నల్లగొండ: మునుగోడు బై పోల్ టైమ్ లో మరోసారి పోడు భూముల లొల్లి తెర మీదకు వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పోడు సమస్య తీర్చాలని ఆందోళనలు చేస్తున్నారు గిరిజనులు. ఇప్పటికే వానాకాలం సీజన్లో మొక్కలు నాటేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో సాగర్ ఉప ఎన్నికల టైంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన పోడు భూముల పట్టా హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మునుగోడు ఉప ఎన్నికల్లో ఇంటికొకరు చొప్పున నామినేషన్లు వేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పోడు భూముల రైతుల ఆందోళన మొదలైంది. మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం మండల పరిధిలో పోడు రైతులు సాగు చేసుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ భూములను నమ్ముకొని బతుకుతున్న తమకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వేళ పోడు సాగుదారులకు పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఐతే ఆ హామీ ఇప్పటికీ నెరవేర లేదు. తాజాగా మునుగోడు బై పోల్ వస్తుండడంతో మళ్లీ పోడు భూముల వ్యవహరం తెరపైకి వచ్చింది. కేసీఆర్ హామీని నెరవేర్చకపోతే మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని గిరిజన రైతులు హెచ్చరిస్తున్నారు.
అటవీ అధికారులు, గిరిజనుల మధ్య గొడవ
వానాకాలం సీజన్ కావడంతో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అటవీ అధికారులకు, గిరిజనులకు మధ్య గొడవ జరిగింది. అటవీ శాఖ అధికారులు నాటిన మొక్కలను తిరుమలగిరి సాగర్ లో ఆదివాసీ రైతులు ధ్వంసం చేశారు. ఎర్రచెరువు తండాలోని నెల్లికల్ ఆర్ఎఫ్ కంపార్ట్ మెంట్ నెంబర్ 72 లో ఉన్న 35 ఎకరాల్లో 20 వేల మొక్కలు నాటేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నించడంతో గిరిజనులు అడ్డుకున్నారు. నాటిన మొక్కలను పీకేశారు. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూముల్లో మొక్కలు నాటితే ఊరుకునేది లేదని ఆందోళనకు దిగారు. వెంటనే పోడు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అటు యల్లాపురం తండాలోనూ గిరిజనులు, అటవీ అధికారుల మధ్య గొడవ జరిగింది. అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వచ్చిన అధికారులను గిరిజన రైతులు అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములను అడవుల పేరుతో లాక్కోవద్దంటున్నారు. పోడు రైతులకు గిరిజన సంఘాలు మద్దతు తెలిపాయి. ప్రభుత్వం గిరిజనులతో ఆడుకోవద్దని హెచ్చరించాయి. వెంటనే పోడు భూములకు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎమ్మెల్యే భగత్ పట్టించుకోవటం లేదు
ఎమ్మెల్యే నోముల భగత్ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని మరోవైపు పోడు భూముల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని గతంలోనే హామీ ఇచ్చారు సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ . నియోజకవర్గంలోని త్రిపురారం, తిరుమలగిరి సాగర్ , పెద్దవూర మండలాల్లో పోడు భూముల సమస్యపై రెవెన్యూ, పోలీస్ , అటవీ శాఖ అధికారులతో అనుముల మండల పరిషత్ ఆఫీస్ లో రివ్యూ చేశారు. పట్టాలు కలిగి డీఫారెస్ట్ భూములను సేద్యం చేసుకుంటున్న గిరిజన రైతులను ఇబ్బంది పెట్టొద్దని అటవీ శాఖ అధికారులకు సూచించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,18,533 ఎకరాల్లో అటవీ భూములు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 లక్షల 18 వేల 533 ఎకరాల్లో అటవీ భూములున్నాయి. 17 వేల 388 ఎకరాల్లో 5 వేల 475 గిరిజన కుటుంబాలు పోడు వ్యవసాయం చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. నల్లగొండ జిల్లాలోని 13 మండలాల్లో 13 వేల 771 ఎకరాల్లో గిరిజనులు పోడు సాగు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది. ఐతే అధికారుల లెక్కల కంటే మూడు రెట్లు అధికంగా అప్లికేషన్లు వచ్చాయి. సూర్యాపేట జిల్లాలో 575 మంది గిరిజనులు 15 వందల 45 ఎకరాలపై హక్కులు కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. అటు యాదాద్రి భువనగిరి జిల్లాలో 400 మంది గిరిజన రైతులు 2 వేల 71 ఎకరాలపై హక్కులు ఇప్పించాలంటున్నారు.
సీఎం ఇచ్చిన హామీ మేరకు 2021 నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు గ్రామ సభలు ఏర్పాటు చేసి అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆ విషయాన్ని లైట్ తీసుకుంది. ఈ లోగా వర్షాలు పడటంతో మళ్లీ గిరిజనులు, అటవీ అధికారుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రభుత్వం వెంటనే సమస్యకు పరిష్కారం చూపకపోతే మునుగోడు బై పోల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తామని గిరిజనులు హెచ్చరిస్తున్నారు.