సిద్దిపేట, వెలుగు:రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణకు సంబంధించి అధికారులు త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. అలైన్మెంట్ మార్కింగ్ చేసీ.. అభిప్రాయ సేకరణ జరిపీ నెలలు గడుస్తున్నా త్రీడీ నోటిఫికేషన్ విడుదల చేయక పోవడంతో మిగులు భూముల అభివృద్ధిపై ఏంచేయాలో తెలియక రైతులు అయోమయంలో చిక్కుకున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ ఆర్ ఆర్) ఫస్ట్ ఫేజ్ కింద సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 20 మండలాలు, 111 గ్రామాల గుండా 158 కిలో మీటర్ల మేర నిర్మాణానికి అలైన్మ్మెంట్ ఖరారు చేశారు.ఈ మేరకు మార్కింగ్ పూర్తి చేశారు. సిద్దిపేట జిల్లాలో ఐదు మండలాల్లోని 19 గ్రామాల గుండా 31.7 కిలో మీటర్ల మేర ట్రిపుల్ ఆర్ నిర్మాణం జరగనుంది. ఇందుకోసం దాదాపు 930 ఎకరాల భూమి సేకరించనున్నారు. జిల్లాలోని రాయపోల్, గజ్వేల్, వర్గల్, మర్కూక్, జగదేవ్‌పూర్ మండలాల్లోని పీర్లపల్లి, ఇటిక్యాల, అలీరాజపేట, ఎర్రవల్లి,బేబర్తి, అంగడి కిష్టాపూర్, మర్కుక్, పాములపర్తి, శ్రీగిరిపల్లి, ప్రజ్ఞాపూర్, ముట్రాజ్ పల్లి, సంగాపూర్, గజ్వేల్, కోమటిబండ, మక్తమాసాన్ పల్లి, బంగ్ల వెంకటాపూర్, బేగంపేట, ఎల్కల్ గ్రామాల గుండా ఆర్ఆర్ ఆర్ వెళ్తుంది. నేషనల్ హైవేలను కనెక్ట్ చేస్తూ ప్రస్తుతం ఫోర్ లేన్‌గా నిర్మించే ఈ రోడ్డును ఫ్యూచర్లో 6 నుంచి 8 లేన్లకు విస్తరించేందుకు అనుగుణంగా ప్లాన్ చేయడంవల్ల భూసేకరణ ఎక్కువ చేయాల్సివస్తోందని అంటున్నారు.
స్పష్టత కరువు
త్రీడీ గజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేస్తేనే భూసేకరణ, పరిహారాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గ్రామాల వారీగా ఏ సర్వే నెంబర్లో ఎవరి భూమి ఎంత సేకరిస్తారో.. ఏ భూమికి ఎంత పరిహారం వస్తుందో అన్న వివరాలతో గజిట్ విడుదల చేయాల్సిఉంది. మూడు నెలల కింద గజ్వేల్‌లో అభిప్రాయ సేకరణ నిర్వహించినప్పుడు కొద్ది రోజుల్లో త్రీడీ గెజిట్ వస్తుందని అధికారులు ప్రకటించినా రేపు మాపంటూ కాలం గడిపేస్తున్నారు. గజ్వేల్ డివిజన్ పరిధిలోని 17 గ్రామాల్లో రైతుల వారీగా భూముల సర్వే ప్రక్రియ ఇంకా క్షేత్ర స్థాయిలో పూర్తికాలేదని తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో ఆందోళనతో పాటు ఇతర కారణాల వల్ల డిటైల్డ్ సర్వేలో జాప్యం జరగుతున్నట్టు చెప్తున్నారు.
పరిహారాలపైనే అందరి దృష్టి
ట్రిపుల్ ఆర్ కోసం సేకరించి భూములకు పరిహారం ఎంత చెల్లిస్తారనే విషయంలో జోరుగా చర్చ సాగుతోంది. ఇక్కడి భూములకు బహిరంగ మార్కెట్లో ఎకరానికి రూ.50 లక్షల కంటే ఎక్కువ పలుకుతుండటంతో సర్కారు నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జిల్లాలో పలు ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములను అత్యధికంగా ఎకరానికి రూ.13 లక్షల వరకు చెల్లించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో గతంలో భూములు సేకరించగా.. హైదరాబాద్ కు దగ్గరగా ఉన్నాయన్న కారణంగా ఎక్కువ పరిహారం ఇచ్చారు. ఇప్పటి మార్కెట్ రేటు పెరగడంతో ట్రిపుల్ ఆర్ కింద పరిహారాన్ని ఎంత ఖరారు చేస్తారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. భూముల విలువ ఆధారంగా పరిహారాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ కు సంబంధించి కొద్ది రోజుల్లో త్రీడీ గజిట్ నోటిఫికేషన్ ను వెలువరిస్తామని గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి తెలిపారు. అలైన్మెంట్ వల్లే గ్రామాల్లో రైతుల వారీగా రెవెన్యూ సిబ్బంది సర్వే జరుపుతున్నారని కొన్ని కారణాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైందన్నారు.