భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పోడు భూముల పట్టాల కోసం గిరిజనులకు ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదు. పోడు పట్టాలిస్తానని చెప్పి సర్వే పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. 44 వేల మందికి 1.37లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ నిర్ణయించింది. గిరిజనేతరులకు సంబంధించిన నిబంధనల వల్ల ఒక్కరికి కూడా పట్టా వచ్చే పరిస్థితి లేదు. సబ్ డివిజన్ లెవెల్మీటింగ్లు పూర్తి చేసిన ఆఫీసర్లు జిల్లా స్థాయి మీటింగ్‌పై దృష్టి పెట్టారు.
2.99 లక్షల ఎకరాలకు దరఖాస్తులు..
భద్రాద్రికొత్తగూడెం 2,99,269.05 ఎకరాలకు సంబంధించి 83,341 క్లెయిమ్స్ వచ్చాయి. ఇందులో 2,41,107.08 ఎకరాలకు 65,616 మంది గిరిజనులు దరఖాస్తు చేసుకున్నారు. 58,161.775 ఎకరాలకు సంబంధించి 17,725 మంది గిరిజనేతరుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఇల్లందు మండలంలో 29,902.73 ఎకరాలకు సంబంధించి 7,951 మంది, అత్యల్పంగా చుంచుపల్లి మండలంలో 1,922.48 ఎకరాలకు సంబంధించి 386 క్లెయిమ్స్ వచ్చాయి. గ్రామ, మండల, సబ్ డివిజన్ స్థాయిలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కంప్లీట్ చేశారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జరగనున్న జిల్లా స్థాయి మీటింగ్‌లో పోడు సాగుదారుల్లో అర్హుల జాబితా తయారీ చేసే పనిలో ఆఫీసర్లు నిమగ్నమయ్యారు. మొదటి విడతలో 44 వేల మందికి 1.37 లక్షల ఎకరాల పోడు భూమికి సంబంధించి పట్టాలను పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో పోడు సాగు చేసుకొని ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న గిరిజనులను ప్రభుత్వం పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. తాము గతంలో పోడు సాగు చేసుకున్నామని, ఇప్పుడు ఉద్యోగం ఉందనే కారణంతో పట్టాలు ఇవ్వకపోవడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొదటి విడతలో సగం భూములకే పట్టాలు రానుండగా, రెండో విడత పంపిణీపై ప్రభుత్వం నుంచి సరైన స్పష్టత లేకపోవడంతో పోడు సాగుదారుల్లో ఆందోళన మొదలైంది. గిరిజనేతరుల విషయంలో ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో ఒక్కరికీ పట్టా వచ్చే అవకాశం లేదని అంటున్నారు. మరోవైపు రెవెన్యూ, అటవీశాఖల భూములపై స్పష్టత లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. శాటిలైట్ సిస్టం కారణంగానే అర్హులైన వేలాది మందికి పోడు పట్టాలు రావడం లేదని ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు. 30 వేల నుంచి 40 వేల ఎకరాలకు సంబంధించి క్లెయిమ్స్ రిజెక్ట్ అయినట్లు తెలుస్తోంది. క్లెయిమ్స్ ఎందుకు రిజెక్ట్ చేశారో అధికారులు చెప్పాలని రైతు, గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.