న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో పండిన వడ్లన్నీ కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలో టీఆర్ఎస్ మహాధర్నా చేపట్టనుంది. ఢిల్లీ తెలంగాణ భవన్ లో జరగనున్న ఈ ధర్నాకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు ధర్నా ప్రారంభం కానుంది. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ ఢిల్లీకి చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా, మండల స్థాయి నేతలు, ఇతర ప్రజా ప్రతినిధులు ధర్నాలో పాల్గొననున్నారు. దీనికి దాదాపు 1,500 మంది హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో, ముఖ్య కూడళ్లలో కేసీఆర్, కేటీఆర్, కవిత, మంత్రులు, ఎంపీల హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు.
నేషనల్ పాలిటిక్స్ పై గురి
రాష్ట్రంలోని వడ్ల కొనుగోళ్లను జాతీయ సమస్యగా చిత్రీకరిస్తూ.. నేషనల్ లెవల్ లో చర్చను లేవనెత్తాలని కేసీఆర్ భావిస్తున్నారు. మహాధర్నాకు ఉత్తరాదిలోని రైతు సంఘాలను ఆహ్వానించి, కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతను కూడగట్టాలని చూస్తున్నారు. ధర్నాకు మద్దతు తెలపాలని పలు రైతు సంఘాల ప్రతినిధులకు ఆయన ఫోన్ చేశారు. బీకేయూ నేత రాకేశ్ టికాయత్, ఇతర ముఖ్యనేతల్ని ఆహ్వానించారు.
కేసీఆర్ హాజరవుతరా?
మహాధర్నాలో కేసీఆర్ పాల్గొంటారా? లేదా అన్న అంశంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. మంత్రులు, ఎంపీలు కూడా ఈ విషయంలో ఏం చెప్పలేకపోతున్నారు. అయితే, ధర్నా వేదికపై కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ భారీ కటౌట్ మాత్రం పెట్టారు. సీఎంను దృష్టిలో పెట్టుకొని స్టేజ్ డిజైన్, భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికకు ముందు భాగంలో వడ్లను కుప్ప పోయనున్నారు. పంటి ఆపరేషన్ కోసం ఈ నెల 3న ఢిల్లీకి వచ్చిన సీఎం కేసీఆర్ అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు.