ఊళ్లో రాతి బిల్డింగ్లు, పురాతన ఆర్కిటెక్చర్, నడిచేందుకు సరిపోయే చిన్న దారులు, పక్కనే పారుతున్న నది, ఎంజాయ్ చేయడానికి బోలెడన్ని ఫెస్టివల్స్, ఈవెంట్స్... ఇంతకంటే ఇంకేం కావాలి? అక్కడి ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి.. అదే బెల్జియంలో ఉన్న డర్బై విలేజ్. ఆ ఊరికి ప్రపంచంలోనే చిన్న విలేజ్‌గా పేరున్న... ఈ ఊళ్లో ఎంజాయ్‌మెంట్‌కు మాత్రం తక్కువ లేదు.
బెల్జియంలో ఉన్న చిన్న గ్రామం డర్బై. దీన్ని ‘అడ్వెంచర్ వ్యాలీ’ అని కూడా పిలుస్తారు. బెల్జియంలోనే అతిపెద్ద పార్క్ ఉందిక్కడ. ఈ ఊరికి బెల్జియంలోనే కాదు.. ప్రపంచంలోనే చాలా చిన్నదిగా పేరు. ఇది 2006 వరకు బెల్జియంలోని అఫీషియల్ స్మాలెస్ట్ విలేజ్‌గా ఉండేది. అప్పుడు కొన్ని కారణాల వల్ల దీన్ని ‘వరల్డ్స్ స్మాలెస్ట్ సిటీ’గా పిలిచేవాళ్లు. కానీ, 2018, జనవరి1నాటికి డర్బైలో పదకొండు వేలమందికి పైగా జనాభా ఉండేవాళ్లు.
చారిత్రక నిర్మాణాలు, రాతి కట్టడాలు ఎన్నో ఉంటాయి. ఇక్కడ ప్రజలు దొరికే వస్తువులు క్వాంటిటీ కంటే క్వాలిటీనే చూస్తారు. కెఫేలు, షాప్‌లు చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. బట్టలు, బుక్స్, స్టోర్స్ ఇలా అన్ని షాపులు డెకరేషన్తో కళకళలాడుతుంటాయి. చిన్నచిన్న సందులు, రాతి బిల్డింగ్లు, క్యాజిల్స్ ఒక వైపు, మెల్లగా పారే నది, చుట్టుపక్కల ప్రకృతి అందాలు... అవన్నీ చూస్తుంటే మనసుకు ఉల్లాసంగా అనిపిస్తుంది కూడా. అంతేనా... ఎనిమిదో శతాబ్దానికి వెళ్లొచ్చినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే వీటిలో కొన్ని ఎనిమిదో శతాబ్దం నాటివే. ఆ తర్వాత పదకొండో శతాబ్దంలో ఎక్కువ నిర్మాణాలు జరిగాయి. వాటిని మళ్లీ17వ శతాబ్దంలో రీమోడల్ చేశారు.
బోలెడంత
కయక్, కెనోయ్, రాఫ్ట్స్ నడపడం ఎలాగో నేర్చుకోవచ్చు. అందుకోసమే కొన్ని కంపెనీలు పాఠాలు కూడా చెప్తాయి. ఆర్తే నది బిగినర్స్ నేర్చుకోవడానికి చాలా అనువైంది. అవుట్ డోర్ యాక్టివిటీలు అరవై ఉంటాయి. నీరు, నేల, గాల్లో ఎక్కడైనా ఆ యాక్టివిటీస్ చేయొచ్చు. కెనోయింగ్, క్వాడ్ బైకింగ్, అబ్సెయిలింగ్, రాక్ క్లైంబింగ్, జిప్ లైనింగ్, పాట్ హోలింగ్, హెలికాప్టర్ రైడ్స్ ఇవన్నీ చేయొచ్చు. ఇవేకాకుండా ఆర్చరీ, రైఫిల్ రేంజెస్, పెయింట్ బాల్ కంబాట్ వంటివి ఉన్నాయి. ఇంకాస్త ఎక్కువ ఎంజాయ్ చేయాలనుకుంటే హార్స్ రైడింగ్, ట్రెక్కింగ్ నేర్చుకోవచ్చు. గుర్రం మీద తిరుగుతూ లోకల్ సైట్స్ చూడొచ్చు. ఊళ్లో ఒక క్లబ్ ఉంది. అందులో డాన్స్‌లు చేస్తుంటారు. ఇలాంటి రకరకాల ఎక్స్‌పీరియెన్స్‌లు కావాలంటే తప్పకుండా డర్బై వెళ్లాల్సిందే. ఇక్కడొక మ్యూజియం కూడా ఉంది. అందులో అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్ పెడతారు.
సంబురాలు
వీకెండ్స్‌లో ఈవెంట్స్ బాగా జరుగుతాయి.
క్రిస్మస్ మార్కెట్స్, సెయింట్ మార్టిన్ ఫెయిర్, బీర్ , చీజ్ ఫెస్టివల్, కార్నివాల్స్ ఇలా చాలా సంబురాలు జరుగుతుంటాయక్కడ. డర్బైస్సిమొ, ది డర్బై కంట్రీ ఫెస్టివల్, డర్బై రాక్ ఫెస్టివల్, లె సింపోసియమ్ డి స్కల్ప్చర్ వంటి వెరైటీ ఫెస్టివల్స్‌తో పాటు కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేసే యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఈ ఊళ్లో ఆర్టిస్ట్‌లకు లెక్కేలేదు. వాళ్లంతా ‘వాల్లొనీ వీక్ ఎండ్స్ బెయిన్వెన్యూ’ వంటి ఎగ్జిబిషన్స్, ఈవెంట్స్ పెట్టినప్పుడు కనపడతారు. ఈ ఊరు ఆర్కిటెక్చరల్ హెరిటేజ్‌గా పేరుగాంచింది. ఇక్కడ ఉండేందుకు టెంట్, కారవ్యాన్ పార్క్‌లు ఉన్నాయి. అవి కూడా రీజనబుల్ రేట్లకే దొరుకుతాయి. టాప్ రేటింగ్ ఉన్న హోటల్స్ కూడా ఉంటాయి.
రోడ్డు మార్గం
డర్బై లక్సెన్బర్గ్కి కుడివైపున పైన ఉంది. కొండోజ్ కొండలు ఉత్తరం వైపు, దక్షిణాన ఆర్డెన్నెస్ శ్రేణులు ఉంటాయి. ఈ రెండింటికి సరిగ్గా మధ్యలో ఉంది డర్బై. దాన్ని ‘ఫామెన్నె’ అని కూడా పిలుస్తారు. ఆర్తే నది దగ్గర, ఆ దారుల్లో రోమన్లు తిరుగుతుండేవాళ్లు. అయితే వాళ్లు ఒక చోట కూర్చుని మాట్లాడుకోవడానికి వీలుండేది కాదు. దాంతో ఈ ఊరిని కమ్యూనికేషన్స్ హబ్‌గా చేశారు. ఈ రోజుల్లో మాత్రం ఆ దారుల్లో వెళ్లడం కష్టమే.
రోడ్డు మార్గంలో ఈ ఊరికి వెళ్లాలి అనుకుంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బ్రస్సెల్స్ నుంచి ముప్పై మైళ్లు జర్నీ చేయాలి. ఈ రూట్లో వెళ్తే ఫామెన్నే, ఆ చుట్టుపక్కల ప్రాంతాల అందాలు ఎంజాయ్ చేయొచ్చు. మరొక దారి తూర్పు బెల్జియం నుంచి వెళ్లొచ్చు. మధ్యలో జంక్షన్ వస్తుంది. అక్కడ స్టే చేయొచ్చు కూడా. దీనికి రెండు దారులున్నాయి. ఎటునుంచి వెళ్లినా ఒకే డిస్టెన్స్ ఉంటుంది. పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఈ దారుల్లో కూడా కండోజ్, ఫామెన్నె సీనరీలు చూస్తూ వెళ్లొచ్చు.
మరో దారి
బవాక్స్ నుంచి డర్బైకి ప్రతి రైలూ వెళ్తుంది. అవి ప్రతి అరగంటకు ఒకసారి బ్రసెల్స్ నుంచి బవాక్స్కి వెళ్లే డైరెక్ట్ రైళ్లు. బవాక్స్ నుంచి డర్బైకి ఒక మైలు దూరమే. చాలామంది ట్యాక్సీలో లేదా నడిచి వెళ్తుంటారు. అయితే ఆ ఊరికి చేరుకోవడానికి మాత్రమే ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీ ఉంది. ఊళ్లో మాత్రం అలాంటి సౌకర్యాలు ఉండవు. లోకల్‌గా ఉన్న ప్రదేశాలు చూపించడానికి ఒక నెట్వర్క్ ఉంటుంది. అది కూడా ఎప్పుడూ ఉంటుందనే గ్యారెంటీ లేదు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఎప్పుడైనా వెళ్లొచ్చు ఇక్కడికి. హైదరాబాద్ నుంచి బ్రసెల్స్కి ఏడువేల మూడువందలకు పైగా కిలోమీటర్లు జర్నీ చేయాలి. హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లొచ్చు. అందుకు దాదాపు 35 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది.
చరిత్ర పుటల్లో...
పదకొండో శతాబ్దంలో డర్బైని ఫ్యూడల్ క్యాజిల్ టౌన్ అనేవాళ్లు. ఎందుకంటే ఇక్కడ పాలియోథిలిక్ నాటి ప్రజలు ఉండేవాళ్లు. వాళ్లంతా గుహల్లో నివసిస్తూ, వేట జీవనంగా ఉండేవాళ్లు గుహల్లో దొరికిన వస్తువులే అక్కడ వాళ్లు ఉన్నారనటానికి రుజువులు. ఆ గుహలు పదివేల ఏండ్ల నాటివి. వెయ్యేండ్ల క్రితం అక్కడి ప్రజలు రాతి శిల్పాలు, కట్టడాలు చెక్కేవారట. పదహారవ శతాబ్దంలో ఆ ప్రదేశంలో అధికంగా ఇనుము ఉందని గుర్తించారు. దాంతో అక్కడ గనులు ఏర్పడ్డాయి. ఆర్తే వ్యాలీ.. ఇనుము, ఫర్నెస్కి అనువుగా మారింది.1575లో 34 ఫర్నెస్‌లు ఉండేవి. వాటిలో డర్బై చుట్టుపక్కల ఉన్న రెండు వేల మంది ప్రజలు పని చేశారు. అంతేకాకుండా ఆర్తే నది ఉండటం వల్ల ఇనుము ధాతువుల్ని, ఓడల్లో కొలిమికి తీసుకొచ్చే సౌకర్యం ఉండేది. పూర్తి చేసిన ఉక్కును లేగె తిరిగి పంపడానికి, చాలా రివర్ పోర్ట్స్ ఏర్పాటు చేశారు. చదరంగా ఉండే బోట్లలో తీసుకెళ్లేవాళ్లు. బోట్ నడిపే వ్యక్తే వాటిని ఇచ్చి వెళ్లేవాడు. ఆ విధంగా అక్కడ పని జరుగుతుండేది.
అయితే, 20వ శతాబ్దానికల్లా ఇనుమంతా అయిపోయింది. దాంతో డర్బై క్రమంగా కనుమరుగైపోయింది. లక్సెంబర్గ్‌లో చుట్టుపక్కల పాలకులతంతా ‘పాస్ ద పార్సెల్’ అనే రీతిలో ఆట ఆడినట్టు సరుకును తీసుకెళ్లారు. డర్బై చుట్టుపక్కల ఉన్న లోయలు, దట్టమైన కొండల్ని పాలించడానికి స్పెయిన్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ ముందుకొచ్చాయి. 1839లో కొత్తగా ఏర్పడిన దేశం బెల్జియం. తూర్పు లక్సెన్బర్గ్ నుంచి డర్బైతో కలిపి, సింహభాగాన్ని స్వాధీనం చేసుకుంది బెల్జియం.
డర్బై స్పెషల్స్
లా డర్బొసె అనే బీర్ చాలా పాపులర్. ఇది ట్రెడిషనల్ బీర్. వాల్లొనియాలోని సదరన్ ప్రాంతంలో వాళ్లకి చాలా ఇష్టమిది.
డర్బై వెళ్తే, అక్కడ కచ్చితంగా చాకొలెట్ తినాల్సిందే. ఇది కూడా ఇక్కడి స్పెషల్ చాకొలెట్. చాకొలెట్ లవర్స్ చాకొలెట్ టూర్స్ కూడా వేస్తారు ఇక్కడ.
డర్బైలో ఉన్న టోపియరీ పార్క్ ప్రపంచంలోనే అతిపెద్దది.
ఈ ఊరి శివార్లలో ‘రాధే దేశ్’ అనే ఫేమస్ హిందూ టెంపుల్ కూడా ఉంది. రాధే దేశ్ అంటే కృష్ణుడి దేశమని అర్థం. ఇక్కడ మూడు సెక్షన్స్ ఉంటాయి. గోవిందా రెస్టారెంట్, గిఫ్ట్ షాప్, బేకరీ. ప్లే గ్రౌండ్ కూడా ఉంది.