
- కుటుంబసభ్యుల ఆరోపణ
- పెద్దశంకరంపేట
- పీహెచ్సీ వద్ద ఆందోళన
పెద్దశంకరంపేట, వెలుగు : మూడు నెలల బాలుడు వ్యాక్సిన్ వికటించి చనిపోయాడని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు, గ్రామస్తులు బుధవారం మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట పీహెచ్సీ ముందు ఆందోళన చేశారు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం...టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామానికి చెందిన రాములు, మల్లీశ్వరి దంపతులకు మూడు నెలల క్రితం కొడుకు (ధృవ) పుట్టాడు. బాలుడి తల్లి పెద్ద శంకరంపేట మండల పరిధిలోని బద్దారంలోని పుట్టింట్లో ఉంటోంది.
బుధవారం ఉదయం మల్లీశ్వరి మల్కాపూర్ సబ్ సెంటర్లో ధృవకు మూడో నెల వ్యాక్సిన్ (పెంట వాలెంట్) వేయించింది. పీహెచ్సీ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత ధృవ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో పెద్ద శంకరంపేటలోని పీహెచ్‌సీకి తీసుకువెళ్లింది. అప్పటికే బాలుడి పల్స్ పడిపోవడంతో చనిపోయాడని వైద్య సిబ్బంది తెలిపారు. విషయం తెలిసి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు పీహెచ్సీ వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వ్యాక్సిన్ వికటించడం వల్లే ధృవ చనిపోయాడంటూ ఆందోళనకు దిగారు.
కారకులపై చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి వచ్చి బాధితులను సముదాయించారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం జోగిపేట దవాఖానకు తరలించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు.