
- షూటర్ స్వప్నిల్ కుశాలెకు కాంస్యం.. సింధు, నిఖత్, శ్రీజ, సాత్విక్ ఇంటిదారి
పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా షూటర్లు పతకాల మోత మోగిస్తున్నారు. మను భాకర్ ఇప్పటికే రెండు పతకాలు రాబట్టగా.. ఇప్పుడు మరో షూటర్ స్వప్నిల్ కుశాలె దేశానికి మూడో కాంస్య పతకం అందించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ విభాగంలో మూడో స్థానంలో నిలిచి కంచు పతకం అందుకున్నాడు. కానీ, మిగతా పోటీల్లో ఇండియాకు చుక్కెదురైంది.
స్వర్ణం తెస్తారని ఆశించిన షట్లర్లు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్, తొలి ఒలింపిక్స్‌లోనే పతకంపై గురి పెట్టిన నిఖత్ జరీన్‌తో పాటు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ తమ మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించారు.
సరిగ్గా మూడేండ్ల కిందట టోక్యో ఒలింపిక్స్‌లో భారీ అంచనాలతో 15 మందితో కూడిన బలగంతో బరిలోకి దిగింది మన షూటింగ్ టీమ్. కానీ, ఒక్క పతకం కూడా నెగ్గలేక తీవ్రంగా నిరాశ పరిచింది. మూడేండ్లు తిరిగే సరికి సీన్ రివర్సైంది. పారిస్ మెగా గేమ్స్‌లో మన షూటర్ల తుపాకీ నుంచి దూసుకెళ్తున్న తూటాలు.. కంచు మోత మోగిస్తున్నాయి.
మెగా క్రీడల్లో పతక బోణీ చేసిన స్టార్ షూటర్ మను భాకర్ దేశానికి రెండో పతకం కూడా అందిస్తే.. ఇప్పుడు మరాఠా వీరుడు స్వప్నిల్ కుశాలె ముచ్చటగా మూడో కాంస్య పతకం తెచ్చాడు. అంచనాలు లేకపోయినా.. అవరోధాలు ఎదురైనా.. లక్ష్యాన్ని అందుకున్న స్వప్నిల్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ విభాగంలో దేశానికి తొలి పతకం సాధించి చరిత్రకెక్కాడు.
ఇండియా షూటింగ్‌లో కొన్నేండ్లుగా టీనేజ్ షూటర్ల హవా నడుస్తోంది. ఈ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన మను భాకర్‌తో పాటు సరబ్‌జోత్ సింగ్, ఇషా సింగ్ వరకూ చాలా మంది టీనేజ్‌లో తమ టాలెంట్ చూపెట్టిన వాళ్లే. ఆటలోకి వచ్చిన ఐదారేండ్లకే అత్యున్నత స్థాయిలో సక్సెస్ చూసిన వాళ్లే. కానీ, పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు మూడో పతకం అందించిన 28 ఏండ్ల స్వప్నిల్ కుశాలె వీళ్లకు పూర్తిగా భిన్నం.
అతను ఆటలోకి అడుగు పెడుతూనే అదరగొట్టిన వాడు కాదు. టీనేజ్‌లో సంచనాలు సృష్టించిన షూటర్ కాదు. అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పుష్కర కాలానికి గానీ ఒలింపిక్‌లో అరంగేట్రం చేయలేకపోయాడు. కానీ, వచ్చిన అవకాశాన్ని అందుకొని చరిత్రలో నిలిచాడు.
స్వప్నిల్ మహారాష్ట్రలో వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించాడు. తండ్రి టీచర్ కాగా, తల్లి తన ఊరు సర్పంచ్. తండ్రి ప్రోత్సాహంతో 2009లో షూటింగ్‌లోకి వచ్చిన కుశాలె మూడేండ్ల తర్వాత అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అందరిలానే అత్యున్నత స్థాయిలో రాణించాలని, ఒలింపిక్స్ మెడల్ నెగ్గాలని కలగన్నాడు. కానీ, విజయాలు అతనికి అంత సులువుగా రాలేదు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం కోసం చాలా కాలం పోరాటం చేయాల్సి వచ్చింది. రియో ఒలింపిక్స్‌కు దరిదాపుల్లోకి రాలేకపోయిన కుశాలె టోక్యో 2020 బెర్త్‌ను తృటిలో కోల్పోయాడు. కానీ, పారిస్ గేమ్స్‌లో పోటీ పడేందుకు స్వప్నిల్ ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టలేదు.
ఓ వైపు రైల్వే టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే తన కలను నెరవేర్చుకునేందుకు అహోరాత్రులు కష్టపడ్డాడు. తన మాదిరిగా రైల్వే టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగం చేసిన లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీని చూసి స్ఫూర్తి పొందాడు. అతని బయోపిక్ సినిమాను చాలా సార్లు చూసిన కుశాలె ధోనీ మాదిరిగా తాను సక్సెస్ అందుకోవాలని ప్రయత్నించాడు.
ఈ క్రమంలో 2022 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నాలుగో ప్లేస్‌లో నిలిచి పారిస్ బెర్తు సాధించాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి ఫైనల్ చేరిన స్వప్నిల్ పతకం నెగ్గి తన కలను నెరవేర్చుకున్నాడు. తన సక్సెస్ ఆలస్యమైనా.. అది చరిత్రలో నిలిచేలా చేసుకున్నాడు. ఆటలో ప్రతిభకు తోడు సహనం, ఓపిక ఉంటే కాస్త ఆలస్యం అయినా విజయం వెతుక్కుంటూ వస్తుందని అనేందుకు స్వప్నిల్
ప్రయాణం ఓ ఉదాహరణ.
( వెలుగు స్పోర్ట్స్ డెస్క్)