కొత్తకొండ జాతర నిర్వహణకు దొరకని జాగ

  •     ఏక్​ ఫసల్​ పట్టాల్లోనూ పర్మినెంట్ నిర్మాణాలు
  •     సర్వే ఊసెత్తని పాలకవర్గాలు
  •     ‘ప్రసాద్’ స్కీం ప్రపోజల్స్ కోరిన ఎంపీ
  •     లైట్​ తీసుకుంటున్న ఎండోమెంట్​ఆఫీసర్లు

హనుమకొండ, భీమదేవరపల్లి, వెలుగు: కోరిన కోర్కెలు తీర్చే కొత్తకొండ వీరభద్రస్వామి జాతరకు సమయం ఆసన్నమైంది. ఈ నెల  10 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా.. ఆలయ పాలకవర్గం, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా జాతర కోసం చుట్టుపక్కల జిల్లాల నుంచి 5 లక్షలకు పైగా భక్తులు వస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. జాతర నిర్వహణకు మాత్రం జాగ కరువైంది. ఆలయ భూములు కబ్జా చెరలో ఉండడంతో భక్తులు సేద తీరేందుకు స్థలం దొరకడం లేదు. వీరభద్రుడి భూముల్లో పలు అక్రమ నిర్మాణాలు వెలిసినా.. సర్వే చేయాల్సిన పాలకవర్గాలు, అధికారులు లైట్​ తీసుకుంటున్నారు. దీంతో ఆలయం చుట్టూ ఉన్న ఏక్​ ఫసల్ భూముల్లో పర్మినెంట్ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఫలితంగా జాతరలో దుకాణాలు, రంగుల రాట్నాల ఏర్పాటుతో రోడ్లు ఇరుకుగా మారి ట్రాఫిక్  తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఆక్రమణలో ఆలయ భూములు..

గతంలో వీరభద్రస్వామి ఆలయానికి 16 ఎకరాలకు పైగా స్థలం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఆ స్థలంలోనే ఏటా జాతర సమయంలో సర్కసులు, రంగుల రాట్నాలు, ఇతర దుకాణాలు ఏర్పాటు చేసుకుని, వందల మంది ఉపాధి పొందేవారు. కానీ ఆ తరువాత ఆలయ భూములు తగ్గుతూ వస్తున్నాయి. కొంతమంది ఆఫీసర్లు కాసులకు కక్కుర్తి పడటంతో దాదాపు మూడు ఎకరాల వరకు ప్రైవేటు వ్యక్తులకు పట్టాలయ్యాయి.  గతంలో ఆలయ ఈవో, ప్రస్తుత ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్​ రామల సునీత సర్వే చేయగా.. ఆలయానికి 14 ఎకరాల వరకు స్థలం ఉన్నట్లు తేల్చారు. 

కానీ ఆ తరువాత ఆక్రమణలు జరిగినా.. ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఆలయ పరిసరాల్లో దాదాపు నాలుగు ఎకరాల వరకు ఏక్​ ఫసల్​ భూములు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ స్థలంలో ఒక పంట మాత్రమే వేసి.. ఇంకో సీజన్​ లో స్థలాన్ని జాతర నిర్వహణకు కేటాయించాల్సి ఉంది. కానీ అలా జరగడం లేదు. పైగా ఆ భూముల్లో పర్మినెంట్ ఇండ్లు, దుకాణాల వెలుస్తున్నాయి. దీంతో జాతరలో బండ్లు తిరిగేందుకు ఇబ్బందులు తలెత్తుతుండగా.. ఒక జాము నిద్ర చేయాలనుకునే భక్తులకు ఆ సౌకర్యం లేకుండా పోయింది.

‘ప్రసాద్’ కు ప్రపోజల్స్ పంపుతలేరు..

వీరభద్రుడి ఆలయానికి ఏటా రూ.కోట్ల ఆదాయం వస్తున్నా.. అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. గతంలో కరీంనగర్​ఎంపీ బండి సంజయ్ కొండ పైకి మెట్ల మార్గం ఏర్పాటు చేస్తే మరో యాదాద్రిగా విరాజిల్లుతుందని, ఈ మేరకు ఆలయ అభివృద్ధికి ప్రపోజల్స్​ రెడీ చేయాలని ఆఫీసర్లకు సూచించారు. కేంద్రంతో మాట్లాడి ‘ప్రసాద్’ స్కీంకు ఎంపిక చేస్తామన్నారు. కానీ ఆఫీసర్లు మాత్రం ప్రపోజల్స్ పంపలేదు. ఇదిలాఉంటే ఆలయానికి రూ.2 కోట్ల ఆదాయం వస్తే.. సీఎం కేసీఆర్​ను తీసుకొస్తానని హుస్నాబాద్​ఎమ్మెల్యే సతీశ్ బాబు రెండేండ్లుగా చెబుతున్నారు. ఆదాయం పెంచే మార్గాలు కూడా సూచించారు. కానీ ఆఫీసర్లు మాత్రం ఆదాయానికి తగ్గ ఖర్చు చూపుతున్నారు. దీంతో ఆఫీసర్ల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాక దుకాణాల నుంచి వచ్చే ఆదాయం లెక్కలు కూడా చూపించడం లేదనే ఆరోపణలున్నాయి. 

రేపటి నుంచి ఉత్సవాలు షురూ..

ఈ నెల 10న వీరభద్రుడి కల్యాణోత్సవంతో స్వామివారి బ్రహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కాగా  11న త్రిశూల పూజ,12న వాస్తు పూజ,13న లక్ష బిల్వార్చన,14న భోగి,15న సంక్రాంతి, బండ్లు తిరుగుట,16న నాగవెల్లి,పుష్పయాగం,17న త్రిశూల స్నానం,18న అగ్నిగుండాలు సాయంత్రం స్వామి వారి ఊరేగింపుతో జాతర ముగియనుంది. కాగా జాతరకు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేయాల్సిన పాలకవర్గం తాత్కాలిక పనులతో నెట్టుకొస్తోందనే విమర్శలున్నాయి.

ఆలయ  భూములపై రీ సర్వే చేస్తం

వీరభద్రస్వామి ఆలయానికి 13 ఎకరాల వరకు స్థలం ఉంది. అందులో కొంతభాగం షాపింగ్​ కాంప్లెక్స్​, హరితహోటల్​, విశ్రాంతిగదుల నిర్మాణానికి కేటాయించాం. కాగా ఆలయానికి ఉన్న సాగు భూములు ఆక్రమణకు గురవుతున్న విషయం  వాస్తవమే.  గుడి చుట్టూ ఉన్న ఏక్​ ఫసల్​ భూముల్లో నిర్మాణాలతో పాటు ఆలయ భూములను జాతర తరువాత రీసర్వే చేయిస్తం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. –  కిషన్ రావు, ఆలయ ఈవో