ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాలా రంగాల్లోకి విస్తరించేసింది. తాజాగా మిలటరీలోకీ అడుగు పెట్టేస్తోంది. అందుకు అమెరికా కసరత్తులు ఆల్రెడీ మొదలుపెట్టేసింది. చాలా దేశాలు లేజర్ గైడెడ్ మిసైల్స్‌ను వాడుతున్న సంగతి తెలిసిందే. అంటే టార్గెట్ఎటు వెళితే అటు క్షిపణి వెళ్లేలా లేజర్ ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ కోవలోనే ఏఐ గైడెడ్ మిసైల్స్‌ను తయారు చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది.
కెనాన్ డెలివర్డ్ ఏరియా ఎఫెక్ట్స్ మ్యూనిషన్ (సీ డీమ్) అనే మిసైల్‌ను తయారు చేస్తోంది. అందుకోసం దానిపై కోట్లకు కోట్లు ఆ దేశం కుమ్మరిస్తోంది. జీపీఎస్‌ను వాడుకుంటూ శత్రు దేశాల యుద్ధ ట్యాంకులు, షెల్స్‌ను సీ డీమ్ గుర్తిస్తుంది. వాటి ముప్పును చాలా చాలా ముందుగానే వాటంతట అవే పసిగట్టేలా టెక్నాలజీని తయారు చేస్తోంది. 2021 నాటికి వాటిని సైన్యంలో చేర్చేందుకు పెంటగాన్ శరవేగంగా పనిచేస్తోంది. ప్రస్తుతమున్న 1980లనాటి డ్యుయల్ పర్పస్ ఇంప్రూవ్డ్ కన్వెన్షనల్ మ్యునిషన్ (డీపీఐసీఎం) ఆర్టిల్లరీ రౌండ్స్ స్థానంలో వీటిని ప్రవేశపెట్టనుంది.
ఈ సీ డీమ్ ఆయుధాలు 60 కిలోమీటర్ల పరిధి వరకు దాడులు చేయగలుగుతాయని, 28 చదరపు కిలోమీటర్ల మేర జల్లెడ పట్టేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం కొన్ని ప్రైవేట్ కంపెనీలు పోటీ పడుతున్నాయట. అయితే, ఇది పూర్తిగా అటానమస్ (స్వతంత్ర) ఆయుధం కాదని, ఆ ఉద్దేశంతో తయారు చేస్తున్నదీ అంతకన్నా కాదని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. దాడుల్లో జరిగే నష్టాన్ని తప్పించేందుకే సీ డీమ్ను తయారుచేస్తున్నామన్నారు. ఇప్పుడున్న మిసైల్స్‌తో పోలిస్తే ఇది చాలా శక్తిమంతమైనదని ఆర్మీ వర్గాలు అంటున్నాయి.