ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు ఒకరు బలి!
పెండింగ్ చలాన్లు ఉన్నాయని బండి సీజ్ చేసి దుర్భాషలు
మనస్తాపంతో పురుగుమందు తాగిన బాధితుడు.. ఆసుపత్రిలో మృతి
హనుమకొండలో విషాదం
హనుమకొండ, వెలుగు : చలాన్లు పెండింగ్ ఉన్నాయని బండి సీజ్‌చేసి, వాటిని క్లియర్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు తిట్టడంతో అవమాన భారంతో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన పాలకుర్తి మొగిలి(52) వరంగల్ నగరంలోని ఓ బట్టల షాపులో పని చేస్తున్నాడు. రోజూ బండి(టీఎస్ 03 ఈటీ 6572) పై వెళ్లివచ్చేవాడు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన పేరుతో పోలీసులు ఆయన బండికి 17 ఫైన్లు విధించారు. ఈ నెల 21న మొగిలి పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. వరంగల్ చౌరస్తాలో ట్రాఫిక్ ఎస్సై రామారావు, సిబ్బంది బండి ఆపారు.
బండిపై చాలా ఫైన్లు ఉన్నాయని, అవి కట్టకపోతే వదిలిపెట్టేదిలేదని కీ తీసుకొని బండిని పక్కనపెట్టారు. అక్కడున్న సిబ్బంది మొగిలిని ఇష్టమొచ్చినట్లు తిట్టారని కుటుంబ సభ్యులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన విషయాన్ని చెప్పుకొని బాధపడ్డాడని చెప్పారు. మనోవేదనకు గురయ్యాడన్నారు. తర్వాత పనికి వెళ్లకుండా ఇంటిదగ్గరే ఉన్న ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందుతాగాడు. స్థానికులు గమనించి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున చనిపోయాడు.