- రూ.300 కోట్లతో వరంగల్, ఆదిలాబాద్‌లో హాస్పిటళ్లు కట్టినా టెస్టుల్లేవ్, ట్రీట్‍మెంట్ లేదు
- ఆదిలాబాద్‌లో ఇప్పటికీ డాక్టర్లను నియమిస్తలే
- వరంగల్‌లో డాక్టర్ల కాంట్రాక్ట్ గడువు ముగిసినా పొడిగిస్తలే
- వందల కోట్లు పెట్టి కట్టినా ఓపీ సేవలే దిక్కు
- ఎప్పట్లెక్కనే ఎమర్జెన్సీ టైంలో హైదరాబాద్‌కు రెఫర్
వరంగల్/ ఆదిలాబాద్, వెలుగు: సామాన్యులకు సూపర్‌స్పెషాలిటీ ట్రీట్మెంట్అందించేందుకు రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం రూ.300 కోట్లతో నిర్మించిన రెండు సూపర్‌స్పెషాలిటీ హాస్పిటళ్లు రాష్ట్ర సర్కారు తీరుతో అక్కరకు రాకుండా పోతున్నాయి. ఉస్మానియా, గాంధీ దవాఖాన్లను మించి వైద్యసేవలు అందించాలని భావించినా వట్టిదే అవుతున్నది. ఆదిలాబాద్‌లో డాక్టర్ పోస్టులను నేటికీ భర్తీ చేయని రాష్ట్ర సర్కారు.. వరంగల్‌లో 30 మంది డాక్టర్ల కాంట్రాక్ట్‌ను నెలరోజులుగా పొడిగించలేదు. అవసరమైన పారామెడికల్సిబ్బంది లేకపోవడంతో ఎక్విప్మెంట్ ఉన్నా టెస్టులు, స్కానింగ్‍లు చేయలేని పరిస్థితి. దీంతో ఆయా జిల్లాల నుంచి వచ్చే ఎమర్జెన్సీ పేషెంట్లను ఎప్పట్లాగే ఉస్మానియా, గాంధీ దవాఖాన్లకు పంపుతున్నారు. దీని వల్ల హైదరాబాద్ తరలించే క్రమంలోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఆదిలాబాద్‌లో 42 డాక్టర్ పోస్టులు ఖాళీ
ఆదిలాబాద్‌లోని సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్లో 52 మంది డాక్టర్ల అవసరం ఉండగా, కేవలం13 పోస్టులు భర్తీ చేశారు. మిగతా 39 పోస్టులకు ఎన్నిసార్లు నోటిఫికేషన్ఇచ్చినా ఒక్కరూ రాలేదు. పైగా మొదట రిక్రూట్‌చేసిన డాక్టర్లలో ముగ్గురు ఇటీవల రాజీనామా చేసి వెళ్లిపోయారు. అంటే ప్రస్తుతం 42 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేట్ లో స్పెషలిస్టు డాక్టర్ల జీతం రూ. 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉండగా.. రాష్ట్ర సర్కారు మాత్రం నెలకు రూ. లక్షా ఇరవై వేలు మాత్రమే ఇస్తున్నది. అది కూడా కాంట్రాక్ట్ పద్ధతిన నియమిస్తుండడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ విషయంపై దృష్టి పెట్టని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారీ నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది. నిజానికి ప్రధానమంత్రి స్వస్థి సురక్ష యోజన (పీఎంఎస్‌ఎస్‌వై) కింద ఆదిలాబాద్‌కు 210 బెడ్స్‌తో 2016లోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను కేంద్రం మంజూరు చేసింది. రిమ్స్ మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న 3.42 ఎకరాల దవాఖాన స్థలంలో రూ.150 కోట్లతో నిర్మాణం మొదలుపెట్టారు. 2018లో పూర్తి కావాల్సి ఉండగా.. రూ.30 కోట్ల మ్యాచింగ్గ్రాంట్ విడుదల చేయడంలో రాష్ట్ర సర్కారు తీవ్ర జాప్యం చేసింది. దీంతో రెండేండ్లు ఆలస్యంగా పనులు పూర్తయ్యాయి. 2022 మార్చి 3న మంత్రి హరీశ్ ఈ దవాఖానను ఓపెన్చేసినప్పటికీ పూర్తిస్థాయిలో ఎక్విప్మెంట్, స్పెషలిస్టు డాక్టర్లు లేకపోవడంతో ఓపీ సేవలకే పరిమితం చేశారు. అది కూడా యూరాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిక్ విభాగాల్లో మాత్రమే ఔట్‌పేషెంట్లను చూస్తున్నారు. దీంతో ఎమర్జెన్సీ పేషెంట్లను ఎప్పట్లాగే హైదరాబాద్, కరీంనగర్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్ కు తరలిస్తున్నారు. ప్రతి నెలా ఇక్కడి నుంచి సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్కోసం సగటున 200 మందికి పైగా పేషెంట్లను ఇతర ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నట్లు వైద్య సిబ్బంది చెప్తున్నారు.
వరంగల్లోనూ ఓపీ సేవలే..
వరంగల్కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) ఆవరణలో నిర్మించిన సూపర్‌స్పెషాలిటీ దవాఖానాలోనూ డాక్టర్ల కొరత నెలకొంది. దీంతో అవసరమైన వైద్య సేవలు అందడం లేదు. ఇక్కడ 6 అంతస్తుల్లో 250 బెడ్లతో దవాఖాన ఏర్పాటు చేశారు. హైదరాబాద్ స్థాయిలో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, మెడికల్ అంకాలజీ, న్యూరో సర్జరీ, కార్డియోథోరాసిక్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పీడియాట్రిక్సర్జరీ, యూరాలజీ, ఆర్థో బాధితులకు సేవలు అందించాలని భావించారు. 2021 జులైలో ఈ హాస్పిటల్ ప్రారంభించగా.. 40 మంది డాక్టర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్నారు. వీరిలో 30 మంది డాక్టర్ల కాంట్రాక్ట్ గడువు ఈ ఏడాది మార్చి 31తోనే ముగిసినా ఇప్పటికీ రెన్యువల్చేయలేదు. డిసెంబర్ 23 నుంచి కార్డియాలజీ, 2022 జనవరి నుంచి మిగితా విభాగాల్లో ట్రీట్‍మెంట్ స్టార్ట్చేశారు. కార్డియాలజీ విభాగంలో మొదట్లో వివిధ సర్జరీలు చేశారు. ముఖ్యంగా యాంజియోగ్రామ్, స్టంట్లు వేసే సర్వీస్ లో మంచిపేరు వచ్చినా.. మార్చి 31న డాక్టర్ల కాంట్రాక్ట్ ముగియడంతో ఈ విభాగంలో సేవలు బంద్అయ్యాయి. అధికారుల విజ్ఞప్తి మేరకు కొందరు డాక్టర్లు అవసరమైనప్పుడు వచ్చి సేవలు అందిస్తున్నారు. డాక్టర్లు తగ్గడంతో ‘2డీ ఈకో’ టెస్టుల కోసమూ ఎదురుచూడాల్సి వస్తున్నది. పారామెడికల్, టెక్నీషియన్ పోస్టులు కూడా ఖాళీగా ఉండడంతో పూర్తి స్థాయి టెస్టులు, స్కానింగ్లుచేయడం లేదు. దీన్ని ప్రైవేట్ల్యాబ్టెక్నీషియన్స్ క్యాష్ చేసుకుంటున్నారు. దవాఖానలోనే పాగా వేసి పేషెంట్స్‌ను బయటకు తీసుకువెళ్లి టెస్టులు చేయిస్తూ దండుకుంటున్నారు. ఇలా దవాఖానకు వచ్చి పేషెంట్ల బంధువుల నుంచి డబ్బులు వసూలు చేయడంతో ఇటీవల ఓ ప్రైవేట్ల్యాబ్ టెక్నీషియన్‍పై కేసు నమోదైంది. కార్డియాలజీ, గ్యాస్ట్రో, మెడికల్ అంకాలజీ, న్యూరాలజీ డిపార్ట్మెంట్స్కేవలం ఓపీకే పరిమితమయ్యాయి. ఈ నాలుగు విభాగాల్లో సోమ, గురువారాల్లో మాత్రమే ఓపీ అందుతుండగా.. వెయ్యి మంది వరకు పేషెంట్లు వస్తున్నారు. కానీ ఎమర్జెన్సీ టైంలో అంటే.. హార్ట్ఎటాక్, పక్షవాతంతో కాళ్లు చేతులు పడిపోయినప్పుడు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి క్రిటికల్ కండీషన్లో వచ్చినప్పుడు ట్రీట్‍మెంట్ ఇచ్చే పరిస్థితి లేక తిప్పి పంపుతున్నారు. వారానికి కేవలం రెండు రోజులు అది కూడా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకే ఓపీ చూస్తున్నారు. మిగతా రోజుల్లో ఎంతమంది వచ్చినా సర్వీస్ లేదని చెబుతున్నారు. ఈ హాస్పిటల్లో కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియట్లేదు. ఆపరేషన్లు చేస్తున్నప్పుడు కరెంట్పోతుండడంతో ఆపరేషన్లు, ఎంఆర్ఐ, స్కానింగ్‍లు ఆగిపోతున్నాయి.
ఈయన బొజ్జ దత్తు. ఆదిలాబాద్ మండలం జందాపూర్ కు చెందిన దత్తు గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో రిమ్స్‌కు తీసుకువెళ్లారు. అక్కడ న్యూరో సర్జన్లేకపోవడంతో హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. అక్కడ వారం రోజుల చికిత్సకు దాదాపు రూ.లక్షా ఇరవై వేలు ఖర్చయింది. వ్యవసాయ కూలీ అయిన దత్తు అప్పు చేసి ఆ డబ్బులు కట్టాడు. ఇలా ఎంతో మంది పక్కనే ఆదిలాబాద్‌లోనే సూపర్‌స్పెషాలిటీ దవాఖాన ఉన్నా అత్యవసర పరిస్థితుల్లో హైదరాబాద్, మహారాష్ట్రకు వెళ్లాల్సి వస్తున్నది. రూ. 150 కోట్లతో కట్టిన దవాఖానలో స్పెషలిస్టులు లేకపోవడంతో ఈ పరిస్థితి ఉన్నది.
డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలి
డాక్టర్ పోస్టులు భర్తీ చేయకుండానే ఆదిలాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించారు. రిమ్స్ ఎమర్జెన్సీలో వైద్యం అందక ఎంతో మంది ఇతర ప్రాంతాల్లోని ప్రైవేట్హాస్పిటళ్లకు వెళ్తున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు తీసుకెళ్తుండగానే చనిపోతున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు వెళ్తే స్పెషలిస్టులు లేకపోవడం, ఇన్‌పేషెంట్‌గా చేర్చుకునే అవకాశం లేకపోవడంతో చాలా మంది సఫర్ అవుతున్నారు. వీలైనంత తొందరగా అన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావాలి.
- ఇట్టెడి శేఖర్ రెడ్డి, బోథ్
యూనిట్లు లేకనే తక్కువ ఓపీ చూస్తున్నం
వరంగల్‌లో సూపర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నప్పటికీ మాకు అందుబాటులో ఉండే యూనిట్స్ఆధారంగానే డాక్టర్లు, సిబ్బంది సర్వీస్ అందించాల్సి ఉంటుంది. మేజర్‍గా చెప్పుకునే కార్డియాలజీ, న్యూరో, గ్యాస్ట్రో తదితర సర్వీసుల్లో ఇప్పటివరకు నలుగురు డాక్టర్లు (ఒక్క యూనిట్) మాత్రమే వారంలో రెండు రోజులు సేవలందిస్తున్నారు. ఇంకా స్థాయి పెంచలేదు. అందువల్లే మిగతా రోజుల్లో ట్రీట్‍మెంట్ అందించలేకపోతున్నాం. సేవలు ఆగకూడదనే ఉద్దేశంతో టెస్టులు, ల్యాబ్‍లకు సంబంధించి ఏ అవసరమున్నా ఎంజీఎం నుంచి పంపిస్తున్నాం. మంచినీటి సమస్య తీర్చేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకువచ్చింది. ఈలోపు చలివేంద్రం ఏర్పాటు చేసేలా గ్రేటర్ కమిషనర్‍తో మాట్లాడుతా.
డాక్టర్ చంద్రశేఖర్, ఎంజీఎం సూపరింటెండెంట్