టీఆర్ఎస్​ సర్కార్​ మహనీయులను మరిచింది

మహనీయులను కూడా టీఆర్ఎస్​ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు అది చేస్తాం.. ఇది చేస్తామంటూ అబద్ధపు హామీలు ఇచ్చి.. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ హామీలను మరిచిపోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మహనీయుల జయంతులను ఘనంగా నిర్వహించుకుంటే.. ప్రత్యేక రాష్ట్రంలో కరోనాను సాకుగా చూపిస్తూ అలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు.

ఏప్రిల్ 5న డాక్టర్​ బాబూ జగ్జీవన్ రామ్, ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిబా పూలే, ఏప్రిల్​ 14న డాక్టర్​ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉన్నాయి. గతంలో ఈ కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దళిత, బహుజన సంఘాలు పల్లె నుంచి ఢిల్లీ వరకు మహనీయుల ఉత్సవ కమిటీల పేరుతో ఘనంగా నిర్వహించేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి 2019 వరకు మహనీయుల ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసేవారు. దళిత సంఘాలను నమావేశ పరిచి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిధులను కేటాయించి ఉత్సవాలను నిర్వహించేవారు. సామాజిక సేవలో ముందున్న వారిని గుర్తించి “దళిత రత్న’’, ‘‘యువ రత్న’’, “కళా రత్న”వంటి అవార్డులను సాంఘిక సంక్షేమ శాఖ అందించి సత్కరించేది. 
 

కరోనాను సాకుగా చూపుతూ..
గత ఏడాది కరోనా సాకుతో మహనీయుల జయంతులను కేసీఆర్​ ప్రభుత్వం నిర్వహించలేదు. రాష్ట్రంలో టీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం సీటు చేపట్టిన కేసీఆర్​మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. ‘‘అంబేద్కర్ లేకుంటే భారత రాజ్యాంగం లేదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యానంటే ఆ మహనీయుడు అంబేద్కర్ భిక్ష వల్లనే అయ్యాను’’అని ఉపన్యాసాలు ఇచ్చారు. 2016లో ఏప్రిల్ 14న అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని, దేశం గర్వించేలా చేస్తానని శంకుస్థావన కూడా చేశారు. ఆ తర్వాత దానిని మరిచిపోయారు. మళ్లీ జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ గార్డెన్​లో అంబేద్కర్​ విగ్రహం పెడతామని జీవోను కూడా తీసుకొచ్చి 2021 ఏప్రిల్ 14న అంబేద్కర్​ 130వ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తామని ఎంత ప్రచారం చేసుకోవాలో అంతా చేసుకున్నారు. దళిత, బహుజన, అణగారిన ప్రజల ఓట్లతో జీహెచ్ఎంసీ పీఠం దక్కించుకున్నారు. ఆ తర్వాత విగ్రహం విషయమే మరిచిపోయారు.
 

సభలు, సమావేశాలకు కరోనా అడ్డు కాదా?
కరోనా నమయంలోనే దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వచ్చాయి. ఈ సందర్భంగా లక్షలాది మందితో ఎన్నికల సభలు, నమావేశాలు, ర్యాలీలు నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల టైంలోనూ ర్యాలీలు, సభలు, నమావేశాలు యథావిధిగా జరిగాయి. తాజాగా నాగార్జునసాగర్ లో ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రులు, ఎమ్మేల్యేల అధికారిక కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వేలాది మందితో జరుగుతూనే ఉన్నాయి. కానీ, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం విషయం అడుగుతారనే భయానికే కరోనాను సాకుగా చూపించి మహనీయుల జయంతులను రద్దు చేయడం దారుణం. ఇది ఆ మహనీయులను విస్మరించడమే అవుతుంది. మహనీయుల జయంతులను జరపకపోవడం మనల్ని మనం వంచించుకోవడమే. మహనీయుల జయంతుల వరకూ వచ్చేసరికి కరోనాను సాకుగా చూపించడం అంటే దళితులను అవమానించడమే. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వారి జయంతులను అధికారికంగా నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి మహనీయుల జయంతి ఉత్సవాలను నిర్వహించాలి.

                                                                                                                                       - జేరిపోతుల పరశురామ్,జాతీయ అధ్యక్షుడు,కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి