సూర్యాపేట, వెలుగు: సూర్యాపేటలో లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. దీంతో ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంగా మారడంతో పాటు, విద్య, వైద్యం, వాణిజ్యపరంగా అభివృ-ద్ధి చెందుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వస్తుంటారు. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ ఎప్పుడూ రద్దీగానే కనిపిస్తాయి. దీంతో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు 2016లో రూ.15 లక్షలు ఖర్చు చేసి కొత్త బస్టాండ్, కోర్ట్ చౌరస్తా, శంకర్ విలాస్ సెంటర్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో ఏర్పాటు చేసిన కొన్ని రోజులకే పనిచేయడం మానేశాయి.
శాఖల మధ్య కనిపించని సమన్వయం
సూర్యాపేటలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ మెయింటెనెన్స్‌ను మున్సిపాలిటీ చూసుకోవాల్సి ఉంటుంది. కానీ వారు పట్టించుకోకపోవడంతో ఏర్పాటు చేసిన కొన్ని రోజులకే సిగ్నల్స్ పనిచేయడం మానేశాయి. ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ ఆఫీసర్ల మధ్య కో ఆర్డినేషన్ లేకపోవడంతో సిగ్నల్స్ రిపేర్లకు నోచుకోవడం లేదు. దీంతో లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా అయిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లు ఇప్పటికైనా స్పందించి ట్రాఫిక్ సిగ్నల్స్‌కు రిపేర్లు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.