నిజామాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో నుజ్జు నుజ్జు

నిజామాబాద్ శివారులోని అర్సపల్లి బైపాస్ రోడ్డులో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం సాయంత్రం నిజామాబాద్ నుంచి రెంజల్ మండలం దూపల్లి వెళ్తున్న ఆటోను.. ఎదురుగా వచ్చిన అశోక్ లే ల్యాండ్ పికప్ వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 

ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. సంఘటన జరిగిన ప్రాంతంలో అతివేగంతో రెండు వాహనాలు ఢీకొట్టుకోగా.. మృతదేహాలతో పరిస్థితి భయానకంగా మారింది. గాయపడినవాళ్లను జిల్లా ఆసుపత్రికి తరలించారు. 

నిజామాబాద్ లో ఓ భవన నిర్మాణ పనులు చేసి.. ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. చనిపోయిన వాళ్లు, గాయపడిన వాళ్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి కారణమైన అశోక్ లే ల్యాండ్ వాహనంలో ఉన్న వాళ్లకు పెద్దగా గాయాలు కాలేదని తెలిసింది. సంఘటన స్థలానికి నిజామాబాద్ 6వ టౌన్ పోలీస్ లు చేరుకుని విచారణ చేపట్టారు.