పెద్దోళ్లకు గడ్డుకాలం : రెండేండ్లుగా సొంతగడ్డపై సీనియర్ల తడ‘బ్యాటు’

పెద్దోళ్లకు గడ్డుకాలం : రెండేండ్లుగా సొంతగడ్డపై సీనియర్ల తడ‘బ్యాటు’

(వెలుగు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌): న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో టెస్టు సిరీస్‌‌‌‌‌‌‌‌ టీమిండియాకు అత్యంత చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. కొంతకాలంగా విదేశాల్లోనూ అద్భుతంగా ఆడుతూ.. సిరీస్‌‌‌‌‌‌‌‌లు గెలుస్తున్న మన జట్టు సొంతగడ్డపై తొలిసారి 0–3తో వైట్‌‌‌‌‌‌‌‌వాష్  ఎదుర్కొని తలదించుకోవాల్సి వచ్చింది. దాంతో ఇన్నాళ్లు హీరోలుగా జేజేలు అందుకున్న మన ఆటగాళ్లపై ఒక్కసారిగా అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ ఘోర పరాజయానికి కారణం ఏంటో తెలుసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన  పరిస్థితి ఏర్పడింది. 

నిజానికి పుష్కరకాలంగా సొంతగడ్డపై టెస్టులో మన జట్టు జైత్రయాత్ర సృష్టిస్తున్నా.. ఈ క్రమంలో వరుసగా 18 సిరీస్‌‌‌‌‌‌‌‌లు గెలిచినా.. గత రెండేండ్ల నుంచి  టీమిండియాలో సూపర్ స్టార్లు, అత్యంత సీనియర్లు అయిన రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్‌‌‌‌‌‌‌‌, రవీంద్ర జడేజా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో తడబడుతున్నారు. కివీస్‌‌‌‌‌‌‌‌ చేతిలో వైట్‌‌‌‌‌‌‌‌వాష్‌‌‌‌‌‌‌‌ సమష్టి వైఫల్యమే అయినా ఎంతో అనుభవం ఉన్నా జట్టును ముందుండి నడిపించలేకపోయిన ఈ నలుగురిదే ఎక్కువ బాధ్యత అనొచ్చు. కివీస్‌‌‌‌‌‌‌‌ జట్టులో అంతగా పేరు లేని స్పిన్నర్లు ఎజాజ్ పటేల్‌‌‌‌‌‌‌‌, గ్లెన్ ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌ను సైతం ఎదుర్కోలేక వికెట్లు పారేసుకోవడం శోచనీయం. ఇండియాకు టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ అందించిన ఆనందంలో రోహిత్, కోహ్లీ టీ20 ఫార్మాట్‌‌‌‌‌‌‌‌కు వీడ్కోలు పలికారు. 

టెస్టులపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు. కానీ,  రెడ్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌లో ఈ ఇద్దరూ అంతగా రాణించలేకపోతున్నారు. గత రెండేండ్లలో  స్వదేశంలో రోహిత్‌‌‌‌‌‌‌‌ 14 టెస్టులు ఆడి 775 రన్సే చేశాడు.  అతని సగటు 31 మాత్రమే. అదే సమయంలో  కోహ్లీ  తొమ్మిది మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో  32.60 సగటుతో 489 రన్స్ చేశాడు. బంగ్లా, కివీస్‌‌‌‌‌‌‌‌తో గత ఐదు టెస్టుల్లో చెరో ఫిఫ్టీ మాత్రమే చేయగలిగారు. కోహ్లీ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడటం, ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  రోహిత్‌‌‌‌‌‌‌‌ సరైన ఆరంభం ఇవ్వలేకపోవడం జట్టును దెబ్బతీస్తోంది. 

 ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్లూ అంతంతే!

బౌలింగ్‌‌‌‌‌‌‌‌ సంగతి పక్కనబెడితే టాప్, మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెయిలైన సమయాల్లో లోయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జట్టును ఆదుకోవాల్సిన  అశ్విన్,  జడేజా బ్యాట్‌‌‌‌‌‌‌‌తో ఆ బాధ్యత తీసుకోలేకపోతున్నారు. బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఏడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 199 రన్స్ జోడించిన ఈ ఇద్దరూ న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌పై విఫలమయ్యారు.  తన హోం గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ చెన్నైలో బంగ్లాపై సెంచరీ కొట్టి  ప్రశంసలు అందుకున్న అశ్విన్‌‌‌‌‌‌‌‌  ఆ తర్వాత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఏడు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లో 1, 0, 15, 4, 18, 6, 8 స్కోర్లతో తడబడ్డాడు. చెన్నైలో బంగ్లాపై ఆకట్టుకున్న జడేజా తర్వాతి ఏడు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లో 8, 0, 5, 38, 42, 14, 6 స్కోర్లు చేశాడు. పుణెలో కివీస్‌‌‌‌‌‌‌‌పై కాస్త పోరాడిన జడ్డూ.. వాంఖడేలో ఒక్క ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో అయినా సత్తా చాటి ఉంటే జట్టుకు వైట్‌‌‌‌‌‌‌‌వాష్‌‌‌‌‌‌‌‌ తప్పించేవాడు. పైగా, కివీస్‌‌‌‌‌‌‌‌తో మూడు టెస్టుల్లో అశ్విన్‌‌‌‌‌‌‌‌ తొమ్మిది వికెట్లు మాత్రమే పడగొట్టాడు. పూర్తి టర్నింగ్‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌ అయినప్పటికీ వాంఖడేలో తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పుణెలో తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో జడేజా  వికెట్ల ఖాతా తెరవలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో మూడు వికెట్లతోనే సరిపెట్టాడు. అదే సమయంలో  కివీస్ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాంట్నర్ పుణెలో 12 వికెట్లతో ఇండియా నడ్డి విరిస్తే.. వాంఖడేలో ఎజాజ్ పటేల్‌‌‌‌‌‌‌‌ 11 వికెట్లతో దెబ్బకొట్టాడు. జడ్డూ, అశ్విన్ నిరాశపరిచినా.. గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో వాషింగ్టన్ సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌, బ్యాట్‌‌‌‌‌‌‌‌తో రాణించడం కాస్త సానుకూలాంశం. లాంగ్ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో ఇకపై అతడిని రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేయాల్సిన సమయం వచ్చింది.

దేశవాళీకి దూరమై

స్వదేశంలో టీమిండియా బ్యాటర్ల తడబాటుకు కారణం డొమెస్టిక్‌ క్రికెట్‌కు దూరంగా ఉండటం అనొచ్చు.  ఇదివరకు తరంలో సచిన్‌‌‌‌‌‌‌‌, లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌, జహీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గంగూలీ, ద్రవిడ్‌‌‌‌‌‌‌‌ వంటి మేటి  ప్లేయర్లంతా రంజీ ట్రోఫీ ఆడేవాళ్లు. ఖాళీ ఉన్నప్పుడే కాకుండా ఇంటర్నేషనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు రెండు మూడు రోజుల ముందు కూడా తమ స్టేట్‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌కు ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఫారిన్ టూర్లకు ముందు కొంతమంది కౌంటీల్లోనూ ఆడేవారు. కానీ, ఇప్పుడు గాయపడ్డ ఆటగాళ్లు తమ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ నిరూపించుకునేందుకే డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నారు.  కోహ్లీ చివరగా 2013లో రంజీ ట్రోఫీలో బరిలోకి దిగితే,  రోహిత్‌‌‌‌‌‌‌‌ తన చివరి రంజీ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ 2015లో ఆడాడు.   తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 200 టెస్టులు ఆడిన సచిన్‌‌‌‌‌‌‌‌ మరో 110 ఫస్ట్‌‌‌‌‌‌‌‌ క్లాస్ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో పోటీ పడ్డాడు.  18 ఏండ్ల కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రోహిత్‌‌‌‌‌‌‌‌  61 ఫస్ట్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో బరిలోకి దిగితే   కోహ్లీ 32 ఫస్ట్‌‌‌‌‌‌‌‌ క్లాస్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు మాత్రమే ఆడటం గమనార్హం.  ఇంటర్నేషనల్ క్రికెట్‌‌‌‌‌‌‌‌తో పాటు ఐపీఎల్‌‌‌‌‌‌‌‌తో బిజీగా ఉంటున్నప్పటికీ కనీసం స్వదేశంలో  పెద్ద జట్లతో టెస్టు సిరీస్‌‌‌‌‌‌‌‌ల ముంగిట అయినా టీమిండియా ప్లేయర్లు డొమెస్టిక్ క్రికెట్ ఆడితే మంచిది.    కివీస్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఘోర ఓటమిని బీసీసీఐ సీరియస్‌‌‌‌‌‌‌‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. దాంతో ఆస్ట్రేలియా టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీళ్లకు అగ్ని పరీక్ష కానుంది. కంగారూ గడ్డపై  కూడా తడబాటును కొనసాగిస్తే  జట్టులో సీనియర్ల  స్థానాలకూ ముప్పు తప్పదు.

వాంఖడేలో మూడో టెస్టు తర్వాత సోషల్ మీడియాలో  ఓ పోస్టు వైరల్ అవుతోంది. ఇండియా లెజెండరీ ప్లేయర్లు సునీల్‌‌‌‌‌‌‌‌ గావస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సచిన్ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమ చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను వాంఖడేలో ఆడారు. ఒకవేళ ఇండియా బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–గావస్కర్ ట్రోఫీలోనూ ఓడి.. వరల్డ్ టెస్టు చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌కు ఇండియా అర్హత సాధించలేకపోతే  రోహిత్‌‌‌‌‌‌‌‌, కోహ్లీ, జడేజా, అశ్విన్ కూడా స్వదేశంలో తమ చివరి టెస్టు వాంఖడేలోనే ( కివీస్‌‌‌‌‌‌‌‌తో మూడో మ్యాచ్‌‌‌‌‌‌‌‌) ఆడేసినట్టే అన్నది ఆ పోస్టు సారాంశం.