లుగా రావడం మానేశాయి. సైబీరియన్ కొంగలకి, ఈ చింతపల్లికి దాదాపు వందేండ్ల అనుబంధం ఉంది. కాగా గ్రామంలో కొన్నేళ్ల నుంచి కోతుల బెడద తీవ్రమైంది. చెట్లపై మకాం వేస్తున్న కోతులు, ఇండ్లపై, పంటలపై దాడులు చేస్తుండడంతో కొందరు చెట్లను, కొందరు కొమ్మలను నరికేయడంతో పక్షుల ఆవాసాలు దెబ్బతిన్నాయి. గూళ్లు కట్టే అవకాశం లేకపోవడంతో విదేశీ పక్షులు రావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొంగలు వస్తలే.. టూరిస్టులు రావట్లే..
చింతపల్లి గ్రామానికి దాదాపు వందేళ్ల నుంచి యేటా సైబీరియన్ కొంగలు వలస రావడం ఆనవాయితీ. పొడవాటి కాళ్లు, ముక్కు కలిగి ఉండే ఈ విదేశీ కొంగలు 5 నుంచి 8 కేజీల వరకు బరువు పెరుగుతాయి. డిసెంబర్నెలాఖరులోనే కొన్ని పైలట్ కొంగలు వచ్చి ఇక్కడి పరిస్థితులను, ఆహార లభ్యత, నివాస పరిస్థితులను గమనించి తిరిగి వెళ్తాయి. అన్నీ అనుకూలంగా ఉంటే జనవరి నుంచి జూలై వరకు వెయ్యికి పైగా కొంగలు వలస వచ్చి ఇక్కడ ఉన్న చింత చెట్లు, తుమ్మ చెట్లపై గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయి. సమీపంలోని చెరువులతో పాటు పాలేరు రిజర్వాయర్ వరకు వేటకు వెళ్లి చేపలను ఆహారంగా తీసుకుంటూ ఇక్కడే గుడ్లు పెట్టి వాటిని పొదుగుతాయి. గుడ్డు నుంచి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత కొన్నాళ్లకు పిల్లలతో కలిసి తల్లులు కూడా తిరిగి వెళ్తాయి. కానీ కొన్నాళ్లుగా సైబీరియన్ కొంగల హడావుడి చింతపల్లిలో కనిపించడం లేదు. ఏటా పక్షులు వచ్చిన సమయంలో ఎండాకాలం సెలవుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువ మంది చింతపల్లికి వచ్చేవారు. టూరిస్టుల రాకతో స్థానికులకు కొంత ఉపాధి అవకాశం కూడా ఉండేది. కానీ ఇప్పుడు పక్షులు రాకపోవడంతో టూరిస్టులు కూడా రావడం లేదు.
కోతుల బెడద వల్లే..
తెలంగాణలోని అన్ని గ్రామాల్లాగానే కొన్నేళ్లుగా చింతపల్లిలో కూడా కోతుల బెడద పెరిగింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కోతులు చెట్లపై మకాం వేయడం, చెట్లపై ఉండే పక్షుల గూళ్లను పాడు చేయడం, కొంగల గుడ్లను కింద పడేయడం వంటి పనులు చేస్తున్నాయి. చెట్ల మీది నుంచి ఇండ్లపైకి, పంటల చేలపైకి దాడులు చేస్తున్నాయి. ఈ ఇబ్బందులు తట్టుకోలేక కొందరు ఇండ్ల దగ్గర ఉన్న చెట్ల కొమ్మలను నరికేయడం, ఇంకొందరు పూర్తిగా చెట్లను తొలగించడం ప్రారంభించారు. దీంతో గ్రామంలో చింతచెట్ల సంఖ్య తగ్గింది. ఈ కారణంగానే కొంగల రాక తగ్గిందని స్థానికులు, అధికారులు అంచనా వేస్తున్నారు. 2017 నుంచి చింతపల్లిలో సైబీరియా కొంగల రక్షణకు అటవీశాఖ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. కానీ పక్షులు రావడం లేదు. కాగా కొంగల వ్యర్థాల వల్ల వచ్చే దుర్వాసనను భరించలేక కూడా స్థానికులు చెట్లను నరికేశారని తెలుస్తోంది.
కోతుల బెడద వల్లే రావడం లేదు
ప్రతి యేటా వచ్చే కొంగలు చెట్లపై గూడు కట్టుకొని గుడ్లు పెడతాయి. కొన్నేళ్ల నుంచి ఊరిలో కోతుల బెడద పెరుగుతోంది. వాటి వల్ల చెట్లపై గుడ్లు దక్కడం లేదు. కోతులు ఒక కొమ్మ నుంచి మరో కొమ్మపైకి దూకడం వల్ల గుడ్లు కిందపడి పగిలిపోతున్నాయి. కోతులపై టూరిజం, అటవీ అధికారులు సహా ప్రజాప్రతినిధులు చాలా మందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కోతులను పట్టుకోవడానికి గానీ, వాటిని ఇక్కడి నుంచి పంపించేందుకు గానీ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అందుకే ఇక్కడికి రావడానికి కొంగలు భయపడుతున్నాయి.
– వల్లమల రమేశ్, చింతపల్లి
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం
యేటా జనవరి ప్రారంభంలోగా పక్షులు ఇక్కడికి వచ్చి, జూన్ నెలాఖరు వరకు ఉండడం సంప్రదాయంగా వస్తోంది. పక్షుల పెంట వల్ల వచ్చే కంపును భరించలేని కొందరు గ్రామస్తులు పెద్ద చెట్లను నరికివేశారు. కోతుల వల్ల కూడా కొంగల రాకపై ప్రభావం పడిందని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే కొంగలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించేలా ప్లాన్ చేశాం. చింతపల్లి, పాలేరు రిజర్వాయర్ దగ్గర పక్షుల కోసం ఆర్టిఫిషియల్‌గా బర్డ్ స్టాండ్ల ఏర్పాటు గురించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. అనుమతులు, నిధులు రాగానే పనులు ప్రారంభిస్తాం. – సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జిల్లా అటవీశాఖ అధికారి