మూడేళ్లుగా కొనసాగుతున్న మెట్​పల్లి పట్టణాభివృద్ధి పనులు

మెట్ పల్లి, వెలుగు : పట్టణంలో అభివృద్ధి పనుల కోసం స్థానిక బల్దియా టీయూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐడీసీ ద్వారా 2018,19లో ఫస్ట్ ఫేజ్​లో రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో పట్టణ సుందరీకరణ కోసం 15 పనులు ప్రతిపాదించి టెండర్లు పూర్తి చేశారు. అయితే కాంట్రాక్టర్లు పట్టించుకోకపోవడంతో మూడేళ్ల నుంచి పనులు ముందుకు సాగడం లేదు. 15 పనుల్లో ఇప్పటి వరకు మూడు పనులు మాత్రమే పూర్తయ్యాయి.  అలాగే పట్టణంలోని నేషనల్ హైవే కు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణ పనుల్లో నాణ్యత ఉండడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే 2019, 2020లో సెకండ్ ఫేజ్​లో మరో రూ.25 కోట్లు మంజూరు కాగా 11 పనులకు నిధులు కేటాయించారు. వీటిలో ఇప్పటి వరకు కేవలం మూడు పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా 9 పనులు ఇంకా ప్రారంభానికి కూడా నోచుకోలేదు. నేషనల్ హైవే 63కి ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండడంతో ఇటీవల డ్రైనేజీ గుంతలో పడి యువకుడు మృతి చెందాడు. 

బీటీ రోడ్డు కోసం 2019లో భూమిపూజ..

మెట్ పల్లి పోలీస్ స్టేషన్ పక్క నుంచి ఎస్సారెస్పీ కెనాల్ గట్టు, వెల్లుల్ల వరకు బీటీ రోడ్డుగా మార్చేందుకు టీయూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐడీసీ నిధులు రూ.కోటీ 50 లక్షలు మంజూరు అయ్యాయి. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు 2019 నవంబర్ 1న భూమిపూజ చేశారు. ఇప్పటికి మూడేండ్లు దాటుతున్నా కాంట్రాక్టర్ రోడ్డు పనులు ప్రారంభించలేదు. అలాగే మెట్ పల్లి నేషనల్ హైవే 63ని విస్తరించి రెండు ప్రధాన చౌరస్తాలో జంక్షన్ల ఏర్పాటుకు 15 ఫైనాన్స్ నిధుల నుంచి రూ.కోటీ 11 లక్షలు కేటాయించి టెండర్లు పూర్తి చేశారు. పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా,  ఆర్టీసీ డిపో వద్ద జంక్షన్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో వాహనదారులు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.

పనులు త్వరగా పూర్తి చేస్తాం

పట్టణాభివృద్ధి, సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తాం. టెండర్లు దక్కించుకుని పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతాం. ఇటీవల జంక్షన్ల నిర్మాణ పనులు ప్రారంభించాం. మిగతా పనులు త్వరలోనే ప్రారంభిస్తాం. - ఎన్.రాజ్ కుమార్, ఇన్​చార్జి కమిషనర్, మెట్ పల్లి బల్దియా