కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణకు 290 టీఎంసీ లు ఇస్తే చాలని కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ లిఖిత పూర్వకంగా ఒప్పుకుందని అన్నారు. గత ప్రభుత్వం ఏపీకి 512 టీఎంసీల పంపిణీకి సంతకాలు చేసిందని చెప్పారు. రాష్ట్రానికి న్యాయ పరంగా రావాల్సిన నీటి వాటాను సంపాదించుకోలేదని చెప్పారు. కృష్ణా జలాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు.
కృష్ణా పరివాహిక ప్రాంతం 68 శాతం తెలంగాణలో నే ఉందన్నారు. కృష్ణాలో మన పరిధికి రావాల్సిన నీటి వాట 68 శాతం ఉందని చెప్పారు. కానీ అప్పటి సీఎం కేసీఆర్ తమకు 38 శాతం చాలని సంతకం చేసి వచ్చారని తెలిపారు. ఏనాడు కూడా తెలంగాణకు కృష్ణా నీళ్లలో 60 శాతం వాటా కావాలని గత ప్రభుత్వం కేంద్రం ముందు ఉంచలేదన్నారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాకోసం బీఆర్ఎస్ విఫలమైందన్నారు.