వరంగల్సిటీ, వెలుగు : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి నిత్యం వేలాది మంది రోగులు వారి సహాయకులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రికి మూడు పెద్ద గేట్లు ఏర్పాటు చేశారు. రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ గేట్లకు 1, 2, 3గా పేర్లు కూడా పెట్టారు. పోచమ్మమైదాన్ నుంచి ఎంజీఎంకు వచ్చే దారిలో మొదటగా ఎదురయ్యే గేటు నెంబర్ 1గా, సిగ్నల్ వద్ద ఉండే గేటు నెంబర్ 2గా పిలుస్తారు.
పాపయ్యపేట చమన్ నుంచి బల్దియాకు ఎదురుగా ఉండేది 3వ గేటు. కాగా, మూడో గేటుకు చాలా రోజుల నుంచి గొలుసుతో తాళాలు వేసి ఉంచుతున్నారు. దీంతో రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ గేటుకు తాళం వేయడంతో మిగతా గేట్ల వద్దకు వెళ్లేందుకు దూరం కావడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.
అంతేకాకుండా ఈ మూడోగేటుకు ఎదురుగా ఛాయ్ దుకాణం ఉండడంతో ఇక్కడి నుంచి వెళ్లేందుకు రోగులకు ఎంతో ఇబ్బందిగా మారిందని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గేటు తెరిపించాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు.