కోఠి మెటర్నిటీ హాస్పిటల్​లో పసికందు మృతి

  •     డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన, ఫర్నిచర్ ధ్వంసం
  •     తమ నిర్లక్ష్యం లేదన్న  హాస్పిటల్ సూపరింటెండెంట్

బషీర్​బాగ్, వెలుగు :  కోఠి ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్​లో మంగళవారం మూడు రోజుల పసికందు చనిపోయాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ బాబు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. హాస్పిటల్​లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సుల్తాన్ బజార్ పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పి సముదాయించారు. గోల్నాకకు చెందిన కవిత, సాయి కిరణ్ దంపతుల బాబు మృతిపై కోఠి మెటర్నిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి వివరణ ఇచ్చారు. పసికందు మృతిలో డాక్టర్ల నిర్లక్ష్యం ఏమీ లేదని చెప్పారు.

 గత శనివారం కవిత బాబుకు జన్మనిచ్చారని, మూడు రోజులు ఆరోగ్యంగానే ఉన్నాడని, సోమవారం రాత్రి చిన్నారిని తల్లి తనతో  పాటు బాబును కింద పడుకోబెట్టుకుందని పేర్కొన్నారు. దీంతో బాబు టెంపరేచర్ ఒక్కసారిగా పడిపోయిందని, డాక్టర్లు అందుబాటులో ఉన్నా కూడా సమాచారం ఇవ్వలేదన్నారు. ఉదయం బాబు చనిపోయాడని కుటుంబసభ్యులు తమపైకి తప్పును నెడుతున్నారన్నారు. దాడికి పాల్పడిన వారిపై సుల్తాన్ బజార్ పీఎస్​లో ఫిర్యాదు చేసినట్లు 
సూపరింటెండెంట్ చెప్పారు.

ALSO READ : బాలికల ఆత్మహత్యపై ఏకకాలంలో దర్యాప్తు