‘సీతమ్మసాగర్’ను పరిశీలించిన ద్విసభ్య కమిటీ ‌‌‌‌‌‌‌‌

అశ్వాపురం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ ప్రాజెక్టును గురువారం ద్వి సభ్య కమిటీ విజిట్​చేసింది. ఇందులో గోదావరి నది మేనేజ్​మెంట్​బోర్డ్​ఎస్ఈకే ప్రసాద్, కేంద్ర పర్యావరణ శాఖ డైరెక్టర్ కత్తుల తరుణ్ ఉన్నారు. దుమ్ముగూడెం మండలానికి చెందిన తెల్లం నరేశ్.. ​సీతమ్మసాగర్ పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని, ఆ పనులు నిలిపివేయాలంటూ చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ని ఆశ్రయించారు. దీంతో  అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మాణం చేపట్టాలని, అప్పటివరకు వర్క్స్​ నిలిపివేయాలని ఆదేశిస్తూ గత మార్చిలో ఎన్జీటీ ఉత్తర్వులిచ్చింది. అయినా పనులు ఆపకపోవడంతో ఫిర్యాదుదారులు ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశంలో ఆందోళనలు చేశారు. పనులు నిర్వహిస్తున్న ఫొటోలు, వీడియోలు తీసి గత నెల 23న ఫిర్యాదుదారుడు మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించాడు.

దీంతో నిజా నిజాలను నిర్ధారించేందుకు ఎన్జీటీ ద్విసభ్య కమిటీని నియమించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెబుతూ కేసును వచ్చే నెల12కు వాయిదా వేసింది. దీంతో ద్విసభ్య కమిటీ సభ్యులు ప్రసాద్​, తరుణ్​ బుధవారం వచ్చారు. ఫిర్యాదు చేసిన తెల్లం నరేశ్ తో పాటు ఇరిగేషన్​ఆఫీసర్లతో అశ్వాపురంలోని ఎల్అండ్​టీ ఆఫీసులో  విడివిడిగా మాట్లాడారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశానికి చేరుకుని సుమారు 45 నిమిషాల సేపు పరిశీలించారు. అయితే, నిర్మాణ ప్రదేశానికి ఫిర్యాదుదారుడు నరేశ్​ తరపున వచ్చిన సుప్రీంకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్ ను వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రాజెక్టును విజిట్​ చేసి వీడియోలు, ఫొటోలు తీశామని, త్వరలోనే నివేదికను ఎన్జీటీకి అందజేస్తామన్నారు. వెంట నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస రెడ్డి, ఎస్సీ వెంకటేశ్వర్ రెడ్డి, ఏఈ నవీన్ పర్యావరణ శాఖ ఈఈ రవీందర్రావు, ఎల్అండ్ టీ అధికారులు ఉన్నారు.