మేకను ఎత్తుకెళ్లాడంటూ దళితుడిని కట్టేసి కొట్టిండ్రు

మేక ఎత్తుకెళ్లాడంటూ యువకుడిని కట్టేసి కొట్టిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో సెప్టెంబర్ 2న వెలుగులోకి వచ్చింది. బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య కథనం ప్రకారం…పట్టణంలోని యాపల్​ ప్రాంతానికి చెందిన రాములు-స్వరూప దంపతులతో పాటు వారి కుమారుడు శ్రీనివాస్ కలిసి రైల్వే ట్రాక్​ సమీపంలో షెడ్డును ఏర్పాటు చేసుకొని మేకలను పెంచుతున్నారు. 

ఎనిమిది రోజుల కిందట షెడ్డు నుంచి ఒక మేక కనిపించకుండా పోయింది.  అదే ఏరియాకు చెందిన తాపీ మేస్త్రీ వద్ద కూలీ పనులు చేసే చిలుముల  కిరణ్​ అనే వ్యక్తి మేకను దొంగతనం చేశాడని ఆరోపిస్తూ శుక్రవారం రాములు కుటుంబసభ్యులు అతన్ని  షెడ్డులో కట్టేసి కొట్టారు.  

డబ్బులు ఇస్తానే విడిచిపెడుతామని చెప్పడంతో తాపీ మేస్త్రీ శ్రావన్​ డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చి కిరణ్​ను విడిచిపించుకొని వెళ్లాడు.  అయితే శుక్రవారం సాయంత్రం నుంచి కిరణ్​ కనిపించకుండా పోయాడని అతని చిన్నమ్మ నిట్టూరి సరిత శనివారం మందమర్రి పోలీస్​లకు ఫిర్యాదు చేసింది. 

కిరణ్​ దళితుడు కావడంతో పోలీసులు కట్టేసి కొట్టిన వారిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య, టౌన్​ ఎస్సై చంద్రకుమార్​ పరిశీలించి వివరాలను సేకరించారు. 

కిరణ్​ జాడ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామని, కిరణ్​ను కొట్టిన నిందితులను ఆదుపులోకి తీసుకున్నట్లు  ఏసీపీ తెలిపారు.  కాగా కిరణ్​తో పాటు మరో గుర్తుతెలియని వ్యక్తిని  షెడ్డులో కట్టేసి ఉన్నట్లు  ఫొటోలు సైతం  శనివారం సోషల్​ మీడియాలో ట్రోల్​ అయ్యాయి.  

దీనిపై  పోలీసుల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఇటీవలే జిల్లాలో ఓ దళితుడిని కులం పేరుతో దూషిస్తూ కట్టేసి కొట్టిన ఘటన మరవక ముందే మరోటి జరగడం గమనార్హం