రష్యా సైనికులను చెచెన్ ఫైటర్​లే కాల్చిచంపిన్రు

కీవ్/మాస్కో: యుద్ధంలో అతి క్రూరంగా ఎదుటి వాళ్లను టార్చర్ పెట్టి మరీ హతమార్చే చెచెన్ ఫైటర్ లే బుచా నగరంలో నరమేధానికి పాల్పడ్డారని ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. రష్యన్ ఆర్మీకి తోడుగా యుద్ధానికి వచ్చిన వీళ్లే.. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన రష్యన్ సోల్జర్లను సైతం కాల్చిచంపారని వెల్లడించింది. చెచెన్యాకు చెందిన ‘కదిరోవ్ ట్సీ’  నరహంతక ముఠా ఫైటర్ లే బుచాలోని హాస్పిటల్​లో తీవ్ర గాయాలతో ట్రీట్​మెంట్ కోసం చేరిన రష్యన్ సోల్జర్లను కాల్చి చంపారని తమ విచారణలో తేలినట్లు ఉక్రెయిన్ టెరిటోరియల్ ఆర్మీ డిప్యూటీ కమాండర్ చెప్పారు. బయటకొచ్చిన ప్రతి వ్యక్తిపైనా వీళ్లు కాల్పులు జరిపారని తెలిపారు. బుచాలో ఓ టార్చర్ చాంబర్​ను కూడా వీరు నిర్వహించారని, అందులో ప్రజలను, ఉక్రెయిన్ సోల్జర్లను బంధించి చిత్రహింసలు పెట్టారన్నారు. చెచెన్ ఫైటర్​ల దారుణాలను ప్రత్యక్షంగా చూసిన వాళ్లే విచారణలో ఈ విషయాలను వెల్లడించారని పేర్కొన్నారు. మరోవైపు దక్షిణ ఉక్రెయిన్​లోని మరియుపోల్​లోనూ చెచెన్ ఫైటర్​ల నరమేధానికి సంబంధించిన వీడియోలు బయటికొచ్చాయి. చెచెన్ ఫైటర్ లు మరియుపోల్​లో ఇంటింటికీ వెళ్తూ విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ తీసిన టిక్ టాక్ వీడియోలు సైతం వీళ్ల దురాగతాలను కళ్లకు కట్టాయి.

స్టీల్ ప్లాంట్ నుంచి 20 మంది తరలింపు

మరియుపోల్​లోని అజోవ్ స్టల్ స్టీల్ ప్లాంటు నుంచి శనివారం ఆరుగురు పిల్లలు, 14 మంది మహిళలను బయటకు తీసుకొచ్చినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ప్లాంటులోని టన్నెల్స్​లో వెయ్యి మంది పౌరులు, 2 వేల మంది సోల్జర్లు ఉన్నారని రష్యన్ మీడియా సంస్థ ఆర్ఐఏ నొవోస్తి వెల్లడించింది. అయితే, టన్నెల్స్​లో తీవ్రంగా గాయపడిన సోల్జర్లు, పౌరులు చావు బతుకుల మధ్య ఉన్నారని కొందరు వ్యక్తులు పంపిన వీడియో ద్వారా వెల్లడైంది.

జెలెన్ స్కీతో నాన్సీ పెలోసీ భేటీ 

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ శనివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించారు. కీవ్ లో పర్యటించిన నాన్సీ పెలోసీ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం ప్రెసిడెంట్ జెలెన్ స్కీతో కూడా భేటీ అయింది. కలిసికట్టుగా ఈ యుద్ధాన్ని గెలుస్తామంటూ ఇద్దరు నేతలూ ప్రకటించారు.

లవీవ్​లో ఏంజెలినా జోలీ

హాలివుడ్ నటి, ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ ప్రత్యేక రాయబారి ఏంజెలినా జోలీ ఉక్రెయిన్​లో ఆకస్మికంగా పర్యటించారు. శనివా రం పశ్చిమ ఉక్రెయిన్​లోని లవీవ్ సిటీలో పర్యటించిన ఆమె.. యుద్ధం వల్ల శరణార్థులుగా మారిన ప్రజలు, పిల్లలను పలకరించారు. శరణార్థులకు సేవలందిస్తున్న వాలంటీర్లు, డాక్టర్ల టీమ్​తోనూ ముచ్చటించారు. లవీవ్ సిటీలోని ఓ రైల్వే స్టేషన్ వద్ద శరణార్థులను ఆమె పలకరించారు. ఓ చిన్నారిని ఎత్తుకుని చక్కిలిగింతలు పెట్టి గట్టిగా నవ్వించారు. పిల్లలు, వాలంటీర్లతో ఫొటోలు దిగారు