మేయర్ నుంచి ప్రాణహాని ఉందంటూ టీఆర్ఎస్ నేత ఆరోపణ
ఖైరతాబాద్ వెలుగు: తనను జైల్లో పెట్టిస్తానని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బెదిరించిందని, ఆమె నుంచి ప్రాణహాని ఉందని సిటీ టీఆర్ఎస్ నేత చెట్లపల్లి రామ్ చందర్ ఆరోపించారు. బంజారా హిల్స్ లో ఓ కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణంలో ఉండగా, రాఘవేంద్ర కనస్ట్రక్షన్అనే సంస్థ నాలాను కబ్జా చేస్తుండగా, స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని 3 నెలల కిందట ఆర్టీఐ కింద అర్జీని అధికారులకు పెట్టినట్లు ఆయన తెలిపారు. దీనిపై మేయర్ కలుగజేసుకొని శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తనకు కాల్ చేసిందని, ‘ రామ్ చందర్.. నిన్ను జైల్లో పెడతా.. పోలీసులను పంపించి అరెస్ట్ చేయిస్తా.. అంటూ బెదిరించిందని ఆయన ఆరోపించారు. తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తానని ఆయన చెప్పారు.