కరీంనగర్‌‌‌‌ జిల్లాలో..అడుగంటిన భూగర్భ జలాలు

  •    వర్షాకాలంలో సరిపడా వానలు లేక నీటి సమస్య
  •     కరీంనగర్‌‌‌‌ జిల్లాలో పడిపోయిన గ్రౌండ్ వాటర్ లెవల్స్
  •     చిగురుమామిడి, రామడుగు, కొత్తపల్లి మండలాల్లో బిక్కిన బోర్లు, బావులు
  •     కొన్నిచోట్ల చివరి తడికి అందని సాగునీరు

చిగురుమామిడి మండలం బొమ్మెనపల్లికి చెందిన ఈ రైతు పేరు చట్ల మొగిలి. ఆయన సాగుకు ఆధారమైన వ్యవసాయ  బావి పూర్తిగా అడుగంటింది. దీంతో ఆయన రూ.30 వేలు ఖర్చు పెట్టి ఇటీవల క్రేన్ సాయంతో 2 గజాల్లోతు పూడిక తీయించాడు. అయినా ఫలితం దక్కలేదు. సాగు చేసిన 4 ఎకరాల వరి పంటకు బావిలో నీరు సరిపోవడం లేదు. దీంతో రెండున్నర ఎకరాలు ఎండిపోయింది. 

కరీంనగర్, వెలుగు : ఎండలు ముదురుతున్న కొద్దీ కరీంనగర్‌‌‌‌ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గత వర్షాకాలంలో సెప్టెంబర్ తర్వాత తగినంతగా వానలు లేకపోవడంతో జలాశయాలు నిండలేదు. దీంతో గ్రౌండ్​ వాటర్​ లేక బావులు, బోర్లు ఎండిపోతున్నారు. మరోవైపు ఎండ తీవ్రత పెరగడంతో పంటలకు ఎక్కువ మోతాదులో నీరు అవసరమవుతోంది. గత నెలాఖరులో భూగర్భ జలవనరుల శాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా గ్రౌండ్ వాటర్ లెవల్స్ పరిశీలించగా.. గతేడాదితో పోలిస్తే వాటర్ లెవల్స్ ఈసారి ఎక్కువ లోతుకు పడిపోయినట్లు గుర్తించారు. రామడుగు, చిగురుమామిడి మండలాల్లో 11 మీటర్లకుపైగా కిందికి దిగిపోవడంతో బోర్లు, బావులు అడుగంటాయి. 

మూడు మండలాల్లోనే ఎక్కువ.. 

భూగర్భ జలశాఖ లెక్కల ప్రకారం.. 2023 ఫిబ్రవరిలో రామడుగు మండలంలో 8.31 మీటర్ల లోతుల భూగర్భ జలాలు ఉండగా, ప్రస్తుతం 11.85 మీటర్ల లోతుల్లోకి వెళ్లాయి. చిగురుమామిడిలో నిరుడు 7.05 మీటర్ల లోతులో నీరు ఉండగా.. ఇప్పుడు 11.32 మీటర్లకు పడిపోయింది. ఆ తర్వాత కొత్తపల్లి మండలంలో నిరుడు 7.11 మీటర్ల లోతులో ఉండగా, ఈ సారి 10.65 మీటర్లకు వెళ్లింది. అలాగే తిమ్మాపూర్, గన్నేరువరం, హుజూరాబాద్ మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. చొప్పదండి, గంగాధర, మానకొండూరు, వీణవంక మండలాల్లో మినహా మిగతా అన్ని మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. 

కాల్వల్లోనే బావులు తవ్వుతున్నరు

గంగాధర, రామడుగు మండలాలకు వరద కాల్వల ద్వారా పూర్తి స్థాయిలో నీళ్లు రాకపోవడంతో పంటలను కాపాడుకునేందుకు కాల్వలోనే బావులు తవ్వుతున్నారు. అందులోని ఊటగా వచ్చిన నీళ్లను మోటార్ల ద్వారా పంటలకు మళ్లిస్తున్నారు. మిగతా ప్రాంతాల్లోనూ బావులు, బోర్ల ద్వారా నీటిని తోడేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

గ్రౌండ్​ వాటర్‌‌‌‌ లెవల్స్‌‌ (మీటర్లలో) ఫిబ్రవరి నెలలో

మండలం                2023      2024 
రామడుగు                 8.31    11.85 
చిగురుమామిడి         7.05    11.32
కొత్తపల్లి                     7.11     10.65
తిమ్మపూర్                9.85    10.26
గన్నేరువరం             7.17    8.35 
హుజూరాబాద్          5.45    7.71
కరీంనగర్                  7.40    7.45 
ఇల్లందకుంట          5.95    7.07