- మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కృష్ణ రిజర్వాయర్ నీటిని రాయలసీమకు తరలించడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు. గురువారం తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. కాగ్ నివేదికలో అవినీతి జరిగినట్లు తేలిందని, దీనికి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ నుంచి సంగమేశ్వర ప్రాజెక్ట్ లిఫ్ట్ కు మట్టి, స్టీల్ తరలిస్తున్నా సీఎం, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. నిండుకుండలా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టును 12 రోజుల్లో ఖాళీ చేస్తారని, రోజుకు 15 టీఎంసీల చొప్పున నీటిని తరలించుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో ఇంకా రెండు పంపులు పని చేయడం లేదన్నారు.
కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తున్నారని, తెలంగాణ మీద కేసీఆర్ కు కక్ష ఉందని విమర్శించారు. పార్టీ బలోపేతానికి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎమ్మెల్సీ కుటుంబం పార్టీలో చేరితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలకు ఫోన్లు చేస్తూ తన వెంట పార్టీలోకి రావాలని టికెట్ తనకే వస్తుందని చెప్పడం సరైంది కాదన్నారు.
ఏపీ ప్రభుత్వం రాయలసీమ, సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతుందని, దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. మంత్రి హరీశ్‌రావు అవగాహన లోపంతో వ్యాఖ్యలు చేస్తున్నారని, ఉస్మానియా ఆసుపత్రి వైద్య విద్యార్థులకు బోధన చేసేందుకు మాత్రమే ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నాగం శశిధర్ రెడ్డి, అర్థం రవి, కోటయ్య, టి.పాండు, మల్లయ్య గౌడ్, లక్ష్మయ్య, వాలియా నాయక్ పాల్గొన్నారు.