దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు 1,319

రెండేళ్లుగా బీజేపీ చేతిలో ఉన్న రాష్ట్రాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మెయిన్​ ల్యాండ్​గా భావించేచోట అయిదు రాష్ట్రాలు కాంగ్రెస్​ చేతిలోకి వెళ్లిపోయాయి. బీజేపీ గ్రాఫ్ పడిపోవడం మొదలైందని కొంతమంది అప్పుడే ఒక అంచనాకు వస్తున్నారు. అయితే, ఇది కరెక్ట్ కాదంటున్నారు ఎనలిస్టులు. దేశవ్యాప్తంగా జాతీయ పార్టీల పరిస్థితి చూస్తే…  కాంగ్రెస్ కంటే బీజేపీయే మెరుగ్గా ఉందంటున్నారు వీళ్లు.

గుజరాత్​, హిమాచల్​ప్రదేశ్​ రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరడంతో దేశంలో మూడొంతుల నేల కాషాయమయం అయిందన్నారు. కాంగ్రెస్​కి మళ్లీ ఇప్పట్లో తేరుకోవడం కష్టమే అనుకున్నారు. ఏడాది తిరిగేసరికి పరిస్థితి తారుమారైంది. 2018 చివరిలో జరిగిన మధ్యప్రదేశ్​, రాజస్థాన్, చత్తీస్​గఢ్​ ఎన్నికల్లో  బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. ఈ ఏడాది లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ పుంజుకోవడమేకాకుండా, కాంగ్రెస్​ పార్టీకి అపోజిషన్​ హోదా దక్కకుండా పోయింది. అదే ఊపులో మహారాష్ట్ర, హర్యానా, ఛత్తీస్​గఢ్​ ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. జ్యోతిషం పరిభాషలో చెప్పాలంటే… ఈ రెండేళ్లలో బీజేపీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి.

మహారాష్ట్రలో బీజేపీ మెజారిటీ సీట్లు గెలుచుకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. హర్యానాలోనైతే కొత్తగా పుట్టుకొచ్చిన దుష్యంత్ సింగ్​ చౌతాలా పార్టీ ‘జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ)’ సాయం అందిస్తే కానీ సర్కార్ నిలబడలేదు. లేటెస్ట్​గా జరిగిన జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మింగుడుపడలేదు. ఇక్కడ జేఎంఎం, కాంగ్రెస్ కూటమి గెలిచింది. బీజేపీ ఓటమి పాలైంది. అంతమాత్రాన బీజేపీ డీలా పడిపోయిందని అనుకోవడానికి వీల్లేదంటున్నారు ఎనలిస్టులు. లెక్కలు తీస్తే దేశవ్యాప్తంగా ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది బీజేపీనే. మొత్తం 11 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలున్నాయి. మరో ఐదు రాష్ట్రాల్లోని కొయిలేషన్ గవర్నమెంట్లలో బీజేపీ పార్ట్​నర్​గా కొనసాగుతోంది.

2020లో బీహార్, ఢిల్లీ ఎన్నికలు

వచ్చే ఏడాది ఢిల్లీ, బీహార్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వాన గల ‘ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)’తో అమీతుమీ తేల్చుకోవడానికి బీజేపీ సిద్దపడుతోంది. అలాగే బీహార్​లో ‘రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)’, కాంగ్రెస్ నాయకత్వాన గల అలయెన్స్​ని  జేడీ (యూ)  బీజేపీ కూటమి ఎదుర్కోబోతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల నెంబర్లలో  తేడాలు రావచ్చు అంటున్నారు ఎనలిస్టులు.

తమిళనాడులో విచిత్ర పరిస్థితి

సౌత్​లోని తమిళనాడులో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం తమిళనాడులో అధికారంలో ఉంది. అయితే పళనిస్వామి నాయకత్వాన ఉన్న ఈ  ప్రభుత్వంలో బీజేపీ చేరకపోవడం ఒక విశేషం.

తగ్గుతున్న  ప్రాంతీయ పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య

చాలా ఏళ్ల కిందటి వరకు ప్రాంతీయ పార్టీల ఎమ్మెల్యేల సంఖ్యే ఎక్కువగా ఉండేది. మెయిన్​స్ట్రీమ్​ పాలిటిక్స్​లో బీజేపీ కరిష్మా పెరుగుతుండడంతో అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ఎమ్మెల్యేలు తగ్గుతున్నారు. మొత్తంగా 11 రాష్ట్రాల్లో పూర్తిగా, అయిదు రాష్ట్రాల్లో అలయెన్స్​లోనూ బీజేపీ సర్కార్లు ఉండడంతో ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రాంతీయ పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు.

బీజేపీ అధికారంలో ఉన్నవి : 11

ప్రస్తుతం మొత్తం 11 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది.  1) హిమాచల్ ప్రదేశ్ 2) ఉత్తరాఖండ్ 3) ఉత్తరప్రదేశ్​ 4) హర్యానా 5) గుజరాత్ 6) కర్ణాటక 7)  గోవా 8) అరుణాచల్ ప్రదేశ్  9) అస్సాం 10) త్రిపుర 11)  మణిపూర్.

బీజేపీ అలయన్స్ ప్రభుత్వాలు : 5

మొత్తం ఐదు రాష్ట్రాల్లోని సంకీర్ణ ప్రభుత్వాల్లో బీజేపీ భాగస్వామ్య పక్షంగా ​ఉంది.

1) బీహార్ : ఇక్కడ జేడీ (యూ) సర్కార్ ఉంది. నితీశ్​ కుమార్ నాయకత్వాన ఉన్న ఈ కొయిలేషన్ సర్కార్​లో బీజేపీ భాగస్వామిగా ఉంది.

2)  నాగాలాండ్ : నియోఫియు రియో నాయకత్వాన ఉన్న నాగాలాండ్ ప్రభుత్వంలో బీజేపీ అలయన్స్ పార్ట్​నర్​గా ఉంది. ముఖ్యమంత్రి రియో ప్రాంతీయ పార్టీ ‘నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్  పార్టీ (ఎన్డీపీపీ) నాయకుడు.

3) మిజోరం : మిజోరంలో ప్రస్తుతం ‘మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్​ఎఫ్​)’ ప్రభుత్వం ఉంది. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ అలయన్స్ పార్ట్​నర్​గా ఉంది.

4) సిక్కిం : సిక్కింలో ప్రాంతీయ పార్టీ ‘సిక్కిం క్రాంతికార్ మోర్చా (ఎస్కేఎం)’ అధికారంలో కొనసాగుతోంది. ప్రేమ్ సింగ్ తమాంగ్ నాయకత్వాన గల మినిస్ట్రీలో బీజేపీ భాగస్వామ్యపక్షంగా ఉంది.

5) మేఘాలయ : ‘నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)’ నాయకత్వాన మేఘాలయలో  కొయిలేషన్ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వంలో బీజేపీ కూడా పార్ట్​నర్ గా కొనసాగుతోంది.

బీజేపీకి 1,319 మంది ఎమ్మెల్యేలు

దేశవ్యాప్తంగా లెక్కలు తీస్తే బీజేపీకి 1,319 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2014 లో నరేంద్ర మోడీ తొలిసారి ప్రధాని అయ్యాక బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య వెయ్యి దాటింది. అప్పటికే కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు లెక్కలు తేల్చి చెప్పాయి.  ముఖ్యంగా 2017 నుంచి చూస్తే  బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య బాగా పెరిగింది.

కాంగ్రెస్​ అధికారంలో ఉన్నవి: 5

కాంగ్రెస్​ 5 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది.

1) పంజాబ్, 2) రాజస్థాన్, 3) మధ్యప్రదేశ్​,

4) చత్తీస్​గఢ్​, 5) పుదుచ్చేరి.

అలయన్స్ ప్రభుత్వాలు: 2

1) మహారాష్ట్ర, 2) జార్ఖండ్​.

ఉద్ధవ్​ థాక్రే సీఎంగా ఏర్పడ్డ మహారాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామ్య పక్షంగా ఉంది. అలాగే లేటెస్ట్​గా ఎన్నికలు జరిగిన జార్ఖండ్​లో ఆదివారం (ఇవ్వాళ) జేఎంఎం నాయకుడు హేమంత్​ సోరేన్​ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా చేరబోతోంది.

దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు

పార్టీ                        2019లో      2014లో

బీజేపీ                       1,319       1,056

కాంగ్రెస్                      856          937

ఇతర పార్టీల ఎమ్మెల్యేలు 1,875     2,146