మహబూబాబాద్ జిల్లాలో తహసీల్దార్‌పై గిరిజనులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని సాలర్ తండా సమీపంలో 551 సర్వే నంబర్లో కోర్టు భవన నిర్మాణం కోసం భూసర్వే చేయడానికి రెవెన్యూ అధికారులు వెళ్లారు. భూసర్వేకు వ్యతిరేకంగా అధికారులను గిరిజన యువత, మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా ఘర్షణకు దారి తీసింది.
పలువురు గిరిజన రైతులు తహసీల్దార్ ఇమ్మాన్యుయేల్‌పై రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో తహసీల్దార్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.