- ముష్టిగింజల కొనుగోళ్లు..ముంచుతున్న దళారులు
- తక్కవ ధరకే విక్రయాలు..మోసపోతున్న గిరిజనులు
- జీసీసీకి రూ.కోట్లలో గండి.. నిఘావేసి పట్టుకున్న పోలీసులు
భద్రాద్రికొత్తగూడెం/గుండాల, వెలుగు : గిరిజనులను దళారులు నిలువునా ముంచుతున్నారు. అడవుల్లో క్రూర మృగాలుంటాయన్న విషయం తెలిసీ జాగ్రత్తలు తీసుకుంటూ, ఎండలు, వానల్లో తిరుగుతూ వారు సేకరించే అటవీ ఉత్పత్తులు దళారుల పాలవుతున్నాయి. కొందరు దళారులు మాయమాటలు చెప్పి అగ్గువకే ముష్టిగింజలను కొంటూ గిరిజనులను మోసం చేస్తున్నారు. గుండాల మండలంలో ముష్టి గింజలను గిరిజనులు అడవుల నుంచి సేకరిస్తుంటారు. వాటిని జీసీసీ(గిరిజన సహకార సంస్థ) సేల్స్ డిపోల్లో అమ్ముతుంటారు. అయితే తక్కువ ధరకే కొంటున్న దళారులను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. వారి కారణంగానే జీసీసీ ఆదాయానికి రూ.కోట్లలో గండి పడుతోంది.
మూడు వేల క్వింటాళ్ల టార్గెట్..
గుండాల మండలంలోని దామరతోగు, చిన్న వెంకటాపురం, సాయన్నపల్లి గ్రామాలతో పాటు పలు అటవీ ప్రాంతాల్లోని గిరిజనులు ముష్టిగింజనులను సేకరిస్తుంటారు. ఈ మండలంలోనే అవి ఎక్కువగా దొరుకుతాయి. కిలో ముష్టిగింజలను రూ.45 చొప్పున జీసీసీ గిరిజనుల నుంచి కొనుగోలు చేస్తోంది. దాదాపు 3వేల క్వింటాళ్ల ముష్టిగింజలను కొనుగోలు చేయాలని జీసీసీ ఈ ఏడాది టార్గెట్గా పెట్టుకుంది. ఒక్కోసారి 5వేల క్వింటాళ్ల వరకు కొనుగోళ్లు చేస్తుంటారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది తాము అనుకున్న ప్రకారం కొనుగోళ్లు జరగకపోవడంతో జీసీసీ అధికారులకు అనుమానం వచ్చింది. ఈసారి దాదాపు 8వేల క్వింటాళ్ల వరకు దిగుబడి ఉండవచ్చని అధికారులు, జీసీసీ సేల్స్మెన్స్ అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు కేవలం 500 క్వింటాళ్లు మాత్రమే జీసీసీ డిపోలకు వచ్చాయి. దీంతో మిగితావి ఎటుపోయాయంటూ విచారించారు. మణుగూరు, భద్రాచలం ప్రాంతాలకు చెందిన కొందరు దళారులు గుండాల ప్రాంతానికి రాత్రివేళల్లో వచ్చి గిరిజనుల నుంచి కొనుగోలు చేస్తున్నట్టు జీసీసీ సిబ్బంది ఫారెస్ట్, పోలీసుల దృష్టికి వచ్చింది.
రూ.35కు కొని రూ.95కు అమ్ముతున్నారు..
పోలీసులు దళారుల కదలికలపై నిఘా పెట్టారు. దామరతోగు, చిన్న వెంకటాపురం, సాయన్నపల్లి ప్రాంతాల్లో గిరిజనుల నుంచి ముష్టిగింజలను కొంటున్న దళారులను వారు పట్టుకున్నారు. విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు50క్వింటాళ్ల ముష్టిగింజలను స్వాధీనం చేసుకున్నారు. గిరిజనుల వద్ద కిలో రూ.35కి కొని వాటిని ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘడ్లలో కిలో రూ.95 చొప్పున అమ్ముతున్నారు. జీసీసీ కిలో ముష్టిగింజలను రూ.45కు కొంటున్నా ఇంటి వద్దకే దళారులు వస్తుండడంతో తక్కువకైనా అమ్ముకుంటున్నారు. గుండాలలోని జీసీసీ డిపోకు ఆటోల్లో వచ్చి అమ్ముకోవాలంటే టైంతోపాటు ఖర్చు అవుతుండడంతో రూ.10 తక్కువైనా దళారులకు అమ్మేందుకే గిరిజనులు మొగ్గు చూపుతున్నారు. జీసీసీ వద్దకు వెళితే క్వాలిటీ అంటూ ఇబ్బందులు పెడతారని మాయమాటలతో గిరిజనులను దళారులు మోసం చేస్తూ కొంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 6 వేల క్వింటాళ్ల వరకు దళారులు ముష్టిగింజలను కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఎగుమతి చేసినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా ఈ విషయంలో దళారులకు భద్రాచలం, మణుగూరులకు చెందిన కొందరు జీసీసీ డిపోల సిబ్బంది అండగా ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
దళారుల సమాచారం అందించాలె..
నిబంధనల ప్రకారం అటవీ ఉత్పత్తులను జీసీసీ మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉందని ఫారెస్ట్ రేంజర్ మురళి, జీసీసీ సేల్స్మెన్అంబటి శ్రీనివాస్పేర్కొన్నారు. ముష్టిగింజలను ఇతరులు కొనుగోలు చేస్తే చట్టపరంగా చర్య తీసుకుంటామని హెచ్చరించారు. వారు వచ్చిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.