ఎయిడ్స్​కు 3 మందులు

ఎయిడ్స్​కు 3 మందులు
  • యాంటీబాడీ, ఉహాంబో, ఇంబొకొడో వ్యాక్సిన్లపై  సైంటిస్టుల ట్రయల్స్​
  • 9 దేశాల్లో 49 క్లినికల్​ ట్రయల్స్​ కేంద్రాలు
  • 2016 నుంచి ప్రయోగాలు.. 2021 నాటికి పూర్తి

హెచ్​ఐవీ ఎయిడ్స్​.. రోజూ 5 వేల మందికి సోకుతున్న మాయదారి రోగం. ప్రపంచంలో 3.7 కోట్ల మంది హెచ్​ఐవీ రోగులున్నారు. అందులో 70 శాతం కేవలం సబ్​ సహారన్​ ఆఫ్రికాలోనే ఉన్నారు. ఏటేటా 20 లక్షల మంది దాకా దాని బారిన పడుతున్నారు. అదొక్కసారి శరీరంలోకి వచ్చిందంటే.. దానిని ఆపడం కష్టం. ఆ మాయదారి వైరస్​ను చంపే మందులే లేవు. ఉన్న మార్గమల్లా నివారణే. మరి, దాని విరుగుడుకు సైంటిస్టులు ఏం చేయట్లేదా అంటే.. చేస్తున్నారు. ఎప్పటి నుంచో మందులపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ మధ్యే కొన్ని మందులూ మంచి ఫలితాలిచ్చాయన్న మంచి వార్తనూ చెప్పారు. అది కాకుండా నాలుగు ఖండాల్లోని 12 దేశాలకు చెందిన సైంటిస్టులు హెచ్​ఐవీని అంతమొందించే మూడు పద్ధతులపైనే ప్రధానంగా దృష్టిపెట్టారు. ‘హెచ్​ఐవీ వ్యాక్సిన్​ ట్రయల్స్​ నెట్​వర్క్​’ ప్రోగ్రామ్​లో భాగంగా వాటి మీద ట్రయల్స్​ చేస్తున్నారు. ఈ ట్రయల్స్​ గురించి సౌత్​ ఆఫ్రికన్​ మెడికల్​ రీసెర్చ్​ కౌన్సిల్​ ప్రెసిడెంట్​, పెరినేటల్​ హెచ్​ఐవీ రీసెర్చ్​ ప్రొఫెసర్​ గ్లెండా గ్రే వివరించారు. 9 దేశాల్లో 49 క్లినికల్​ ట్రయల్స్​ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు 18 ట్రయల్స్​ నడుస్తున్నాయి. 2016 నుంచి సాగుతున్న ఆ ట్రయల్స్​ 2021లో పూర్తవుతాయని ఆమె చెప్పారు. వాటిలో మూడు ట్రయల్స్​ ముఖ్యమంటున్నారు. ఆ మూడు, యాంటీ బాడీ మీడియేటెడ్​ ప్రివెన్షన్​ స్టడీస్​, ఉహాంబో ట్రయల్స్​, ఇంబొకొడో ట్రయల్స్​. హెచ్​ఐవీ సోకిన వేలాది మందిపై ఆ ప్రయోగాలు చేస్తున్నారు.

యాంటీ బాడీ ట్రయల్స్​

యాంటీ బాడీ మీడియేటెడ్​ ప్రివెన్షన్​.. అంటే, యాంటీ బాడీలతో హెచ్​ఐవీని చంపేయడం. మనకు ఏదైనా జబ్బు చేస్తే ఆ జబ్బుకు కారణమైన ప్రాణిని చంపి పారేసి కాపాడుతుంటాయి. అందుకే దాన్నే ప్రధానంగా టెస్టుల్లో భాగం చేస్తున్నారు. అమెరికా, బ్రెజిల్​, పెరూ, స్విట్జర్లాండ్​, తాంజానియా, జింబాబ్వే, బోత్స్వానా, దక్షిణాఫ్రికా, కెన్యా, మలావి, మొజాంబిక్​కు చెందిన 4,625 మందిపై ఈ యాంటీబాడీ ప్రయోగాలు చేస్తున్నారు. వీఆర్​సీ01 అనే యాంటీ బాడీని రోగులకు ఇచ్చి పరీక్షిస్తున్నారు. ఆ పరీక్షల్లో అది సత్ఫలితాలనిస్తున్నట్టు గ్లెండా గ్రే చెబుతున్నారు. దీన్నే న్యూట్రలైజింగ్​ యాంటీ బాడీ అని పిలుస్తున్నారు. అంటే వైరస్​ను పట్టి చంపేస్తుందన్నమాట. దాని పనులకు ఫుల్​స్టాప్​ పెట్టేస్తుందన్నమాట. 8 వారాలకొకసారి హెచ్​ఐవీ రోగులకు ఈ మందును రక్తనాళాల ద్వారా (ఇంట్రావీనస్​– ఐవీ) ఎక్కిస్తూ పరీక్షిస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న యాంటీ బాడీ టెస్టుల్లో ఇదే మంచి ఫలితాలనిస్తున్న ట్రయల్స్​ అని సైంటిస్టులు చెబుతున్నారు. హెచ్​ఐవీ మీద ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు.

ఇంబొకొడో

ఇంబొకొడో అంటే ఇసిజులులోని ఓ రకమైన రాయి అని అర్థం. దాన్నే హెచ్​వీటీఎన్​705/హెచ్​పీఎక్స్​2008 అని పిలుస్తున్నారు. దక్షిణాఫ్రికా, మలావి, మొజాంబిక్​, జాంబియా, జింబాబ్వేల్లోని హెచ్​ఐవీ లేని 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న 2600 మంది మహిళలపై దానిని ప్రయోగించి చూశారు. మొజాయిక్​ ఇమ్యునోజెన్స్​ ఆధారంగా ఈ ట్రయల్స్​ చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని వ్యక్తుల హెచ్​ఐవీ శాంపిల్​ నుంచి సేకరించిన వైరస్​ స్ట్రెయిన్సే ఈ మందు. వాటినే వ్యాక్సిన్లుగా మార్చారు. ప్రపంచంలోని వివిధ రకాల హెచ్​ఐవీని ఎదురించి పోరాడేందుకు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడమే ఈ వ్యాక్సిన్​ ట్రయల్స్​ లక్ష్యం. ఈ మూడు రకాల మార్గాలు హెచ్​ఐవీని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాయని సైంటిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ట్రయల్స్​ 2021 నాటికి పూర్తయిపోతాయని, మరికొన్నేళ్లలో హెచ్​ఐవీకి సరైన మందు దొరుకుతుందని చెబుతున్నారు.

ఉహాంబో వ్యాక్సిన్​

ఒకప్పుడు జనాల్ని మహమ్మారుల పట్టిపీడించిన చాలా వైరస్​లకు వ్యాక్సిన్లు కనిపెట్టారు. అవి వచ్చాక దాదాపు ఆ కేసులు తగ్గిపోయాయి. ఇప్పుడు ఈ ప్రాణాంతక హెచ్​ఐవీకీ వ్యాక్సిన్​ను తయారు చేసే పనిలో పడ్డారు సైంటిస్టులు. అందులో భాగంగా వచ్చిందే ఉహాంబో వ్యాక్సిన్​. ఆరోగ్యంగా ఉన్న 18 నుంచి 35 ఏళ్ల వారిపై ఈ వ్యాక్సిన్​ను టెస్ట్​ చేస్తున్నారు. నిజానికి ఈ వ్యాక్సిన్​ పాతదే. దానినే కొత్త వెర్షన్​ కింద టెస్ట్​ చేస్తున్నారు. 2003–2006 మధ్య థాయ్​లాండ్​లో అమెరికా మిలటరీ హెచ్​ఐవీ రీసెర్చ్​ ప్రోగ్రాం, థాయ్​లాండ్​ ఆరోగ్య శాఖ కలిసి ఆర్​వీ144పై ట్రయల్స్​ చేశాయి. అది మంచి ఫలితాలనిచ్చింది. ఇప్పుడు దానినే ఉహాంబో అనే కొత్త వెర్షన్​గా మార్చారు. ఆర్​వీ144 కన్నా మరింత మెరుగైన ఫలితాలు ఇచ్చేలా ఉహాంబోను తయారు చేశారు. దానిపైనా ట్రయల్స్​ 2021 నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయి.