టూరిజం, ట్రావెల్స్ ప్యాకేజీపై..తిరుమల దర్శనాలు రద్దు

టూరిజం, ట్రావెల్స్ ప్యాకేజీపై..తిరుమల దర్శనాలు రద్దు
  • బ్లాక్ టికెట్ల దందాను అరికట్టేందుకు టీటీడీ బోర్డు నిర్ణయం

హైదరాబాద్, వెలుగు : టూరిజం, ట్రావెల్స్ ప్యాకేజీలపై తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే పర్యాటకులు, భక్తులకు ఆదివారం నుంచి దర్శనానికి అనుమతి లేదని టీటీడీ బోర్డు ప్రకటించింది. సాధారణ భక్తుల మాదిరిగానే స్వామివారిని దర్శించుకోవాలని సూచించింది. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల నుంచి టూరిజం, ఆర్టీసీ, ట్రావెల్స్ తరఫున ప్యాకేజీపై వెళ్లే వారికి ఇది వర్తించనున్నది. ఈ నిర్ణయంతో ఆర్టీసీ, టూరిజం శాఖకు షాక్ తగిలింది. ప్రైవేట్ ట్రావెల్స్ ఉపాధిపైనా ఎఫెక్ట్ చూపనున్నది. హైదరాబాద్ నుంచి తిరుపతికి రోజూ రెండు నుంచి మూడు బస్సులు వెళ్తాయి. 

డైలీ 130 నుంచి 145 మంది వరకు భక్తులు, పర్యాటకులు అక్కడికి దర్శనానికి వెళ్తారు. మూడు రోజుల టూర్​లో భాగంగా తిరుపతి, తిరుమల, తిరుచానూరులో పర్యటించే అవకాశం కల్పించింది. హైదరాబాద్ లో సాయంత్రం 5.30 గంటలకు బస్సు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.00 గంటల వరకు తిరుపతికి చేరుకుంటుంది. పర్యాటకులకు స్వామివారి శ్రీఘదర్శనం చేయించిన తర్వాత ఇతర పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లి మళ్లీ హైదరాబాద్​కు  తీసుకొస్తారు. 

ఏసీ ఓల్వో బస్సుకు పెద్దలకు ఒక్కరికీ టిక్కెట్ రూ.3,800, పిల్లలకు 3,040 రేట్ ఫిక్స్ చేసింది. ఈ ప్యాకేజీలోనే తిరుపతిలో స్వామివారి దర్శనంతో పాటు అకామడేషన్, దర్శనం కల్పిస్తారు. ఫుడ్ ఖర్చులు ఎవరికి వారే సొంతంగా భరించాలి. ప్రతి శుక్రవారం, శనివారం ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఉంది. తిరుపతి, తిరుమల, తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, కపిల తీర్థం తీసుకెళ్తారు. 

దర్శన టిక్కెట్ల దందాను అరికట్టేందుకు..

వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి సంబంధించిన టికెట్ల విషయంలో గోల్ మాల్ జరుగుతున్నది. టూర్ ప్యాకేజీ పేరుతో స్వామివారి దర్శన టిక్కెట్లను బ్లాక్​లో ఎక్కువ ధరలకు అమ్ముకొని దళారులు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో బ్లాక్ టికెట్ల దందాను అరికట్టేందుకు టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగా టూరిజం, ఆర్టీసీ తరఫున ప్యాకేజీలపై వచ్చేవారికి తిరుమలలో దర్శనానికి అనుమతి నిరాకరించింది. ఇక నుంచి వారు కూడా సాధారణ భక్తుల మాదిరిగా దర్శనం చేసుకోవాలి. 

ఈ మేరకు టీటీడీ బోర్డు తెలంగాణతోపాటు అన్ని రాష్ట్రాల టూరిజం, ఆర్టీసీ, ట్రావెల్స్​ నిర్వాహకులకు  సమాచారం చేరవేసింది. దీంతో రాష్ట్రంలో టూరిజం శాఖకు, ఆర్టీసీకి భారీగా ఆదాయం తగ్గనున్నది. టీటీడీ బోర్డు తన నిర్ణయంపై పునరాలోచించాలని తెలంగాణ టూరిజం, ఆర్టీసీ శాఖలు కోరుతున్నాయి. ప్యాకేజీలపై వచ్చేవారికి స్వామివారి దర్శనం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.