కోల్‌బెల్ట్, వెలుగు: కాజీపేట– బల్లార్షా మార్గంలో మూడో లైన్ పనులు స్పీడ్ అందుకోనున్నాయి. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో ఈ లైన్‌కు రూ.450.86 కోట్లు కేటాయించడంతో పనులు తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఫలితంగా మూడో లైన్అందుబాటులోకి వచ్చి సరుకు రవాణా రైళ్లతో పాటు, ప్యాసింజర్స్రైళ్ల సంఖ్య పెరిగే చాన్స్ ఉంది. ప్రస్తుతం ఈ రూట్రెండు లైన్లుగా ఉంది. ఢిల్లీ–సికింద్రాబాద్, ఢిల్లీ– చైన్నై మార్గంలో కీలకమైన మార్గం కావడంతో ప్యాసింజర్‌రైళ్లు ఎక్కువగా నడుస్తుంటాయి. దీంతోపాటు సరుకు రవాణాలో దేశంలో ఇది కీలక మార్గం. దీంతో ఎప్పుడూ ఈ లైన్బిజీగా ఉంటుంది. ఈ రూట్ వినియోగం 127శాతం ఉందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. కొత్తగా అందుబాటులోకి రాబోతున్న మూడో లైను రద్దీకి పరిష్కారం కానుంది. 235 కి.మీ పొడవు ఉండే ఈ మార్గంలో సింగరేణి బొగ్గు, సిమెంట్ రవాణా ఎక్కువగా ఉంటుంది. లైన్ల కెపాసిటీ లేకపోవడంతో కొత్తగా మరిన్ని రైళ్లకు డిమాండ్ఉన్నా నడపలేని పరిస్థితి.
2010లో మూడో లైన్‌కు నిర్ణయం
కాజీపేట–బల్లార్షా మార్గంలో రద్దీ పెరగడంతో 2010లో రూ.2,400 కోట్ల అంచనాతో మూడో రైల్వే లైన్ ప్రతిపాదన చేశారు. 2016లో మందమర్రి–రాఘపురం మధ్య 33 కి.మీ పూర్తి చేశారు. 2015–16లో 202 కి.మీ ట్రిప్లింగ్, ఎలక్ట్రికల్పనులకు రూ.2,063 కోట్లు మంజూరు చేశారు. గత బడ్జెట్లో రూ.548 కోట్లు, తాజాగా రూ.450.86 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా మందమర్రి నుంచి ఉప్పల్ వరకు, మహారాష్ట్రలోని మానిక్ఘర్నుంచి వీరూర్ వరకు 110 కి.మీ రైల్వే లైను పనులు పూర్తయ్యాయి. రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. వీరూర్ నుంచి రెబ్బెన మండలంలోని ఆసిఫాబాద్ రోడ్ వరకు 125 కి.మీ మేర పనులు సాగుతున్నాయి. రెబ్బెన నుంచి మందమర్రి వరకు పనులు స్లోగా సాగుతున్నాయి.
కొత్త రైళ్లకు చాన్స్
ప్రస్తుతం ఈ మార్గంలో రోజూ 60 నుంచి 80 సరుకు రవాణా రైళ్లు, అంతే సంఖ్యలో ప్యాసింజర్‌రైళ్లు తిరుగుతున్నాయి. దీంతో ఈ మార్గం రద్దీగా ఉండి రైళ్ల స్పీడ్బాగా తగ్గింది. కొత్త లైన్ అందుబాటులోకి వస్తే ఎక్స్‌ప్రెస్ రైళ్ల సగటు వేగం 70కి.మీ నుంచి 90కి.మీ వరకు, గూడ్స్ రైళ్లు 30 కి.మీ నుంచి 50 కి.మీకు పెరగనుంది. క్రాసింగ్ సమస్య తీరనుంది. కొత్తగా ఢిల్లీ, నాగ్‌పూర్, ముంబైలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, వందే భారత్ రైళ్లు నడిపే చాన్స్ ఉంటుంది. ప్రధాన పట్టణాల మధ్య ఇంటర్సిటీ రైళ్ల సంఖ్య పెరగనున్నాయి.
పూర్తవుతున్న పనులు
హనుమకొండ జిల్లా ఉప్పల్ నుంచి మందమర్రి వరకు మూడోలైన్ పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చింది. మహారాష్ట్ర మానిక్‌ఘర్ నుంచి వీరూర్ వరకు 110 కి.మీ మేర పనులు పూర్తయ్యాయి. కాగజ్‌నగర్ నుంచి సిర్పూర్(టి) వరకు టైగర్ జోన్ ఉండటంతో ఫారెస్ట్క్లియరెన్స్లేక రెండేండ్లుగా పనుల్లో లేటు అయ్యాయి. టైగర్‌జోన్‌లో పులులకు ఆవాసం, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఎన్‌టీసీఏ(నేషనల్ టైగర్ కన్జర్వేజన్ అథారిటీ) రైల్వే ఆఫీసర్లకు సూచించింది. దీంతోపాటు వన్యప్రాణుల రాకపోకలకు అనుగుణంగా అండర్‌పాస్ నిర్మించాలని ప్రతిపాదిస్తూ మూడోలైన్ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారు. మరోవైపు కొవిడ్ కారణంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పనులు ఆలస్యమయ్యాయి.'