బర్త్ డే వేడుకల కోసం వెళ్లి...

కర్ణాటక కలబురిగి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో  8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని గంటల్లో హైదరాబాద్ చేరుతారనగా జరిగిన ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో చనిపోయారు. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు కలబురిగి కమలాపూర్ దగ్గరికి రాగానే ఎదురుగా వస్తున్న  టెంపోను ఢీకొంది. దీంతో  ఒక్కసారిగా బస్సు  అదుపు తప్పి  కల్వర్ట్ కింద  పడిపోయింది. అదే టైంలో డీజిల్ ట్యాంక్ దెబ్బతినడంతో మంటలు అంటుకున్నాయి. ఫలితంగా ప్రమాద తీవ్రత పెరిగింది. ఉదయం 6 గంటల సమయంలో ఈ యాక్సిడెంట్  జరిగింది. 

ప్రయాణికులంతా నిద్రలో ఉండగా బస్సు బోల్తాపడటం, మంటలు అంటుకోవడం అన్నీ ఒకేసారి జరిగాయి. దీంతో ప్రయాణికులు తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. కొందరు విండోల నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇంకొందరు బయటకు రాలేక కాలి బూడిదైపోయారు. అప్పటి వరకు ఆనందంగా గడిచిన టూర్ కాస్తా తీవ్ర విషాదాన్ని నింపింది. 

సుచిత్రకు చెందిన అర్జున్ కుమార్ కుటుంబం, ఫ్యామిలీ ఫ్రెండ్స్ మొత్తం 26 మందికి గోవా టిక్కెట్లు బుక్ చేశారు. వీరంతా మే 29న సాయంత్రం బయల్దేరి వెళ్లారు. ఈ ట్రిప్ మొత్తం ప్లాన్ చేసిన అర్జున్ కుమార్ అనే వ్యక్తి ప్రమాదంలో చనిపోయారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రమాదంలో 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆరెంజ్ ట్రావెల్స్ ప్రతినిధులు చెబుతున్నారు. అల్వాల్, కూకట్ పల్లి, మణికొండ, షేక్ పేట్ నుంచి గోవా వెళ్లిన వారిలో ఉన్నారు. 

బర్త్ డే వేడుకల  కోసం  వెళ్లి సజీవదహనం 

సుచిత్రకు చెందిన అర్జున్ కుమార్.. వారి బాబు బర్త్ డే వేడుకల కోసం గోవా ట్రిప్ ప్లాన్ చేశాడు. ఫ్రెండ్స్, బంధువులను గోవా తీసుకెళ్లాడు. మే 29న సాయంత్రం గోవా వెళ్లారు. రిటర్న్ జర్నీలో ఇవాళ ఉదయం కలబురిగి దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో అర్జున్ కుమార్ తో పాటు ఆయన భార్య సరళాదేవి, బర్త్ డే బాయ్ వివాన్ సజీవదహనమయ్యారు. వారి పాప ప్రాణాలతో బయటపడింది. కొడుకు బర్త్ డేను బంధువులు, ఫ్రెండ్స్ మధ్య గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. కొన్ని గంటల్లో హైదరాబాద్ చేరుకుంటామనే లోపే.. ఈ యాక్సిడెంట్ జరిగింది. భార్య, భర్త, బాబు సజీవదహనం అవడం, వీరితో పాటు మరికొంత మంది చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.